Begin typing your search above and press return to search.

మళ్లీ బరిలోకి అజారుద్దీన్.. ఈసారి తగ్గేదేలే

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అజారుద్దీన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 9:00 PM IST
మళ్లీ బరిలోకి అజారుద్దీన్.. ఈసారి తగ్గేదేలే
X

90వ దశకంలో క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు మహ్మద్ అజారుద్దీన్. తన మాయాజాల బ్యాటింగ్, అద్భుత ఫీల్డింగ్‌తో భారత క్రికెట్‌కు కొత్త ఒరవడి తీసుకొచ్చిన ఈ దిగ్గజం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి మాత్రం క్రికెట్ మైదానంలో కాదు… రాజకీయ రంగంలో!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అజారుద్దీన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. “ఈసారి తప్పకుండా గెలుస్తా” అంటూ ధీమాగా ప్రకటించిన ఆయన, గతంలో తగిన ప్రచారం లేక ఓడిపోయానని, ఇప్పుడు అలాంటి పొరపాటు జరగదని స్పష్టం చేశారు.

అజార్ గతంలో 2009లో కాంగ్రెస్ తరఫున హైదరాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2018లో జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా నియోజకవర్గంలో తన సేవలు కొనసాగిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెబుతున్నారు.

ఇక ఈసారి అజార్ 2.0 అని.. కాంగ్రెస్ తరుపున గెలిచేది తానేని అజార్ ధీమాగా చెప్పకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానంతో తనకు మంచి సంబంధాలున్నాయని.. ఎవరు అడ్డుకున్నా జూబ్లిహిల్స్ టికెట్ సాధిస్తానంటూ ధీమాగా చెబుతున్నాడు. ఈసారి తగ్గేదేలే అంటూ సాగుతున్నాడు.

అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అభ్యర్థిత్వం ప్రకటించడానికి పార్టీకి ప్రత్యేక విధానం ఉందని, చివరి నిర్ణయం అధిష్ఠానానిదేనని తెలిపారు.

అజారుద్దీన్ రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా, ఆయనకు టికెట్ దక్కుతుందా? గెలుపు సాధిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. క్రికెట్ మైదానంలో తనదైన ముద్ర వేసిన అజ్జూ భాయ్, రాజకీయ రంగంలోనూ అదే మాయ చూపిస్తారా? వేచి చూడాల్సిందే.