Begin typing your search above and press return to search.

బ్యాడ్ లక్.. గవర్నర్ కోటాలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ లేనట్లే

వారం వ్యవధిలో ఎంత మార్పు..? గత ఆదివారం వెల్లడైన ఫలితాలతో తెలంగాణ శాసన సభ ఎన్నికలు పూర్తయ్యాయి.

By:  Tupaki Desk   |   10 Dec 2023 12:30 PM GMT
బ్యాడ్ లక్.. గవర్నర్ కోటాలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ లేనట్లే
X

వారం వ్యవధిలో ఎంత మార్పు..? గత ఆదివారం వెల్లడైన ఫలితాలతో తెలంగాణ శాసన సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఆదివారం నాటికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం కొలువుదీరింది. వారికి శాఖల కేటాయింపులూ పూర్తయింది. మిగిలింది మరో ఆరు బెర్తులు. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, సీఎం రేవంత్ రెడ్డి అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో శాసన మండలి వైపు చూపు సారిస్తారు. ఎందుకంటే.. రేవంత్ పక్కా రాజకీయవేత్త. తన పార్టీని అత్యంత బలంగా తీర్చిదిద్దడంపై ఆయన వెనక్కుతగ్గరు. అధిష్ఠానం కూడా తెలంగాణలో గత పదేళ్లలో ఎదురైన అనుభవాల రీత్యా పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకున్నా రేవంత్ కు స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీలపై ఫోకస్

తెలంగాణలో ఇటీవలి ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరంతా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. స్థానిక సంస్థల నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేల కోటా నుంచి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవులు వదులుకున్నారు. వీటన్నిటినీ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. మరోవైపు రెండు గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీలూ ఆ పార్టీ, సీఎం రేవంత్ సిఫార్సు మేరకు భర్తీ అవుతాయి.

అరెరె.. చాన్స్ మిస్సాయె..

గత ఏడాది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్ రాజకీయ కోణంలో కొందరిని పార్టీలో చేర్చుకున్నారు. మరికొందరికి పదవులు ఇచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి దాసోజు శ్రవణ్, గతంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగారెడ్డి జిల్లా నాయకుడు కుర్రా సత్యనారాయణనూ బీఆర్ఎస్ లోకి వెళ్లారు. వీరిద్దరినీ తదనంతర కాలంలో బీఆర్ఎస్ అధినేత, నాటి సీఎం కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించారు. కానీ, వీరి పేర్లను గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. ఇప్పటికీ పెండింగ్ లోనే ఉండిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వ మారినందున అవకాశం లేదు. అలా దాసోజు, కుర్రాలకు ఎమ్మెల్సీ చాన్స్ మిస్సయింది.

దాజోజు బ్యాడ్ లక్

నల్లగొండ జిల్లాకు చెందిన దాసోజు శ్రవణ్ ఉన్నత విద్యావంతులు. గతంలో అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేశారు. పవన్ కల్యాణ్ పిలుపుతో 2008లో ప్రజారాజ్యంలో చేరారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్)లోకి వచ్చారు. తెలంగాణ సాకారం అయ్యే దశలో కాంగ్రెస్ లో చేరారు. తొమ్మిదేళ్లు అక్కడే ఉండి గత ఏడాది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ అవుతున్నారనుకున్న దశలో ఫైలు ఆగిపోయింది. ఇటు చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక కుర్రా సత్యనారాయణ 1999లోనే సంగారెడ్డి నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తర్వాత తిరిగి ఎన్నికవలేదు.

కొసమెపురుపు: కుర్రా సత్యనారాయణ 2004లో బీజేపీ నుంచి సంగారెడ్డిలో పోటీ చేశారు. అప్పట్లో 17 వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. నాడు ఆయనపై గెలిచినది ఎవరో తెలుసా.. తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)గా చిరపరిచితులైన జగ్గారెడ్డి. కుర్రా సత్యనారాయణ 2014లోనూ మరోసారి బీజేపీ నుంచి పోటీచేసి ఓడారు.