Begin typing your search above and press return to search.

బాలక్రిష్ణ ని టార్గెట్ చేసిన పచ్చ చానల్ !

అయితే ఇపుడు బాలయ్యను నేరుగా టార్గెట్ చేస్తూ ఒక టీడీపీ అనుకూల మీడియా రాజకీయ విశ్లేషణ చేయడం ఆసక్తిని రేపుతోంది.

By:  Satya P   |   6 Oct 2025 8:48 AM IST
బాలక్రిష్ణ ని టార్గెట్ చేసిన పచ్చ చానల్ !
X

నందమూరి బాలక్రిష్ణ. ప్రముఖ టాలీవుడ్ నటుడు. అంతే కాదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఇక బాలయ్య తన వ్యాఖ్యల ద్వారా తరచూ వివాదాలు కోరి తెచ్చుకుంటారు అని చెబుతూంటారు. తాజాగా ఆయన అసెంబ్లీలో చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఇంకా రాజకీయ రచ్చగానే ఉంటున్నాయి. దానికి కారణం మీడియాలో దాని మీద పదే పదే విశ్లేషణలు రావడమే. అంతే కాదు సోషల్ మీడియాలోనూ ఇష్యూ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్యకు ఒక ప్రముఖ తెలుగు మీడియా చానల్ అధిపతికి పడదని ప్రచారంలో ఉన్న మాట. ఆయన వార్తలు కానీ ఆయన గురించిన సమాచారం కానీ తమ చానల్ తమ పత్రికలో ఎక్కడా రాకుండా అనధికార నిషేధం విధించిన సందర్భాలు ఉన్నాయని చెబుతారు. అయితే ఇపుడు బాలయ్యను నేరుగా టార్గెట్ చేస్తూ ఒక టీడీపీ అనుకూల మీడియా రాజకీయ విశ్లేషణ చేయడం ఆసక్తిని రేపుతోంది.

బాలయ్యని ఎండగడుతూ :

నిజానికి బాలయ్య అసెంబ్లీలో చేసిన దానిని ఎవరూ సమర్ధించే సమస్య లేదు. అదే సమయంలో ఈ ఘటన జరిగి కూడా రోజులు చాలా గడచిపోయాయి. అయినా సరే ఇపుడు మానిన గాయానికి పుండుని మెల్లగా కెలికినట్లుగా కెలకడం వెనక ఏమి ఆంతర్యం ఉందో తెలియదు కానీ బాలయ్య మా చెడ్డవాడు ఆయన బావయ్య చంద్రబాబుని ఆయన ఇబ్బంది పెడుతున్నారు అంటూ తనదైన విశ్లేషణను వండి వార్చింది. బాలయ్యను పూర్తిగా తూర్పరా పట్టేసింది. పనిలో పైగా సీనియర్ ఎన్టీఆర్ ని కూడా ముగ్గులోకి లాగి ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో ఆయన ఒక మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే విషయంలో అనుచిత భాషను వాడారని ఈ తరానికి తెలియని విషయం చెప్పి మరీ విశ్లేషించడం విశేషం.

సభా మర్యాదలు తెలియవా :

బాలయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు సభా మర్యాదలు తెలియవా అని సదరు చానల్ వార్తా విశ్లేషణలో ప్రశ్నించింది. చలువ కళ్ళద్దాలు నెత్తిన పెట్టుకుని రెండు జేబులలో చేతులు పెట్టుకుని తన బాడీ లాంగ్వేజ్ తో బాలయ్య అసెంబ్లీలో మర్యాదలను మంటగలిపారు అని విమర్శించింది. ఇంత జరిగినా సభా స్థానంలో ఉన్న వారు చూస్తూ ఊరుకుండిపోయారు అని నిందించింది.

జగన్ ని అనడం తప్పు :

ఇక బాలయ్య జగన్ ని సైకో గాడు అనడం తప్పు అంటూ సదరు చానల్ విశ్లేషించిన తీరు కాసింత ఆసక్తికరమే. ఎందుకంటే నిత్యం జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడే చానల్ జగన్ ని వెనకేసుకుని వస్తూ బాలయ్యను పూర్తిగా తప్పు పట్టింది. సభలో లేని వారి మీద సాటి సభ్యుడి మీద ఈ రకంగా మాట్లాడుతారా అని ఎత్తి పొడిచింది. అంతే కాదు బాలయ్య ఇంట్లో అప్పట్లో కాల్పుల సంఘటన జరిగితే ఆయనను కేసుల నుంచి కాపాడింది వైఎస్సార్ అని పాత విషయాలు గుర్తు చేసింది. ఇక బాలయ్యకు జగన్ వీరాభిమాని అని గతాన్ని గుర్తు చేసింది. ఇంతలా జగన్ వైఎస్సార్ నుంచి బాలయ్యకు అనుకూలత ఉంటే బాలయ్యకు ఇవన్నీ గుర్తుకు ఉన్నాయా అని దారుణంగా విమర్శించింది.

తెర మీదనే హీరోలంటూ :

సినిమా హీరోలు తమను తాము డెమ్మీ గాడ్స్ గా భావిస్తూ ఆ భ్రమలలో ఉండిపోతున్నారు అని దెప్పిపొడిచింది. వారు తెర మీద మాత్రమే హీరోలని కూడా పేర్కొంది. అన్ని కులాలు మతాలు మద్దతు ఉంటే ఎవరైనా హీరోగా రాణించేది అని ఒక కులం అభిమానం కోసం వారిని దగ్గర తీయడం తగదని ఇండైరెక్ట్ గా కూడా చురకలు అంటించింది. టీడీపీ లేకపోతే బాలయ్య అయినా ఒంటరిగా గెలిచే సమస్య లేదని తేల్చేసింది. బాలయ్య చేస్తున్న తప్పుల వల్ల కూటమిలో చిచ్చు రాజుకుంటోందని కూడా పేర్కొంది.

బాబుకు చెలగాటం :

తన బావమరిది బాలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా వెళ్ళి జ్వరం పేరు మీద పరామర్శించాల్సి వచ్చిందని సదరు చానల్ పేర్కొనడం విశేషం. గంటకు పైగా బాబు పవన్ ఇంట్లో ఉండి మాట్లాడడం వెనక ఇదే కారణం అని అన్యాపదేశంగా చెప్పుకొచ్చింది. అంతే కాదు చిరంజీవితో కూడా చంద్రబాబు ఫోన్ ద్వారా సంభాషించారని కొత్త విషయం చెప్పుకొచ్చింది. కూటమి కోసం ఐక్యత కోసం చంద్రబాబు ఎంతో పాటు పడుతున్నారని ఢిల్లీలో కూడా నరేంద్ర మోడీకి అన్ని విధాలుగా సహకరిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నారు అని పేర్కొంది. ఇంతలా చంద్రబాబు కష్టపడుతూంటే బాలయ్య వంటి వారు మాత్రం బిగ్ ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు అని ఘాటైన వ్యాఖ్యలే చేసింది.

బాలయ్యదే తప్పంటూ :

మొత్తానికి తేల్చింది ఏంటి అంటే బాలయ్య చేస్తున్న తప్పులు ఆయన సందర్భ శుద్ధి లేకుండా వ్యవహరించడం వల్లనే కూటమి ఇబ్బందులలో పడుతోంది అని. అంతే కాదు ఇది బయట కాచుకుని కూర్చున్న వైసీపీకి అవకాశాన్ని ఇవ్వడమే అని అంటోంది సినిమా సభలలో మాట్లాడితే అది బాలయ్యకు మాత్రమే నష్టం అని కానీ అసెంబ్లీలో ఆయన చేసిన కామెంట్స్ మాత్రం కూటమికి సభకు కూడా నష్టమని అంటోంది. బాలయ్య మీద చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్లుగా రాసుకొచ్చింది. మరి బాలయ్యను ఇంతలా టార్గెట్ చేయడానికి కారణం అసెంబ్లీలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలేనా ఇంకా ఏమైనా అన్నది కూడా చర్చగా ఉంది. మరో వైపు చూస్తే టీడీపీకి చెందిన వారి విషయంలో ఎపుడూ పెద్దగా తప్పులు వెతకని సదరు పచ్చ చానల్ బాలయ్యను టార్గెట్ చేయడం కోసం ఏకంగా జగన్ ని సైతం వెనకేసుకుని వచ్చిన తీరు వైఎస్సార్ ఉదారతను కూడా ప్రస్తావించిన తీరు చూస్తే మాత్రం నందమూరికి టీడీపీ బంధం ఎక్కడో తెగినట్లుగా రాజకీయ వాసనలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఇది ఎంత వరకూ పార్టీలో కూటమిలో ప్రభావం చూపిస్తుందో.