సేవా భూషణ్ బాలయ్య...కొత్త కొత్తగా !
ఇక బాలయ్య విదేశాల్లో తన తాజా సినిమా అఖండ 2 ని పూర్తి చేసుకుని వచ్చారు. ఆయన ఈ మధ్యకాలంలో చాలా రాజకీయ ఈవెంట్లలో కనిపించలేదు.
By: Tupaki Desk | 13 Jun 2025 9:27 AM ISTప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ సినీ వారసుడు అయిన నందమూరి బాలకృష్ణ తన 65వ పుట్టిన రోజు వేడుకలను తాజాగా జరుపుకున్నారు. ఆయన తనకు ఎంతో ఇష్టమైన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగించాయి. తనకు నటనకు పద్మభూషణ్ ఇచ్చారు కానీ నిజానికి సేవకు ఇచ్చిన భూషణంగా దానిని భావిస్తాను అని చెప్పారు.
ప్రతీ సారీ తన నటన గురించి ఎక్కువగా చెప్పుకునే బాలయ్య ఈసారి కొత్త కొత్తగా ప్రసంగం చేశారు. సేవ గురించే అధికంగా మాట్లాడారు. తన అభిమానులు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తుందని అన్నారు. సేవలోనే ఎవరికైనా తృప్తి అని చెప్పారు.
ఇక బాలయ్య విదేశాల్లో తన తాజా సినిమా అఖండ 2 ని పూర్తి చేసుకుని వచ్చారు. ఆయన ఈ మధ్యకాలంలో చాలా రాజకీయ ఈవెంట్లలో కనిపించలేదు. అందులో అతి ముఖ్యమైనది కడపలో జరిగిన మహానాడు. జగన్ సొంత ఇలాకాలో జరిగిన ఈ మహానాడు టీడీపీ హిస్టరీ లో చాలా కీలకమైనది. అలాంటి చోట బాలయ్య కనిపించలేదన్న వెలితి అయితే చాలా మంది ఫీల్ అయ్యారు.
అదే విధంగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయింది దాని మీద టీడీపీ కూటమి మొత్తం ఉత్సాహంగా ఉత్సవాలనే చేసుకుంది. అదే విధంగా జూన్ 12న కూడా కూటమి సుపరిపాలన అంటూ వాడవడలా సంబరాలు నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లలో వేటికీ బాలయ్య ట్వీట్ కూడా వేయకపోవడాన్ని అంతా చూస్తున్నారు అంటున్నారు.
ఆయన జార్జియాలో జరిగిన సుదీర్ఘమైన షూటింగ్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. వెంటనే తన పుట్టిన రోజుని ఉదయం పూట బసవతారకం ఆసుపత్రిలో జరుపుకున్నారు. ఆ తర్వాత ఆయన తన పెద్దన్నయ్య జయక్రిష్ణ ఇంటికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
లేటెస్ట్ గా ఆయన అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ఆపత్కాలంలో కేంద్రానికి అండగా అంతా ఉండాలని కోరారు. ఇక వర్తమాన రాజకీయాల గురించి బాలయ్య నుంచి అయితే ట్వీట్లు లేవని అంటున్నారు.
ఈ మధ్య కడపలో జరిగిన మహానాడులో చూస్తే టీడీపీకి లోకేష్ భావి వారసుడు అని తేలిపోయింది. ఇక బాలయ్య రాజకీయంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గినా మంత్రి కూడా కాలేదు అన్నది అభిమానుల ఆవేదనగా ఉంది. మరి బాలయ్య మదిలో ఏముందో తెలియదు కానీ తమ అభిమాన హీరో సీఎం మెటీరియల్ అని ఈ రోజుకీ ఫ్యాన్స్ భావిస్తారు. బాలయ్య ఇపుడు ఆరున్నర పదుల వయసులో ఉన్నారు.
వయసు ఒక సంఖ్య తప్ప తనకు అది ఏమీ కాదని బాలయ్యే చెప్పుకున్నారు. అంటే తాను యువకుడినేనని ఆయన చెప్పారన్న మాట. మరీ ఇదే తీరున ఆయన జోరుగా సినిమాల్లోనే చేస్తారా లేక రాజకీయంగా దూకుడు చేస్తారా అన్నది అందరూ చూస్తున్నారు. ఎందుకు అంటే ఈసారి పుట్టిన రోజున ఆయన ఎక్కువగా సేవ గురించే చెప్పారు. మరి ఫుల్ టెర్మ్ పాలిటిక్స్ లోకి ఆయన వచ్చే రోజు ఎపుడు, టీడీపీలో ఆయన పోషించే కీలక పాత్ర ఏమిటి అన్న చర్చ ఒక వైపు ఉండనే ఉంది.
ఏది ఏమైనా అన్న ఎన్టీఆర్ మాదిరిగానే బాలయ్య కూడా ఒక పవర్ ఫుల్ వైబ్రేషన్. ఆయన ఏ రంగంలో ఉన్నా వీరంగమే అని అభిమానులు గట్టిగా భావిస్తారు. సో బాలయ్య రేపటి రాజకీయం ఎలా ఉండబోతోంది అన్నది చర్చగానే ఉంది. ప్రస్తుతానికి ఆయన వరుస సినిమాలకు కమిట్ అయి ఉన్నారు. సో ఆయన వెండి తెర హీరోగానే ఇంకా తొడ కొడుతూ నాట్ ఔట్ అంటున్నారు.
