Begin typing your search above and press return to search.

డిసెంబర్ విడుదల : బాబు ఇప్పట్లో బయటకు రారా...?

టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ దాకా బయటకు రారా అన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి. బాబు కేసు న్యాయ స్థానాలలో ఉంది. అక్కడ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   18 Oct 2023 6:15 PM GMT
డిసెంబర్ విడుదల :  బాబు ఇప్పట్లో బయటకు రారా...?
X

టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ దాకా బయటకు రారా అన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి. బాబు కేసు న్యాయ స్థానాలలో ఉంది. అక్కడ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. బాబుకు ఎలాంటి ఊరట లభించడంలేదు. మరో వైపు చూస్తే చంద్రబాబు కానీ టీడీపీ కానీ క్వాష్ పిటిషన్ మీదనే పూర్తి ఆశలు పెట్టుకుని ఉన్నారు.

ఈ శుక్రవారం అంటే ఇరవై తేదీన ఈ కేసు మీద సుప్రీం కోర్టులో విచారణ ఉంది అంటున్నారు. ఆ రోజున కనుక కోర్టులో బాబుకు రిలీఫ్ దక్కపోతే దసరా తరువాతనే ఈ కేసు మీద విచారణ ఏమైనా ఉండొచ్చు అంటున్నారు. ఇక క్వాష్ పిటిషన్ కొట్టేస్తే కనుక బాబు జైలు నుంచి బయటకు వచ్చేది డిసెంబర్ తరువాతనే అని అంటున్నారు.

దీనికి అనేక ఉదాహరణలు చూపిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కేసుని కొంతమంది గుర్తు చేస్తున్నారు. ఆయన అక్షరాల 105 రోజుల పాటు జైలు గోడల మధ్యన మగ్గిపోయారని అంటున్నారు. ప్రధాని తరువాత అంతటి పోస్ట్ అయిన హోం మంత్రి పదవిని చేసిన చిదంబరాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి కేసులలో అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.

ఆయనకు బెయిల్ రాక అన్నాళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది అని అంటున్నారు. పైగా చిదంబరం మీద పెట్టిన కేసులో లక్షల రూపాయల అవినీతి అని చూపించారు. బాబు కేసులో చూస్తే ఏకంగా 371 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. ఇది మూడు వేల కోట్ల ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. దాంతో ఈ కేసుని సీరియస్ గానే ఎవరైనా చూస్తారు అని అంటున్నారు.

అవినీతి కేసులలో బెయిల్ ఇవ్వాలంటే విచారణ పూర్తి కావాలని కూడా అంటున్నారు. దర్యాప్తు సంస్థలు అయితే విచారణ ఉంది అని చెబుతూ తమ వాదనలు కొనసాగిస్తాయి. ఇక బాబు చుట్టూ అనేక ఇతర కేసులు కూడా చుట్టుకుని ఉన్నాయి. ఇవన్నీ చూస్తూంటే ఆయన ఇప్పట్లో బయటకు వచ్చేది ఉండదని అంటున్నారు.

బహుశా ఈ విషయాల మీద అవగాహన ఉన్నందువల్లనేనా టీడీపీ చంద్రబాబు సతీమణి భూవనేశ్వరిని జనంలోకి పంపేందుకు చూస్తోంది అన్న మాట కూడా వినిపిస్తోంది. మరో వైపు చూస్తే తెలంగాణా ఎన్నికలు పూర్తి అయి డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయి. దేశ రాజకీయాలలో అయిదు రాష్ట్రాల ఫలితాలు అపుడే వస్తాయి.

తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా అన్న చర్చ ఇంకా కొనసాగుతోంది. పోటీ చేస్తే ప్రచారం చేయడంతో పాటు పార్టీకి అంగబలం అర్ధబలం వంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు జైలు గోడల మధ్యన మరిన్నాళ్ళు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

తెలుగుదేశం శ్రేణులు ఈలోగా డీలా పడకుండా ఉండేందుకు భువనేశ్వరిని లోకేష్ ని జనంలోకి పంపుతున్నారు అని వినిపిస్తోంది. న్యాయవాదులు కూడా బాబుతో ములాఖత్ ద్వారా ఎప్పటికపుడు న్యాయ పరమైన అంశాలను పంచుకుంటున్నారు. దాంతో ఏమి జరుగుతోంది అన్నది తెలుస్తొంది అని అంటున్నారు. రాజకీయంగా న్యాయపరంగా టీడీపీకి ఇపుడు ఇబ్బందికరమైన పరిస్థితులే అని అంటున్నారు.