వైసీపీ కార్యకర్త ఇంటి పూజగదిలో బాలయ్య ఫోటో... ఎందుకో తెలుసా?
అవును... పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా బాలయ్య ఎంతో మందికి ఎన్నో రకాల సహాయాలు చేస్తుంటారని చెబుతారు.
By: Tupaki Desk | 16 July 2025 10:54 AM ISTప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. దూరం నుంచి చూసే వారికి బాలయ్య కాస్త కోపదారి మనిషిలా కనిపిస్తారని అంటారు.. కానీ, కాస్త దగ్గరగా చూస్తే మాత్రం ఆయనలో అద్భుతమైన వ్యక్తి కనిపిస్తారని చెబుతారు. ఈ క్రమంలో బాలయ్య గొప్ప మనసు తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.
అవును... పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా బాలయ్య ఎంతో మందికి ఎన్నో రకాల సహాయాలు చేస్తుంటారని చెబుతారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకి బలమైన కార్యకర్తగా ఉన్న వ్యక్తి జీవితాన్ని మార్చేశారు బాలయ్య. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆ వైసీపీ కార్యకర్త వైద్య ఖర్చులు భరిస్తూ, అతని బిడ్డకు కాలేజీలో అడ్మిషన్ ఇప్పించడంతో పాటు ఆర్థిక సహాయం చేసి స్థిరపరిచారు!
వివరాళ్లోకి వెళ్తే... వైసీపీకి మద్దతుదారుగా ఉన్న సిద్ధారెడ్డి అనే వ్యక్తి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇందులో భాగంగా... అతను బ్లాక్ ఫంగస్ అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నారు. దీంతో... ఈ విషయం తన దృష్టికి వచ్చే సరికి బాలయ్య స్పందించారు. అతనికి వెంటనే అత్యుత్తమ వైద్య చికిత్సను ఏర్పాటు చేశారు. పూర్తి ఖర్చును అంటే సుమారు రూ. 15 లక్షలు చెల్లించారు.
అక్కడితో బాలయ్య సహాయం ఆగిపోలేదు. ఆ కుటుంబానికి మరో విధంగానూ సహాయం చేశారు. ఇందులో భాగంగా... బాలకృష్ణ అల్లుడు భరత్ నిర్వహిస్తున్న వైజాగ్ లోని ప్రసిద్ధ గీతం కళాశాలలో సిద్ధారెడ్డి కుమార్తె చేరగలిగింది. ఆమెకు బాలయ్య అడ్మిషన్ ఇప్పించారు. ఇదే సమయంలో వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం కూడా చేశారని తెలుస్తోంది!
ఇలా... సిద్ధారెడ్డి వైసీపీకి విధేయుడిగా ఉన్నప్పటికీ.. పార్టీలు, రాజకీయాలను బాలయ్య పట్టించుకోలేదు. మంచి మనసుతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి సహాయం చేశారు. దీంతో.. బాలకృష్ణను ఆ కుటుంబం దేవుడిలాంటి వ్యక్తిగా చూస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా... వారు ఇంట్లోని ప్రార్థనా స్థలం దగ్గర ఆయన ఫోటోను కూడా ఉంచారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన సిద్ధారెడ్డి... బాలకృష్ణ వల్లే తన కుటుంబం సురక్షితంగా ఉందని.. తమకు ఆయన దేవుడి పక్కనే ఉన్నారని.. అందుకే ఆయన ఫోటోను మా పూజ గది దగ్గర పెట్టుకున్నామని తెలిపారు. దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది. బాలయ్యను అంతా అభినందిస్తున్నారు.
