బీజేపీ మీద బాబు స్టాండ్ మారుతోందా...?
వచ్చే ఎన్నికల్లో పొత్తుల మీద టీడీపీ అధినేత స్పష్టమైన వైఖరితో ఉన్నారా. ఆయన జైలులో గడపిన 53 రోజులలో 2024 ఎన్నికల మీద వ్యూహాల మీద సీరియస్ గానే లెక్కలు వేసుకున్నారా అన్న చర్చ అయితే ఇపుడు సాగుతోంది.
By: Tupaki Desk | 1 Nov 2023 6:49 PM ISTవచ్చే ఎన్నికల్లో పొత్తుల మీద టీడీపీ అధినేత స్పష్టమైన వైఖరితో ఉన్నారా. ఆయన జైలులో గడపిన 53 రోజులలో 2024 ఎన్నికల మీద వ్యూహాల మీద సీరియస్ గానే లెక్కలు వేసుకున్నారా అన్న చర్చ అయితే ఇపుడు సాగుతోంది. ఏది ఏమైనా తెలంగాణా ఎన్నికల వేళ చంద్రబాబు బయటకు రావడం హైదరాబాద్ లోనే ఉండడం కొత్త పరిణామంగా చెబుతున్నారు.
తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి విరమించుకోవడం ఏ రకమైన పొలిటికల్ సిగ్నల్ అన్నది కూడా ఇపుడు ప్రశ్నగా ముందుకు వస్తోంది. అధికార బీయారెస్ కి అలాగే విపక్ష బీజేపీకి లాభం కలగకుండానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఎంత తగ్గిపోయినా కూడా ఇప్పటికీ కొన్ని కీలక నియోజకవర్గాలలో టీడీపీకి కనీసంగా అయిదారు వేల ఓట్లు ఉన్నాయని అంటున్నారు.
పోటీకి పెడితే ఆ ఓట్లు టీడీపీకే వెళ్తాయి. ఇక హోరా హోరీ పోరు సాగనున్న నేపధ్యంలో ఈసారి వందలలో మెజారిటీలు ఎవరికి వచ్చినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దాంతో పాటు ఓట్ల చీలిక కనుక ఉంటే అది ఫలితాలను చాలా పెద్ద ఎత్తున మార్చేస్తుందని కూడా వాదన ఉంది. ఈ పరిణామాలను అన్నింటినీ జాగ్రత్తగా గమనించిన మీదటనే టీడీపీ పోటీకి దూరం అని ప్రకటించింది అని అంటున్నారు.
అలా టీడీపీ చేయడం అంటే అది ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కే మేలు అన్న విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్ కి బలమైన సామాజిక వర్గం నుంచి మద్దతు కూడా అందేలా చేయడానికే టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది అని కూడా ప్రచారం సాగుతోంది. ఇలా తెలంగాణా ఎన్నికల విషయంలో బీజేపీ వైపు కూడా టీడీపీ చూడకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. నిజానికి బీజేపీ జనసేన టీడీపీ తెలంగాణా ఎన్నికల్లో పోటీకి దిగాలని చాలా కాలం క్రితం టీడీపీ అధినాయకత్వం ప్లాన్ చేసింది అని అప్పట్లో ప్రచారం సాగింది.
ఇపుడు చూస్తే తెలంగాణాలో జనసేనను దగ్గరకు తీస్తూ టీడీపీని దూరం పెట్టడం వల్ల టీడీపీ కూడా తానుగా ఒక స్టాండ్ తీసుకుందని అంటున్నారు. అది వ్యూహంగా కూడా కావచ్చు అంటున్నారు. తెలంగాణాలో వచ్చే ఫలితాలను బట్టి ఏపీలో కూడా టీడీపీ తన ఎన్నికల వ్యూహాన్ని బాహాటంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
బాబు జైలు నుంచి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడిన దాంట్లో అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్పారని, బీజేపీ విషయం పెద్దగా తలవలేదని గుర్తు చేస్తున్నారు. తాను జైలు పాలు కావడానికి ఇన్నాళ్ళు జైలు గోడల మధ్యన మగ్గడానికి బీజేపీ కారణం అని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన వామపక్షాలు అవసరం అయితే కాంగ్రెస్ తో కూడా పొత్తులు పెట్టుకుని మహా కూటమిని ఏర్పాటు చేసుకుని వెళ్లాలని ఆలోచనలో టీడీపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. బాబు అరెస్ట్ తరువాత తమ్ముళ్ళు ఇదే విషయం బాబుకు ఒకటికి రెండు సార్లు గట్టిగా చెబుతున్నారని అంటున్నారు.
ఈ పరిణామాల క్రమంలో బాబు చూపు తెలంగాణా ఎన్నికల ఫలితాల మీదనే ఉంది. ఇప్పటి దాకా వచ్చిన సర్వేలు చూస్తే అయితే కాంగ్రెస్ లేకపోతే బీయారెస్ అన్నట్లుగానే అక్కడ పొలిటికల్ సీన్ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే క్షణమాలోచన లేకుండా ఏపీలో బీజేపీ లేని మహా కూటమికి తెర తీస్తారని అంటున్నారు. అలా కాకుండా బీయారెస్ గెలిస్తే మాత్రం కొంచెం ఆలోచించి ఏపీలో బీజేపీ వ్యూహాలను గమనించిన మీదట నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది అని అంటున్నారు.
ఏది ఏమైనా కూడా బీజేపీకి టీడీపీ ఇక మీదట దూరంగా ఉండాలనే స్టాండ్ తీసుకోబోతోందా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణాతో పాటు దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో కాంగ్రెస్ మెజారిటీ స్టేట్స్ గెలిచినా టీడీపీ వ్యూహం అంతే వేగంగా మారుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
