Begin typing your search above and press return to search.

అమరావతిలో బాలకృష్ణకు 200 ఎకరాలు.. వైసీపీ ప్రచారంలో నిజమెంత?

ఇక ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు బాలయ్య 200 ఎకరాలు ఎక్కడా కొనలేదని, కావాలంటే రెవెన్యూ వెబ్ సైట్ మీ భూమిలో బాలయ్య పేరున ఎంత భూమి ఉందో చెక్ చేసుకోవచ్చని సవాల్ విసురుతున్నారు.

By:  Tupaki Desk   |   18 April 2025 6:46 PM IST
అమరావతిలో బాలకృష్ణకు 200 ఎకరాలు.. వైసీపీ ప్రచారంలో నిజమెంత?
X

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు బావ మరిది నందమూరి బాలకృష్ణ రాజధాని అమరావతిలో 200 ఎకరాల స్థలం కొనుగోలు చేశారంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. వైసీపీ గా చెబుతున్న సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేస్తున్న ఈ అంశంలో నిజా నిజాలేంటన్నది తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమారుడిగా, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, వియ్యంకుడిగానే కాకుండా సినీ నటుడిగా బాలకృష్ణకు గుర్తింపు ఉంది. దీంతో ఆయన 200 ఎకరాలు కొనుగోలు చేశారంటూ జరుగుతున్న ప్రచారం ప్రాధానం సంతరించుకుంది.

వాస్తవానికి 50 ఏళ్ల నట జీవితం, 20 ఏళ్ల రాజకీయ జీవితంలో బాలయ్యపై ఇటువంటి ఆరోపణలు ఎప్పుడూ రాలేదు. తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా, బావ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడైనా బాలయ్య అధికార అర్భాటానికి దూరంగా ఉంటూనే వచ్చారు. ఇక ఆయన స్వయంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నా, ప్రభుత్వంలో జోక్యం చేసుకోరనే అభిప్రాయమే ఉంది. సినీ నటుడుగా కావాల్సిన సంపాదన ఉన్న బాలయ్యకు రాజకీయ అవినీతి ద్వారా సంపాదించాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తన సొంత డబ్బుతో తల్లి బసవతారకం పేరున క్యాన్సర్ ఆస్పత్రి నిర్వహిస్తున్న బాలయ్య రాజకీయాలతోపాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తొలిసారిగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుతం రాజధాని నిర్మిస్తున్న ప్రాంతానికి వెలుపల.. ప్రభుత్వం త్వరలో సమీకరిస్తుందని చెబుతున్న గ్రామాల పరిధిలో బాలయ్య 200 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ప్రతిపక్షానికి చెందిన సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. రాజధాని పరిధిలోని పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాల్లో బాలయ్య 200 ఎకరాలు కొన్నారని, ఈ భూములను ప్రభుత్వం సేకరిస్తుందని తెలుసుకుని అయాచిత లబ్ధికి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని బాలయ్య మద్దతుదారులు చెబుతున్నారు. పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాలు ఇప్పటికే రాజధాని పరిధిలో ఉన్నాయంటున్నారు. ఇక ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు బాలయ్య 200 ఎకరాలు ఎక్కడా కొనలేదని, కావాలంటే రెవెన్యూ వెబ్ సైట్ మీ భూమిలో బాలయ్య పేరున ఎంత భూమి ఉందో చెక్ చేసుకోవచ్చని సవాల్ విసురుతున్నారు.