Begin typing your search above and press return to search.

బాబు కేసులో తీర్పు రిజర్వ్... పెరిగిపోతున్న ఉత్కంఠ

దాని మీద మంగళవారం ఏకంగా అయిదు గంటల పాటు వాడిగా వేడిగా విచారణ కోర్టులో సాగించి. సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలైన విచారణ సాయంత్రం అయిదు వరకూ సాగింది.

By:  Tupaki Desk   |   19 Sep 2023 12:50 PM GMT
బాబు కేసులో తీర్పు రిజర్వ్... పెరిగిపోతున్న ఉత్కంఠ
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనను ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం మీద క్వాష్ పిటిషన్ ని హై కోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దాని మీద మంగళవారం ఏకంగా అయిదు గంటల పాటు వాడిగా వేడిగా విచారణ కోర్టులో సాగించి. సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలైన విచారణ సాయంత్రం అయిదు వరకూ సాగింది.

ఇరుపక్షలా వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. దాంతో మరింత ఉత్కంఠ పెరిగిపోతోంది. అంతకు ముందు బాబు మీద నమోదు అయిన అన్ని కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు బాబు తరఫున సిద్ధార్థ లూధ్రాతో పాటు హరీష్ సాల్వే ఈ కేసులో గట్టిగానే వాదించారు.

ఇది పూర్తిగా రాజకీయ కక్షల్తో పెట్టిన కేసు అని వారు కోర్టు ముందు వాదించారు. సీఐడీ తరఫున వర్చువల్ గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. చంద్రబాబు మీద రాజకీయ కక్ష ఉంటే ఏనాడో ప్రభుత్వం అరెస్ట్ చేసేదని ఆయన లాజిక్ పాయింట్ తీసారు. ఏపీ సీఐడీ రెండేళ్ళుగా ఈ కేసుని విచారిస్తోందని రోహత్గి గుర్తు చేశారు.

ఆ మీదటనే చంద్రబాబు అరెస్ట్ దాకా వ్యవహారం వచ్చిందని అన్ని ఆధారాలతోనే బాబుని అరెస్ట్ చేశారు అని అన్నారు. ఈ కేసులో కీలక విషయాలు కూడా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదిస్తూ సెక్షన్ 17 ఎ అన్నది ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకున్న అమాయక ప్రజా ప్రతినిధుల కోసం మాత్రమే అన్నారు.

నేరం కళ్ల ముందు కనిపిస్తూంటే గవర్నర్ అనుమతి అవసరం లేదని ఆయన వాదించారు. ఈ కేసులో సీఐడీ పక్కాగా ఆధారాలు సేకరించింది అని చెప్పారు. క్వాష్ పిటిషన్ వేయడానికే బాబు అనర్హుడు అన్నారు. ఇలా వాడిగా వేడిగా రెండు వైపుల నుంచి వాదనలు జరిగాయి. అన్నీ విన్న న్యాయస్థానం తీర్పుని మాత్రం రిజర్వ్ చేసింది. మరి తీర్పు ఎలా వస్తుంది అన్నది చూడాలి.

క్వాష్ పిటిషన్ కనుక హైకోర్టు సమర్ధిస్తే చంద్రబాబు ఏ బెయిల్ అవసరం లేకుండానే రిలీజ్ అవుతారు. అలా కాకుండా క్వాష్ పిటిషన్ కొట్టేస్తే మాత్రం ముందుగా ఏసీబీ కోర్టు నుంచి బెయిల్ కి అప్లై చేసుకోవాలి. ఇదిలా ఉంటే ఏసీబీ కోర్టు కూడా బాబు బెయిల్ పిటిషన్ మీద విచారణను రేపటికి వాయిదా వేసింది.