హిందూపురానికి బాలయ్య గిఫ్ట్.. ఎమ్మెల్యేగా దూకుడు చూపుతున్న అఖండ
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో రాణిస్తున్న గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం బాలకృష్ణ ఎమ్మెల్యేగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
By: Tupaki Desk | 24 Sept 2025 4:11 PM ISTఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో రాణిస్తున్న గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం బాలకృష్ణ ఎమ్మెల్యేగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలకు వచ్చిన బాలయ్య తన సొంత నియోజకవర్గం హిందూపురానికి కావాల్సిన పనులు దగ్గరుండి చేయించుకుంటున్నారు. మంగళవారం టీడీఎల్పీ కార్యాలయంలో సందడి చేసిన బాలయ్య.. ఈ రోజు హిందూపురానికి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును సాధించారు. ఆయన తీసుకున్న చొరవ వల్ల ఆ నియోజకవర్గానికి చెందిన వందలాది చేనేత కుటుంబాలకు ఉపాధి లభించనుందని అధికారులు చెబుతున్నారు.
హిందూపురం నుంచి వరసుగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బాలయ్య. ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2014-19 మధ్యే అనేక ప్రాజెక్టులను తీసుకువెళ్లిన బాలయ్య.. ఇప్పుడు కూడా ఆ జోరు కొనసాగిస్తున్నారు. సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గానికి వెళ్లివస్తూనే ఉంటారు. అదేవిధంగా గత నెలలో దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులతో హిందూపురం అభివృద్ధిపై చర్చించారు. ఈ మేరకు హిందూపురం నియోజకవర్గానికి స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ (ఎస్సీడీపీ)ని సాధించుకున్నారు బాలయ్య. ఈ మేరకు బుధవారం చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత రాష్ట్ర సచివాలయంలో ప్రకటించారు.
బుధవారం అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ తర్వాత మంత్రి సవితను కలిసి హిందూపురంలో ఎస్సీడీపీ ఏర్పాటుపై చర్చించారు. దీనివల్ల నేతలకు ఉపాధితో పాటు ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్లస్టర్ తో 292 మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుందని మంత్రి సవిత వెల్లడించారు. అమరావతి సచివాలయం నాలుగో బ్లాక్ లో ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి హిందూపురంలో స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్(ఎస్సీడీపీ) ఏర్పాటుపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
హిందూపురంలో స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్(ఎస్సీడీపీ) ఏర్పాటుపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతకుముందు హిందూపురంలో ఎస్సీడీపీ ఏర్పాటు, నేతన్నలకు శిక్షణ అందించే విషయమై ఫ్యాషన్ డిజైనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రూ. 1.51 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎస్సీడీపీకి కేంద్రం రూ.1.44 కోట్లు, లబ్ధిదారులు రూ.7.12 లక్షలు వాటాగా ఇవ్వనున్నారన్నారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్.హెచ్.డి.పి) కింద కేంద్ర ప్రభుత్వం హిందూపురానికి ఎస్సీడీపీ మంజూరు చేసింది.
నూతన చేనేత దుస్తుల తయారీలో నిపుణులు, ఫ్యాషన్ డిజైనర్లతో నేతన్నలకు శిక్షణిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామమని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుత తరం ఆలోచనలు, ఫ్యాషన్ ను దృష్టిలో పెట్టుకుని చేనేత దుస్తుల రూపకల్పనపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం అందించడానికి ఎస్సీడీపీ ఎంతో దోహడపడుతుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
