Begin typing your search above and press return to search.

కోకాపేటతో పోలిస్తే బుద్వేల్ వేలానికి కాసులు కిక్ లేదు

ఆ తర్వాత నిర్వహించిన మోకిలా భూముల వేలం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. బుద్వేల్ భూముల వేలంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

By:  Tupaki Desk   |   11 Aug 2023 5:00 AM GMT
కోకాపేటతో పోలిస్తే బుద్వేల్ వేలానికి కాసులు కిక్ లేదు
X

మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న తర్వాత.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ప్రభుత్వ భూముల్ని వేలం వేస్తున్న కేసీఆర్ సర్కారుకు కాసుల వర్షం కురుస్తోంది. మొన్నటికి మొన్న కోకాపేట.. ఆ తర్వాత మోకిలా.. తాజాగా బుద్వేల్ భూముల వేలాన్ని నిర్వహించారు. కోకాపేట భూమల వేలంలో ఎకరం రూ.100కోట్లకుపైనే పలికిన వేళ.. ఆ తర్వాత నిర్వహించిన మోకిలా భూముల వేలం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. బుద్వేల్ భూముల వేలంపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

ఇక్కడ కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యే పరిస్థితులు ఉంటాయన్న వాదన వినిపించింది. అయితే.. వేసుకున్న అంచనాలతో పోలిస్తే.. ఆదరణ పెద్దగా లేదనే చెప్పాలి. హెచ్ఎండీఏ నిర్ణయించిన ధరకు ఒకటిన్నర రెట్లు ఎక్కువకు మాత్రమే భూములు అమ్ముడయ్యాయి.

వంద ఎకరాలకు నిర్వహించిన వేలానికి విశేష ఆదరణ లభిస్తుందని ఆశించారు. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా వేలం నిర్వహించిన వంద ఎకరాల భూములు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటం.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపాన ఉండటంతో వేలంపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమైంది.

తాజాగా వేలం వేసిన వంద ఎకరాల లేఔట్ కు ఒకవైపు హిమాయత్ సాగర్ వ్యూ కనిపిస్తుండగా.. మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టు ఉంది. అంతేకాదు.. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డుకు అత్యంత సమీపాన ఈ వెంచర్ ఉంది.

ఇక్కడి నుంచి ఓవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు.. మరోవైపు నగరం నుంచి వచ్చే వారు పీవీ ఎక్స్ ప్రెస్ వే నుంచి అత్తాపూర్ ర్యాంప్ వద్ద కిందకు దిగి రాజేంద్రనగర్ మీదుగా ఈ లే అవుట్ ను చేరుకునే వీలుంది. త్వరలోనే ఈ లే అవుట్ ను ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో స్టేషన్ కు ఇంటర్ లింక్ చేయనున్నారు.

ఇన్ని అనుకూలతలు ఉన్న వేళ.. ఈ భూముల వేలం పెద్ద ఎత్తున జరుగుతుందని అంచనా వేశారు. అందులోనూ కోకాపేట భూములకు భారీ స్పందన లభించిన నేపథ్యంలో.. తాజా వేలంలోనూ అదే జోరు కొనసాగుతుందని భావించినా అలా జరగలేదు.

ఇక్కడి వంద ఎకరాలకు గరిష్ఠంగా ఎకరం రూ.41.75 కోట్లకు అమ్ముడు కాగా.. కనిష్ఠంగా రూ.36.25 కోట్లు అమ్ముడైంది. మొత్తం ఆదాయం రూ.3625.73 కోట్లు వచ్చింది. కోకాపేటలో మాదిరే ఒక ఎకరంలో ఎన్ని అంతస్తులతో అయినా నిర్మాణాలు చేపట్టొచ్చన్న అనుమతితో భూమల ధరలు భారీగా పలుకుతున్నాయి.