Begin typing your search above and press return to search.

మోడీజీ వినిపిస్తోందా? నిన్న సాక్షి.. నేడు బజరంగ్ పునియా

ఎన్ని విమర్శలు వచ్చినా.. ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ జరిగినా పట్టించుకోని ఆయన తీరు షాకుల మీద షాకులు ఇస్తోంది.

By:  Tupaki Desk   |   23 Dec 2023 4:04 AM GMT
మోడీజీ వినిపిస్తోందా? నిన్న సాక్షి.. నేడు బజరంగ్ పునియా
X

నమ్మిన వాళ్లు ఎన్ని తప్పులు చేసినా.. ఫర్లేదా? అన్నదిప్పుడు ప్రశ్న. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమితంగా ఆరాధించే వారు సైతం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి. తాను అభిమానించటం అంటే.. తాను అభిమానించే వారెంత పెద్ద తప్పు చేసినా.. ఆ కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిస్థితుల్నిఅయినా పట్టనట్లుగా ఉండిపోవటమే మోడీ లక్షణమా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. అందుకేనేమో.. మహిళా రెజర్లను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా బీజేపీ ఎంపీ బ్రిజ్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ నిరసనలు చేసినా పట్టించుకోలేదు మోడీ.

ఇప్పుడు పార్లమెంట్ లో పొగ బాంబులతో దాడికి దిగి.. రచ్చ రచ్చ చేసిన ఉదంతంలో.. భద్రతా దళాలు..నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని అంగీకరించేందుకు.. కేంద్ర హోం మంత్రి చేత వివరణ ఇప్పించే విషయంలో ప్రధాని మోడీవ్యవహరిస్తున్న తీరు షాకింగ్ గా మారింది. ఎవరెన్ని అనుకున్నా.. తనకేం పట్టదన్నట్లుగా మోడీ తీరు ఉందని చెబుతున్నారు. స్వతంత్య భారతంలో మరే ప్రధానమంత్రి వ్యవహరించని ధోరణిలో మోడీ వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

ఎన్ని విమర్శలు వచ్చినా.. ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ జరిగినా పట్టించుకోని ఆయన తీరు షాకుల మీద షాకులు ఇస్తోంది. భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించిన బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోకపోవటంఒక ఎత్తు అయితే.. ఆయనస్థానంలో తాజాగా ఎంపిక చేసిన ప్రముఖుడు కూడా బ్రిజ్ చేతిలో కీలుబొమ్మ తరహాకు చెందిన వారు కావటంపై క్రీడాకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల్లో కామన్ వెల్త్ గేమ్స్ పతక విజేత A పై ఉత్తరప్రదేవ్ రెజ్లింగ్ సంఘ ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందటం సంచలనంగా మారింది. ఎందుకంటే.. బ్రిజ్ భూషన్ కు అతగాడు ప్రధాన అనుచరుడిగా పేరొంది. ఈ నేపథ్యంలో క్రీడాకారులు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓవైపు తమ న్యాయమైన డిమాండ్లను మోడీ సర్కారు పట్టించుకోకపోవటం.. తాజాగా రెజ్లర్ల సమాఖ్యను మరోసారి బ్రిజ్ చేతిలో పెట్టిన తీరును తప్పు పడుతున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటివరకు న్యాయం కోసం నిరసనల్ని చేపట్టిన రెజ్లర్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా సంచలన నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. తాజాగా వీరికి మద్దతుగా నిలిచిన మరో ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారుడు బజరంగ్ పునియా.. తనకు కేంద్రం ఇచ్చిన పద్మశ్రీను వెనక్కి తిరిగి ఇచ్చేస్తూ షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించారు. సంజయ్ కుమార్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ.. తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీకి ఒక బహిరంగ లేఖ రాశారు.

'ప్రియమైన ప్రధానమంత్రిగారు.. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా. మీ పనులతో తీరిక లేకుండా ఉంటారని తెలుసు. అయినప్పటికి మీ ద్రష్టిని ఆకర్షించటం ద్వారా దేశంలో రెజర్ల పరిస్థితి గురించి తెలియజేసేందుకు నేను మీకు లేఖ రాస్తున్నా. బ్రిజ్ భూషణ్ సింగ్ పై లైంగిక వేధింపు ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ నిరసనలో నేను కూడా పాల్గొన్నాను. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే మేం ఆందోళనను విరమించాం’’ అంటూ తమ నిరసనను ఆపిన వైనాన్ని వెల్లడించారు.

ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్ని అదే లేఖలో కంటిన్యూ చేసిన అతగాడు.. ‘‘ఇంతవరకు బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఔఆర్ నమోదు కాలేదు. మూడు నెలలు గడుస్తున్నా అతడిపై ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి మేం మరోసారి వీధుల్లోకి రావాలని భావిస్తున్నాం. ఏప్రిల్ నుంచి మళ్లీ నిరసనకు దిగుతున్నాం. కనీసం ఇప్పుడైనా పోలీసులు ఎప్ఐఆర్ నమోదు చేస్తారన్న ఆశ. జనవరిలో బ్రిజ్ కు వ్యతిరేకంగా 19 మంది ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ నాటికి ఏడుకు తగ్గింది. అంటే.. పన్నెండు మంది మహిళా రెజర్లను బ్రిజ్ భూషణ్ ప్రభావితం చేశారు. ఇలాంటి వేళ.. నాకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నా' అంటూ తన సంచలన నిర్ణయాన్నిప్రకటించారు. ఇంతకాలం బ్రిజ్ ఎపిసోడ్ లో మౌనంగా ఉన్న ప్రదాని మోడీ ఇప్పుడు మాత్రం స్పందించే ఛాన్సు లేదన్న మాట వినిపిస్తోంది.