Begin typing your search above and press return to search.

బాల‌య్య ఇలాకాలో భ‌లే మార్పు.. ఇక 'లోటు' లేదు.. !

అంతేకాదు.. తాను స్థానికంగా లేకపోయినప్పటికీ నియోజకవర్గంలో పనులు వడివడిగా ముందుకు జరిగేలా ఇటీవల కొత్తగా ఒక కమిటీని నియమించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

By:  Garuda Media   |   3 Nov 2025 11:39 AM IST
బాల‌య్య ఇలాకాలో భ‌లే మార్పు.. ఇక లోటు లేదు.. !
X

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పనులు వడివడిగా సాగనున్నాయా? మా ఎమ్మెల్యే మాకు దూరం అయ్యార‌న్న వాద‌న ఇక‌, వినిపించ‌డం మానేస్తుందా? ప‌నులు.. ప్రాధాన్యాలు ఆధారంగా ఇక‌, ప్ర‌జ‌ల‌కు అన్నీచేరువ కానున్నాయా? ఇక‌పై లోటు లేకుండా ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలుకూడా సాకారం కానున్నాయా? అంటే..ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయం దక్కించుకున్న నందమూరి బాలకృష్ణ స్థానికంగా ఉండరు అన్న వాదన అయితే బలంగా ఉంది. అయితే.. ఇది ఒక‌ప్ప‌టి మాట‌. త‌ర్వాత‌.. బాల‌య్య త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు.

అంతేకాదు.. తాను స్థానికంగా లేకపోయినప్పటికీ నియోజకవర్గంలో పనులు వడివడిగా ముందుకు జరిగేలా ఇటీవల కొత్తగా ఒక కమిటీని నియమించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీ త్వరలోనే పనులు ప్రారంభిస్తుందని కూడా అంటున్నారు. గతంలో 2014-19 మ‌ధ్య‌ తన పీఏలను ఇద్దరిని నియోజకవర్గంలో ఉంచి పనులు జరిగేలా బాలకృష్ణ చర్యలు తీసుకున్నారు. అయితే వారిపై వివాదాలు, విమర్శలు రావడంతో పక్కనపెట్టారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకున్న బాలకృష్ణ నియోజకవర్గంలో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు.

అదేవిధంగా పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. ఇప్పుడు కొత్తగా కమిటీని ఏర్పాటు చేసి పనులు ముందుకు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మండలాల్లో రహదారుల నిర్మాణం అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు నిర్మించాలని బాలయ్య ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి కొంతమంది ఎన్నారైల నుంచి కూడా ఆయన నిధులు సేకరించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి పంచాయతీ శాఖ నుంచి కూడా నిధులు సమీకరించినట్టు స్వయంగా ఆయన ఇటీవల ప్రకటించారు.

ఈ నెల రెండో వారంలో స్వయంగా ఆయా ప‌నులు ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అక్కడి నుంచి పనులు ఆగకుండా ఒక కమిటీని నియమించి దాని ద్వారా పనుల పర్యవేక్షణ చేప‌ట్టేందుకు ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన బాల‌య్య కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అదేవిధంగా పనులను అంచనా వేసే బాధ్యతలను కూడా కమిటీకి అప్పగిస్తారు. తద్వారా నియోజకవర్గంలో బాలయ్య లేరన్న ఆవేదన ఇకనుంచి ఉండదన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అలాగే.. ప్ర‌జ‌ల‌ను -ప్ర‌భుత్వాన్ని స‌మ‌న్వ‌యం చేసేందుకు కూడా ఈ క‌మిటీ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని అంటున్నారు. సో.. మొత్తానికి హిందూపురంలో బాల‌య్య భ‌లే నిర్ణ‌యం తీసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.