Begin typing your search above and press return to search.

జూనియర్ అయ్యన్నకి లోకేష్ నిండు దీవెనలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.

By:  Satya P   |   21 Feb 2026 9:22 AM IST
జూనియర్ అయ్యన్నకి లోకేష్ నిండు దీవెనలు
X

ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయనది నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఆయన పాతికేళ్ళ వయసులోనే ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తరువాత 27 ఏళ్ళ వయసులో మంత్రి కూడా అయ్యారు. అది లగాయితూ ప్రతీ ఎన్నికలోనూ గెలుస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ కేబినెట్ తో పాటు చంద్రబాబు కేబినెట్ లోనూ మంత్రిగా అనేక సార్లు నిర్వహించారు. వివిధ మంత్రిత్వ శాఖలను చేపట్టి తన సత్తా చాటుకున్నారు.

మంత్రిగా రిటైర్ కావాలని :

ఇదిలా అంటే 2024 ఎన్నికలే తనకు చివరివి అని ఓటర్లకే నేరుగా చెబుతూ పోటీకి అయ్యన్న దిగారు, మంచి మెజారిటీతో గెలిచారు. మంత్రి పదవి తనను వరిస్తుంది అని అనుకున్నారు. అయితే ఆయనకు అనూహ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవి దక్కింది. స్పీకర్ అయిపోయారు. ఇది ఎంతో హుందా అయిన గౌరవప్రదమైన పదవి. కానీ తాను రాజకీయంగా దూకుడు చేయలేకపోతున్నారు అన్న ఆవేదన ఆయనలో ఉంది. తన నోరు నొక్కేశారు అని చాలా సార్లు ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం ఉంది. ఇక తన కుమారుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుని కూడా అయ్యన్న చక్కబెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నర్శీపట్నం నుంచి విజయ్ ని పోటీ చేయించి ఎమ్మెల్యేగా చూసుకోవాలని అనుకుంటున్నారు.

గోల్డెన్ చాన్స్ అంటూ :

ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అయ్యన్న కుమారుడికి గోల్డెన్ చాన్స్ దక్కుతోంది అని అంటున్నారు. లోకేష్ యంగ్ టీం లో కీలక మెంబర్ గా ఉంటూ వస్తున్న విజయ్ ని ఈ ప్రభుత్వ హయాంలోనే మంత్రిగా తీసుకుంటారు అని అంటున్నారు. ఆయనను ఎమ్మెల్సీగా చేసి మినిస్టర్ గా చేస్తారు అని అంటున్నారు. చంద్రబాబుకు అయ్యన్నపాత్రుడు ఎంతటి విశ్వాసపాత్రుడో అలాగే లోకేష్ కి విజయ్ విశ్వాస పాత్రుడు అని అంటున్నారు అందుకే తన యంగ్ టీం లో విజయ్ ని ఎంచుకున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఏవీ ఖాళీ అయినా కూటమికే దక్కుతాయి. దాంతో ఒక దానిని జూనియర్ అయ్యన్నకు ఇవ్వడం ద్వారా చట్ట సభకు తీసుకుని రావాలని చూస్తున్నారు. ఆ మీదట మంత్రిగా కూడా చేయడం ద్వారా సీనియర్ అయ్యన్న కళ్ళలో పుత్రోత్సాహాన్ని చూడాలని కూడా అనుకుంటున్నారుట.

విస్తరణలో పెద్ద పీట :

ఉత్తరాంధ్రాలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయ్ ని విస్తరణలో మంత్రిగా తీసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు దాని ద్వారా ఉత్తరాంధ్రాలో టీడీపీ పట్టుని మరింతగా నిలుపుకోవడమే కాకుండా లోకేష్ టీం ని కూడా పరిపుష్టం చేసుకోవాలని చూస్తున్నారుట. అదే విధంగా విశాఖ జిల్లాకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నారుట. ఇక మంత్రిగా రానున్న మూడేళ్ళు విజయ్ పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న మీదట ఆయనను నర్శీపట్నం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపితే విక్టరీ కొట్టేందుకు మరింత ఎక్కువగా అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి అయ్యన్న పాత్రుడు పార్టీని నమ్ముకుని ఉన్న దానికీ విజయ్ కష్టపడిన తీరుకి చంద్రబాబు లోకేష్ కలసి ఇస్తున్న నిండు దీవెనలు ఇవి అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఎపుడు వాస్తవ రూపం దాలుస్తుందో.