Begin typing your search above and press return to search.

సిరిసిల్లలో 'బలగం' ఎఫెక్ట్.. పదేళ్ల తర్వాత కలిసిన అన్నదమ్ములు

వేణు యెల్దండి తీసిన 'బలగం' సినిమా కేవలం ఒక బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రమే కాలేదు. కుటుంబ బంధాలను తిరిగి కలిపిన ఒక అద్భుతం.

By:  Tupaki Desk   |   22 May 2025 8:00 AM IST
సిరిసిల్లలో బలగం ఎఫెక్ట్.. పదేళ్ల తర్వాత కలిసిన అన్నదమ్ములు
X

వేణు యెల్దండి తీసిన 'బలగం' సినిమా కేవలం ఒక బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రమే కాలేదు. కుటుంబ బంధాలను తిరిగి కలిపిన ఒక అద్భుతం. ఈ సినిమా ప్రభావం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రేరణతో రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, కొలనూరు గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పదేళ్ల తర్వాత మళ్లీ కలిశారు. చిన్న చిన్న మనస్పర్థలతో విడిపోయిన ఈ అన్నదమ్ములు, 60 ఏళ్ల వయసులో పంతాలు పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబాల్లోనే కాకుండా ఆ గ్రామంలో కూడా ఆనందాన్ని నింపింది.

'బలగం'తో పెరిగిన బంధాల విలువ

'బలగం' సినిమాను చాలా గ్రామాల్లో పంచాయతీల దగ్గర ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి ఉచితంగా ప్రదర్శించారు. ఈ సినిమాను చూసి కంటతడి పెట్టని వారు లేరు. కుటుంబాల్లోని బంధాల విలువ, బంధుత్వాల ప్రాముఖ్యత గురించి డైరెక్టర్ వేణు యెల్దండి కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా కుటుంబాలు మళ్లీ కలిసి, పాత బంధాలను పునరుద్ధరించుకున్నాయి.

పదేళ్ల విభేదాలకు తెర

కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు అన్నదమ్ములు. పదేళ్ల క్రితం కొన్ని చిన్నపాటి మనస్పర్థల వల్ల విడిపోయారు. ఒకే ఊరిలో ఉంటున్నా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. ఇరు కుటుంబాలను కలపాలని నాగయ్య కుమారుడు శ్రీనివాస్ చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

మేనల్లుడి మరణంతో మారిన మనసులు

ఈ క్రమంలో ఇటీవల ఒక రోడ్డు ప్రమాదంలో నాగయ్య, రాములుల మేనల్లుడు కూన తిరుపతి మరణించాడు. తిరుపతి అంత్యక్రియల్లో అన్నదమ్ములు ఇద్దరూ పాల్గొన్నారు. ఇదే సరైన సమయంగా భావించిన శ్రీనివాస్ వారిద్దరినీ కలపాలని గట్టి ప్రయత్నం చేశాడు. పాత రోజులను చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశాడు. దీంతో ఇద్దరూ కన్నీరు పెట్టుకున్నారు.

ఆ తర్వాత ఒకరినొకరు కౌగిలించుకుని మళ్లీ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు చూసిన అక్కడున్నవారంతా కూడా కంటతడి పెట్టుకున్నారు. "కాటికి వెళ్లే ముందు పంతాలు, పట్టింపులు ఎందుకు? ఇక నుంచి అందరం కలిసి బతుకుదాం" అని ఆ అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. 'బలగం' సినిమా నిజంగానే కుటుంబ సంబంధాలను తిరిగి నిలబెట్టడంలో తన ప్రభావాన్ని మరోసారి నిరూపించుకుంది.