'అంబానీల్లా.. దిండిలో పెళ్లి చేసుకునేలా'.. ఏపీకి రాందేవ్ బాబా హామీ!
అవును... విజయవాడలో జరిగిన టూరిజం కాన్ క్లేవ్ లో పాల్గొన్న రాందేవ్ బాబా... ఏపీ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సిద్ధం అని ప్రకటించారు.
By: Tupaki Desk | 28 Jun 2025 5:01 PM ISTశుక్రవారం విజయవాడలో జరిగిన టూరిజం కాన్ క్లేవ్ లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పలు ఆసక్తికర హామీలు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా 'దిండిలో వెడ్డింగ్ డెస్టినేషన్ క్రూజ్' అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... విజయవాడలో జరిగిన టూరిజం కాన్ క్లేవ్ లో పాల్గొన్న రాందేవ్ బాబా... ఏపీ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సిద్ధం అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలను తాను కించపరచడం లేదు.. కానీ, ఏపీలో ఉన్న సుందరమైన అటవీప్రాంతం, సముద్రతీరం, వైవిధ్యమైన వాతావరణం దేనికదే ప్రత్యేకం అని అన్నారు.
ఈ సందర్భంగా... ఏపీలో ఏమైనా చేద్దామని తాను ఆలోచిస్తుండగా.. చంద్రబాబు తనతో మాట్లాడారని.. రాష్ట్రంలో వెల్ నెస్ సేవలను అందుబాటులోకి తేవాలని సూచించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడితో వెల్ నెస్ సేవలను తీసుకొస్తానని.. హార్సిలీ హిల్స్ ను ఐకానిక్ వెల్ నెస్ కేంద్రంగా ప్రపంచపటంలోకి తీసుకొస్తానని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే దిండిలో వెడ్డింగ్ డెస్టినేషన్ క్రూజ్ విషయాన్ని వెల్లడించారు యోగా గురు రాందేవ్ బాబా. ఇందులో భాగంగా... అంబానీల్లాగా పెళ్లి చేసుకోవాలనే కోరిక చాలామందికి ఉండవచ్చని.. అలాంటి వారందరికీ నచ్చేలా దిండిలో వెడ్డింగ్ డెస్టినేషన్ క్రూజ్ ను ఏర్పాటు చేస్తామని.. దిండి ఒక పెద్ద వెడ్డింగ్ డెస్టినేషన్ అవుతుందని అన్నారు.
అక్కడ.. వేదపండితులు, పూజసామగ్రి, మ్యూజిక్ వంటివన్నీ సమకూరుస్తామని.. ఫలితంగా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం మీద వెడ్డింగ్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ అవుతుందని.. దానికి అవసరమైన మార్కెటింగ్ ను తానే ఉచితంగా చేస్తానని రాందే బాబా హామీ ఇచ్చారు.
కాగా... ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఒడ్డున ఉన్న గ్రామం దిండి. ఇక్కడ ఇప్పటికే రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే సమయంలో.. గోదావరిలో బోటు షికారు సౌకర్యమూ ఉంది. ఈ నేపథ్యంలో... అక్కడ వెడ్డింగ్ డెస్టినేషన్ క్రూజ్ ను ఏర్పాటు చేస్తామని రాందేవ్ బాబా హమీ ఇవ్వడంతో టూరిజంగా ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని అంటున్నారు.
