Begin typing your search above and press return to search.

ఆస్పత్రిలో ఆ పరామర్శలో అంత అర్థం ఉందా..?

చాన్నాళ్ల తర్వాత కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఒకేసారి ప్రతిపక్షంలో ఉన్నారు. 2006 నుంచి 2014 మధ్య బాబు, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 9:04 AM GMT
ఆస్పత్రిలో ఆ పరామర్శలో అంత అర్థం ఉందా..?
X

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆచంద్రతారార్కం నిలిచిపోయే రాజకీయ నాయకుల పేర్లు చెప్పమంటే.. ముందుగా గుర్తొచ్చేవి నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నాలుగు దశాల పైగా రాజకీయ అనుభవం వీరిది. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఇద్దరూ.. అత్యున్నత స్థానాలకు ఎదిగారు. అనూహ్య పరిస్థితుల్లో పార్టీ పగ్గాలను చేపట్టిన చంద్రబాబు టీడీపీని దాదాపు మూడు దశాబ్దాలుగా గెలుపోటములతో సంబంధం లేకుండా నడిపిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో టీఆర్ఎస్ ను స్థాపించిన కేసీఆర్ అనుకున్నదానిని సాధించి తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా పనిచేశారు. అందుకే ఇద్దరు చంద్రులూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకం.

ఇద్దరూ ప్రతిపక్షంలో

చాన్నాళ్ల తర్వాత కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఒకేసారి ప్రతిపక్షంలో ఉన్నారు. 2006 నుంచి 2014 మధ్య బాబు, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు అయ్యారు. 2018లో కేసీఆర్ గెలిచినా 2019లో చంద్రబాబు ఓడిపోయారు. ఇప్పుడు కేసీఆర్ సైతం పరాజయం పాలై ప్రతిపక్ష నేతగా మిగిలారు. అంటే దాదాపు పదేళ్ల తర్వాత ఇద్దరు చంద్రులు ప్రతిపక్షంలో ఉన్నారన్నమాట.

ఎన్నో డక్కామొక్కీలు

కేసీఆర్, చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నో డక్కామొక్కీలు తిన్నారు. చంద్రబాబును విభేదించి కేసీఆర్ పార్టీ పెట్టగా.. కేసీఆర్ ను విభేదించి చాలామంది బయటకెళ్లారు. కొందరు సొంతంగా పార్టీలూ స్థాపించారు. తర్వాత వారి మనుగడ ఏమయ్యారన్నది వేరే విషయం. మరోవైపు దాదాపు 14 ఏళ్లకు పైగా చంద్రబాబు, తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ సీఎంలుగా చేశారు. గమనార్హం ఏమంటే.. తమ కళ్ల ముందు ఎదిగిన, తర్వాతి తరం నాయకులైన జగన్, రేవంత్ రెడ్డి చేతుల్లో వీరి పార్టీలు ఓడిపోయాయి

బాబు జీవితంలో జైలు తొలిసారి..

చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో తొలిసారి జైలుకెళ్లింది ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్ష నేతగా, ప్రభుత్వం వచ్చాక సీఎంగా వైఎస్ ఎన్నో ఆరోపణలు చేసినా చంద్రబాబును ఒక్క కేసులోనూ జైలుకు పంపించలేకపోయారు. అయితే, ఆయన కుమారుడు జగన్ మాత్రం విభజిత ఏపీలో చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేసి.. రాజమహేంద్రవరం జైలుకు పంపారు. దాదాపు రెండు నెలలు కారాగారంలో ఉన్నారు చంద్రాబాబు. ఆ సమయంలో ఎందరో ఆయనకు మద్దతుగా నిలిచారు.

కేటీఆర్ స్పందన.. కేసీఆర్ నో కామెంట్

టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, కేసీఆర్ సహచరులు. చంద్రబాబు మంత్రి వర్గంలో కేసీఆర్ మంత్రిగానూ చేశారు. పార్టీ శిక్షణ కార్యక్రమాల్లో కేసీఆర్ సేవలను వినియోగించుకున్నారు చంద్రబాబు. ఏపీ విభజన తర్వాత కూడా సంబంధాలు బాగానే ఉన్నా.. ఓటుకు నోటు కేసుతో దెబ్బతిన్నాయి. అంతటి అనుబంధం ఉన్నప్పటికీ ఇద్దరూ విరోధులుగా మారారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలతో జట్టు కట్టి మహా కూటమి అంటూ చంద్రాబు తెలంగాణ రాజకీయాల్లోకి రావడంతో విరోధం కాస్త శత్రుత్వంగా మారింది. 2019 ఏపీ ఎన్నికల్లోనూ ఇది ప్రతిబింబించింది. కాగా, స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సహా తెలంగాణ అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు స్పందించారు. అయితే, కేసీఆర్ మాత్రం నోరిప్పలేదు. పైగా చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్న ఆందోళనల పట్ల కేటీఆర్ ఓ దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. చివరకు వాటిని వేరేవిధంగా సమర్థించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బాబు పక్షాన కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం హైలైట్. అయితే, ప్రస్తుతం ఎన్నికల్లో ఓడిపోయి.. ఫాం హౌస్ లో గాయపడి ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు కేసీఆర్. ఎన్ని విభేదాలున్నా.. తనకు మద్దతుగా మాట్లాడకున్నా.. చంద్రబాబు మాత్రం ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. తద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు. వాస్తవానికి ఇది కేసీఆర్ కు ఇబ్బందికర పరిణామం. చంద్రబాబుకు సానుకూలం. అయితే, చంద్రబాబు జైలుకెళ్లిన కారణం అవినీతి ఆరోపణలు. కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు.