Begin typing your search above and press return to search.

పసి ప్రాణం కోసం బాలయ్య ఆరాటం.. మీరు ఏం చేయాలి?

హిందూపురానికి చెందిన ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడాలంటూ నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ తన సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.

By:  Tupaki Desk   |   10 April 2026 7:36 PM IST
పసి ప్రాణం కోసం బాలయ్య ఆరాటం.. మీరు ఏం చేయాలి?
X

హిందూపురానికి చెందిన ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడాలంటూ నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ తన సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. చిన్నారి ప్రాణం కోసం బాలయ్య చేసిన భావోద్వేగపూరిత విజ్ఞప్తి నెటిజన్లను ఆలోచనలకు గురి చేస్తోందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అరుదైన వ్యాధులతో పసిపిల్లలు ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్న వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. గత నెలలో కర్నూలుకు చెందిన బాలిక పునర్విక ఇదే విధంగా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఎదుర్కొంటే సోషల్ మీడియా ప్రపంచం స్పందించి ఆదుకున్న విషయం తెలిసిందే. ఇక బాలయ్య సొంత నియోజకవర్గానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి కేయాన్ష్ అడ్విక్ కూడా అత్యంత అరుదైన వ్యాధి స్పైనల్ మస్క్యలర్ అట్రోఫీ టైప్-2తో బాధపడుతున్నట్లు బాలయ్య వెల్లడించారు.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కేయాన్ష్ అడ్విక్ తన సొంత నియోజకవర్గానికి చెందిన చిన్నారిగా పరిచయం చేసిన బాలయ్య, చిన్నారి వైద్యం కోసం రూ.16 కోట్లు ఖర్చు అవుతుందని, తన వంతుగా కొంత సాయం చేస్తానని వెల్లడించారు. 21 నెలలుగా చిన్నారి ప్రాణాలు కాపాడుకోడానికి మృత్యువుతో పోరాడుతున్నాడని, అతడి ప్రాణాలు కాపాడటానికి అవసరమైన AVXS-101 అనే ఇంజెక్షన్ మన దేశంలో లభించడం లేదని తెలిపారు. ఒకసారి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ కొనే స్థోమత లేక చిన్నారి తల్లిదండ్రులు తనను కలిశారని, మన అందరి సహాయాన్ని కోరారని బాలయ్య తన పోస్టులో రాశారు.

ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం భరించలేని స్థాయిలో ఉన్న ఈ ఖర్చు కోసం బాలకృష్ణ మానవతా దృక్పథంతో ముందుకు రావడంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆయన, తన వంతు సాయం చేస్తూనే ప్రభుత్వం ద్వారా కూడా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. చిన్నారికి సాయం చేయమని అభిమానులకు పిలుపునిచ్చిన బాలయ్య తన సోషల్ మీడియా ఖాతాలో సాయం చేయాల్సిన కుటుంబం వివరాలు, బ్యాంకు అకౌంట్ నెంబర్లు పోస్టు చేశారు.

బాలయ్య స్థాయిలో ఉన్న నాయకుడు, నటుడు ఇలా పోస్టు పెట్టడం సోషల్ మీడియాను ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు. గతనెలలో చిన్నారి పునర్విక కోసం కూడా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు భారీ ప్రచారం నిర్వహించారు. దీంతో కొద్ది సమయంలోనే పునర్విక వైద్యం కోసం అవసరమైన డబ్బు సమకూరింది. మంత్రి లోకేశ్ సైతం అప్పట్లో స్పందించి రూ.6 కోట్లు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇక బాలయ్య పిలుపుతో సోషల్ మీడియా, ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది. పునర్వికను కాపాడినట్లే ఇప్పుడు బాలయ్య పిలుపుతో బాలుడు కేయాన్ష్ అడ్విక్ వైద్యం కోసం ప్రతి ఒక్కరూ ముందుకురావాలని నెటిజన్లు కోరుతున్నారు.

బ్యాంక్ వివరాలు:

Account: 8265662545

Name: A S Nataraj

IFSC: IDIB000J028

Branch: J P NAGAR