బాలకృష్ణ - చిరంజీవి వివాదంలో పవన్ కళ్యాణ్ ఎటు వైపు?
ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు చిరంజీవికి, బాలకృష్ణకు మాటల యుద్ధం జరిగిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవం.
By: Tupaki Desk | 26 Sept 2025 9:42 AM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజగా చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవి ప్రకటనలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అన్నయ్య చిరంజీవీ, మరోవైపు కూటమిలోని కీలక ఎమ్మెల్యే కం హీరో బాలకృష్ణల వ్యాఖ్యల నడుమ పవన్ స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
*బాలకృష్ణ ఏమన్నారంటే?
బాలకృష్ణ అసెంబ్లీలో ప్రసంగిస్తూ సినీ నటులకు అవమానం జరిగిందన్న మాట వాస్తవమేనని, అయితే చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ వచ్చి కలిశారన్నది అబద్ధమని వ్యాఖ్యానించారు. అప్పట్లో జగన్‌ను ఎవరూ గట్టిగా అడగలేదని ఆయన అన్నారు. “ఇండస్ట్రీ పెద్దలు కలవడానికి వెళ్లినప్పుడు.. ముఖ్యమంత్రి కలవరు, సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడతారని చెబితే... అప్పుడు చిరంజీవీ గట్టిగా అడిగితే... అప్పటి సీఎం దిగొచ్చి కలిశారన్నది అబద్ధం. దాన్ని ఖండిస్తున్నాను” అని ఆయన తీవ్ర స్వరంతో బాలయ్య అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సినీరంగ ప్రముఖులతో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూపొందించిన జాబితాలో తన పేరును తొమ్మిదో స్థానంలో వేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎవరు అలా వేశారని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేశ్‌ను అడిగాను. ఇదేనా వ్యక్తులకు ఇచ్చే గౌరవం” అని బాలకృష్ణ మండిపడ్డారు.
-చిరంజీవి స్పందన ఇదీ
వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరల పెంపు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన పరిణామాలను వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం..‘‘అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, చలన చిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తనను కలిసి టికెట్ల ధరల పెంపు కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడాలని కోరారు. వారి సూచన మేరకే తాను అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో మాట్లాడానని చిరంజీవి తెలిపారు. మంత్రి పేర్ని నాని పిలుపు మేరకు తరువాత ముఖ్యమంత్రిని కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో బాలకృష్ణను సంప్రదించడానికి ఫోన్‌లో ప్రయత్నించానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చిరంజీవి వెల్లడించారు. నిర్మాత జెమినీ కిరణ్ కూడా ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారని తెలిపారు. దాంతో ఆర్.నారాయణమూర్తి సహా కొందరు సినీ ప్రముఖులతో కలిసి జగన్‌ను కలిసి సినీ పరిశ్రమకు సహకారం అందించాలని కోరినట్టు వివరించారు. తాను తీసుకున్న చొరవతోనే అప్పట్లో ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపునకు అంగీకారం తెలిపిందని, ఆ నిర్ణయం ‘వీరసింహారెడ్డి’తో సహా తన ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలకు కూడా టికెట్ల ధరలు పెరగడానికి కారణమైందని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ పెంపు నిర్మాతలకు, పంపిణీదారులకు, ప్రదర్శనకారులకు లాభం చేకూర్చిందని’’ పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున ఈ ప్రకటన ద్వారా వాస్తవాన్ని తెలియజేస్తున్నానని చిరంజీవి ముగించారు.
*చిరంజీవికి-బాలకృష్ణకు మాటల యుద్ధం జరగలేదు
ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు చిరంజీవికి, బాలకృష్ణకు మాటల యుద్ధం జరిగిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఎందుకంటే ఆరోజు నాటి ముఖ్యమంత్రి జగన్ ను కలిసే సమయంలో జరిగిన పరిణామాలపైనే అసెంబ్లీలో చర్చ జరిగింది. చిరంజీవికి నాడు అవమానం జరిగిందని కామినేని ప్రస్తావిస్తే..దానికి కౌంటర్ గా బాలయ్య నాటి సంగతులను గుర్తు చేశారు. తనపేరును చివరన పెట్టారని ప్రశ్నించారు. ఇందులో నేరుగా చిరంజీవిపై బాలయ్య ఎలాంటి కామెంట్ చేయలేదు. నాటి పరిణామాలను మాత్రమే బాలయ్య అసెంబ్లీలో ప్రస్తావించారు.
ఇక చిరంజీవి సైతం నాడు నాటి ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో జరిగిన పరిణామాలనే ప్రకటనలో ప్రస్తావించారు. ఇందులో ఎవరికి అవమానం జరగలేదని..వాళ్లు పిలిచిన మేరకే వెళ్లామని.. అక్కడ సరైన ప్రాధాన్యత దక్కిందంటూ ముగించారు.
*పవన్ స్పందన ఏంటి?
అసెంబ్లీలో బాలయ్య.. బయట సోదరుడు చిరంజీవి ప్రకటనల దరిమిలా దీనిమీద డిప్యూటీ సీఎం కూటమిలో కీలక నేత పవన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ఈ చిన్న వివాదాన్ని అసలు ఎవరూ ఎవరినీ అనని దాన్ని మీడియా, సోషల్ మీడియా హైలెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తుండడంతో పవన్ దీనిపై ఎలా స్పందిస్తాడు? ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేస్తాడన్నది ఆసక్తి రేపుతోంది.
