ఇంకా మానని పహల్గాం గాయం.. ఆ దారుణానికి ఏడాది! మినీ స్విట్జర్లాండ్ ఇప్పుడెలా ఉంది?
ఏడాది అవుతున్నా పహల్గాం గాయం ఇంకా మనలేదు. సరిగ్గా ఏడాది క్రితం వరకు పర్యాటకులతో కళకళలాడిన కశ్మీర్ పర్యాటక ప్రాంతం పహల్గాంలోని బైసరన్ లోయ ఇప్పుడు కళ తప్పినట్లు కనిపిస్తోంది.
By: Tupaki Political Desk | 22 April 2026 2:12 PM ISTఏడాది అవుతున్నా పహల్గాం గాయం ఇంకా మనలేదు. సరిగ్గా ఏడాది క్రితం వరకు పర్యాటకులతో కళకళలాడిన కశ్మీర్ పర్యాటక ప్రాంతం పహల్గాంలోని బైసరన్ లోయ ఇప్పుడు కళ తప్పినట్లు కనిపిస్తోంది. దీనికి కారణంగా పాక్ ప్రేరేపిత టీఆర్ఎఫ్ ఉగ్రమూకలు సృష్టించిన నరమేథమే.. ఆ రాక్షసుల నుంచి రక్షణకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకున్నప్పటికీ పర్యాటకులలో ఇంకా భరోసా కనిపించడం లేదు. దీంతో పర్యాటక రంగంపై ఆధారపడిన స్థానికులు ఉపాధి కోల్పోవడమే కాకుండా ఆర్థికంగా సతమతమవుతున్నారు.
అందమైన కశ్మీర్ లోని పహల్గాంలోని బైసరన్ లోయ పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పేవారు. కొత్తగా పెళ్లైన జంటలు, పిల్లలతో సరదాగా గడపాలని భావించే తల్లిదండ్రులు బైసరన్ లోయను తప్పకుండా సందర్శించేవారు. వందల మంది పర్యాటకుల రాకతో పహల్గాం నిత్యం సరదాగా, సందడిగా ఉండేది. ప్రధానంగా 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ప్రాంతంలో టూరిజం గణనీయంగా అభివృద్ది చెందింది. ఆతిథ్య, రవాణా రంగాల్లో స్థానికులకు ఉపాధి లభించేది. ఏడాది క్రితం వరకు బైసరన్ లోయకు పర్యాటకులు భారీగా తలివచ్చేవారు. హోటళ్ల గదులు శుభ్రం చేయకముందే బుకింగ్ చేసుకునేవారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మాయమయ్యాయి. ఏడాదిగా అక్కడ నిశ్శబ్దమే రాజ్యమేలుతోందని చెబుతున్నారు.
గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గాం, బైసరన్ లోయపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన నరమేథంతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నాడు జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇప్పటికీ పర్యాటకులను భయపెడుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా పహల్గాంలో పర్యాటక రంగానికి చెందిన గణాంకాలనే చెబుతున్నారు. ఏడాది క్రితం వరకు సుమారు 10 లక్షల మంది పర్యాటకులు పహల్గాంను సందర్శిస్తే ఇప్పుడు ఆ సంఖ్య కేవలం నాలుగు లక్షలకు తగ్గిందని చెబుతున్నారు.
అదేవిధంగా ఒకప్పుడు పహల్గాంలో విడిది చేయాలంటే హోటల్ గదులు అద్దెకు దొరికేవి కావని, కానీ ఇప్పుడు రోజుకు రెండు మూడు గదులు మాత్రమే బుకింగ్ అవుతున్నట్లు చెబుతున్నారు. కశ్మీర్ కు పర్యాటకుల రాక ప్రారంభమైనప్పటికీ బైసరన్ లోయ సందర్శన విషయంలో భయపడుతున్నారనే అంటున్నారు. దీంతో దాదాపు 50 పర్యాటక కేంద్రాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నా, మినీ స్విర్జర్లాండ్ గా పిలుచుకునే బైసరన్ ఇంకా తెరచుకోలేదని అంటున్నారు. వ్యాపారులు, స్థానికులను గుర్తించేందుకు కేంద్రం క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ పర్యాటకులు ఇంకా భయం భయంగానే ఉంటున్నారని అంటున్నారు. ఇక ఉగ్ర దాడి జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా భారత సైన్యం ఎక్స్ లో ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘కొన్ని సరిహద్దులను ఎప్పటికీ అతిక్రమించలేరు’ అనే క్యాప్షన్ తో శత్రువులకు హెచ్చరికలు పంపింది.
