Begin typing your search above and press return to search.

బాబు - పవన్ వరుస భేటీల అసలు సీక్రెట్ ఇదేనా?

వరుస భేటీ కారణంగా తాజాగా వారద్దరి మధ్య సీట్ల కేటాయింపు మధ్య ఉన్న దూరం తగ్గినట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 5:48 AM GMT
బాబు - పవన్ వరుస భేటీల అసలు సీక్రెట్ ఇదేనా?
X

ఏపీ రాజకీయాల్లో ఒక అంశం మిస్టరీగా మారింది. తెలుగుదేశం - జనసేన మధ్య పొత్తు ఖాయమన్న సంగతి కొత్తదేం కాదు. దాదాపు రెండేళ్లుగా పొత్తు దిశగా అడుగులు పడటం.. అందుకు తగ్గ కసరత్తు జరగటం తెలిసిందే. అయినప్పటికీ మొన్నటికి మొన్న చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించటం.. దానికి పోటీగా పవన్ కల్యాణ్ మరో రెండు స్థానాలకు తాము పోటీ చేస్తామన్న పోటీ ప్రకటన తెలిసిందే. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నది ఒక ప్రశ్న. అదే సమయంలో తరచూ భేటీ అయ్యే చంద్రబాబు - పవన్ లు ఏం మాట్లాడుకుంటారు? అన్నది సమాధానం లేని సందేహంగా మారింది.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం దీనికి సంబంధించిన సమాధానాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. తరచూ భేటీ అయ్యే ఈ ఇద్దరు అధినేతలు తాము కలిసి ప్రతిసారీ.. పొత్తుల్లో భాగంగా ఎవరెన్ని సీట్ల నుంచి పోటీ చేయాలన్న దానిపైనే చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. తొలినాళ్లలో పొత్తుల్లో భాగంగా తమకు 60 సీట్లు కేటాయించాలన్న మాట పవన్ కల్యాణ్ కోరగా.. చంద్రబాబు అందుకు భిన్నంగా 18 సీట్ల మించి ఇవ్వలేమన్న ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం. అయితే.. లెక్కలు ఒక కొలిక్కి రాకున్నా.. వీలైనన్ని ఎక్కువసార్లు కలవటం ద్వారా బేరం ఎక్కడో ఒక దగ్గర తెగ్గొట్టాలన్న ఆలోచన ఇద్దరు అధినేతలకు ఉన్నట్లు చెబుతారు.

వరుస భేటీ కారణంగా తాజాగా వారద్దరి మధ్య సీట్ల కేటాయింపు మధ్య ఉన్న దూరం తగ్గినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ 40 సీట్లు గరిష్ఠంగా 35 సీట్లు కనిష్ఠంగా అడుగుతుంటే.. చంద్రబాబు గరిష్ఠంగా 30 కనిష్ఠంగా 25 సీట్ల వరకు ఇచ్చేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సీట్ల పంచాయితీ కొలిక్కి రాకముందే.. బీజేపీ సీన్లోకి రావటం వారి నుంచి సీట్ల ప్రతిపాదన ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

ఎవరిని కాదనలేని పరిస్థితి. అలా అని పట్టు కోసం మిత్రులను పోగొట్టుకోలేని ఇబ్బంది. ఈ పరిస్థితుల్ని వివరిస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాస్త అర్థం చేసుకోవాలంటూ ఆయన కోరుతున్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు వరుస ప్రయత్నాల కారణంగా పవన్ భారీగా తగ్గినట్లుగా చెప్పాలి. మొదట్లో 60 వరకు అడిగిన సీట్లు ఇప్పుడు 35 వరకు రావటమే నిదర్శనంగా చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు - పవన్ మధ్య సీట్ల లెక్కల విషయంలో పవన్ కాస్త ఎక్కువ తగ్గినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఏయే సీట్లు కావాలన్న దానిపై చంద్రబాబు ప్రదర్శిస్తున్న పట్టుదల పవన్ ను ఇబ్బందికి గురి చేస్తున్నట్లుగా సమాచారం.

ఓవైపు సీట్ల విషయంలో రాజీ పడుతున్న వేళ.. తాము కోరుకున్న స్థానాల్లో సీట్ల కేటాయింపు ఉండాలన్న మాటను పవన్ బలంగా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. పవన్ కోరుతున్న స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బలంగా ఉండటం.. వారి నుంచి వస్తున్న ఒత్తిడితో కిందామీదా పడుతున్నట్లుగా సమాచారం. ఈ కారణాలతోనే చంద్రబాబు - పవన్ మధ్య భేటీలు అంత సుదీర్ఘంగా.. అంత తరచూ జరగటానికి కారణమని చెబుతున్నారు. లెక్కలు ఒక కొలిక్కి వచ్చేవరకు ఈ ఇబ్బందికర పరిస్థితి తప్పదని చెబుతున్నారు.