Begin typing your search above and press return to search.

టెకీ ప్రపంచానికి ఓ ప్రత్యేక దేశం.. భారతీయుడి కల ప్రపంచాన్ని మార్చగలదా?

ప్రపంచం మొత్తం మీద టెక్నాలజీ వృద్ధికి ఊపిరిలా నిలుస్తున్న రంగం ఐటీ రంగం. దీని అవసరాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   4 July 2025 1:30 PM
టెకీ ప్రపంచానికి ఓ ప్రత్యేక దేశం.. భారతీయుడి కల ప్రపంచాన్ని మార్చగలదా?
X

ప్రపంచం మొత్తం మీద టెక్నాలజీ వృద్ధికి ఊపిరిలా నిలుస్తున్న రంగం ఐటీ రంగం. దీని అవసరాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నో దేశాల్లో, నగరాల్లో ఐటీ పార్కులు, టెక్ హబ్‌లు ఏర్పడుతున్నాయి. అయితే ఈ రంగానికి కేవలం ఒక ప్రాంతం కాదు, ఓ ప్రత్యేక దేశం కావాలనే వినూత్న ఆలోచన ఎవరైనా చేశారా? ఈ అద్భుతమైన ఆలోచనను ఆచరణలో పెట్టే పనికి శ్రీకారం చుట్టారు ఓ ప్రవాస భారతీయుడు బాలాజీ శ్రీనివాసన్.

-బాలాజీ శ్రీనివాసన్ ఎవరు?

తమిళనాడుకు చెందిన డాక్టర్ల కుటుంబంలో జన్మించిన బాలాజీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో డాక్టరేట్ చేశారు. ఆ తర్వాత బిట్‌కాయిన్, బ్లాక్‌చెయిన్ రంగాల్లో క్రియాశీలకంగా మారారు. 'జెనెటిక్ టెస్టింగ్' అనే స్టార్టప్‌ను స్థాపించి, అనంతరం ప్రముఖ క్రిప్టో కంపెనీలకు సీటీఓ గా కూడా పనిచేశారు. డిజిటల్ ప్రపంచంపై ఆయనకు విపరీతమైన నమ్మకం ఉంది.

'నెట్‌వర్క్ స్టేట్' అనే విప్లవాత్మక ఆలోచన

బాలాజీ శ్రీనివాసన్ ఎప్పుడో ఊహించిన ఒక విజన్ ఉంది. అది ‘నెట్‌వర్క్ స్టేట్’. ఇది ఇంటర్నెట్ ఆధారంగా ఏర్పడిన ఓ డిజిటల్ దేశం. ఇది కేవలం ఆన్‌లైన్‌లో ఉండే సామాజిక వ్యవస్థ కాదు, భౌతికంగా కూడా ఉండే ఒక దేశం. ప్రభుత్వ నియంత్రణలకు అతీతంగా, ప్రగతిశీల ఆలోచనలు కలిగిన యువత కోసం, సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చెందే సమాజంగా దీనిని రూపొందించాలని ఆయన సంకల్పించారు.

- సింగపూర్ సమీపంలో ప్రైవేట్ దీవి కొనుగోలు

ఈ కలను నిజం చేసేందుకు బాలాజీ శ్రీనివాసన్ ఒక ప్రైవేట్ దీవిని బిట్‌కాయిన్ ద్వారా కొనుగోలు చేశారు. ఇది సింగపూర్‌కు సమీపంలో, మలేషియాలోని ఫారెస్ట్ సిటీ దగ్గర్లో ఉంది. ఇక్కడే ఇప్పుడు టెక్నాలజీ, ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ‘నెట్‌వర్క్ స్టేట్’ ఏర్పాటవుతోంది.

- టెకీ ప్రపంచానికి స్వర్గధామం!

ఇది ఒక దేశంగా మారుతుంది. కానీ ఇక్కడ సంప్రదాయబద్ధమైన ప్రభుత్వం, దాని నియంత్రణలు ఉండవు. ఇక్కడ పని పూర్తిగా ఆన్‌లైన్‌లో సాగుతుంది. జీవితం ఆరోగ్యపరంగా, సమాజంతో మమేకమైనదిగా ఉంటుంది. డెవలపర్లు, డిజిటల్ నోమాడ్స్ ఎక్కడ నుంచైనా పనిచేసేవారు.., క్రియేటర్లకు ఇది నిజంగా ఒక స్వర్గధామం లాంటిది.

ప్రస్తుతం ఇక్కడ మూడు నెలల శిక్షణ శిబిరం జరుగుతోంది. ఇందులో టెక్నాలజీ నిపుణులు పాలుపంచుకుంటున్నారు. రోజూ ఉదయం వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, వివిధ కోర్సులలో శిక్షణ అందిస్తున్నారు.

- "స్టాన్‌ఫోర్డ్ ఆన్ అన్ ఐలాండ్"

ఈ ప్రాజెక్టుకు బాలాజీ పెట్టిన పేరు "స్టాన్‌ఫోర్డ్ ఆన్ అన్ ఐలాండ్" అంటే సముద్రం మధ్యలో ఉన్న స్టాన్‌ఫోర్డ్ లాంటి విద్యా, టెక్నాలజీ కేంద్రం. ఇది కేవలం ఉద్యోగ అవకాశాలకే కాదు, ఒక కొత్త జీవన పద్ధతికి, ఒక కొత్త సమాజ నిర్మాణానికి బీజం పడినట్టే.

- భారతీయుడి కల ప్రపంచాన్ని మార్చగలదా?

ఒక భారతీయుడు ప్రైవేట్ దీవిలో టెక్నాలజీ ఆధారంగా దేశాన్ని నిర్మించడం ఒక అద్భుతమైన సాహసం. ఇది భవిష్యత్తులో ఎలా మారుతుంది అన్నది ఆసక్తికరమే కానీ, ఈ ప్రయత్నం ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపించే విధంగా ఉంది. టెక్నాలజీ, డిజిటల్ జీవనం, స్వేచ్ఛా ఆవరణం.. ఇవన్నీ కలిపి ఓ ప్రత్యేక దేశంగా మారుతున్న ఈ ప్రయత్నం భారతీయుల తెలివి, దూరదృష్టిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఉంది.