Begin typing your search above and press return to search.

అయ్యన్న చెప్పేశారు...వారి సంగతేంటి ?

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం స్పీకర్ అయ్యన్నపాత్రుడి ప్రత్యేకత. ఆయన రాజకీయంగా కీలక నేత సీనియర్ నాయకుడు అయినప్పటికీ కొన్ని విషయాలలో ఏ మాత్రం మొహమాటం లేకుండా కుండ బద్ధలు కొడతారు.

By:  Satya P   |   4 Jun 2026 8:55 AM IST
అయ్యన్న చెప్పేశారు...వారి సంగతేంటి ?
X

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం స్పీకర్ అయ్యన్నపాత్రుడి ప్రత్యేకత. ఆయన రాజకీయంగా కీలక నేత సీనియర్ నాయకుడు అయినప్పటికీ కొన్ని విషయాలలో ఏ మాత్రం మొహమాటం లేకుండా కుండ బద్ధలు కొడతారు. తాజాగా అలాంటి స్టేట్మెంట్ నే ఆయన ఇచ్చారు. తన కుటుంబం సుదీర్ఘ కాలంగా టీడీపీకి సేవ చేసిందని చెప్పారు. ఇక తన వారసులు కూడా రాజకీయంగా టీడీపీలోనే ఉంటూ సేవలు అందించాలనుకుంటున్నారు అని కూడా అయ్యన్న చెప్పారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. అయ్యన్న మరో మాట చెప్పారు తన వయసు అయిపోతోంది కాబట్టి తన వారసులకు చాన్స్ అని ఇండైరెక్ట్ గానే కోరారు.

సీనియర్ మోస్ట్ లీడర్ గా :

ఇక అయ్యన్న విషయం తీసుకుంటే సీనియర్ మోస్ట్ లీడర్. పాతికేళ్ళకే ఎమ్మెల్యే అయిపోయారు. ఇరవై ఏడేళ్ళకే మంత్రి అయిపోయారు. అది కూడా పెళ్ళి కాకుండానే. మంత్రి అయ్యాకనే ఆయన పెళ్ళి చేసుకోవడం విశేషం. ఎన్టీఆర్ అంతలా అయ్యన్నను ఆదరించారు. ఇక అయ్యన్న కూడా టీడీపీని నిబద్ధతతో పనిచేశారు. అధికారం కోల్పోయినా పార్టీనే నమ్ముకున్నారు. పక్క చూపులు చూడలేదు, విపక్షంలో ఉన్నామని సైలెంట్ అవలేదు. ఇక ఆయన కుటుంబం అంతా టీడీపీలో ఉంది. పెద్ద కుమారుడు విజయ్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు రాజేష్ నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. అయ్యన్న సతీమణి కూడా కౌన్సిలర్ గా ఉన్నారు. ఇలా టీడీపీకి అంకితం అయిన ఆ కుటుంబం రాజ్యసభ సీటు కోరుకుంటోంది అని ప్రచారం సాగుతోంది.

చాన్స్ అయితే గ్యారంటీ :

ఇక చంద్రబాబు కానీ లోకేష్ కానీ అయ్యన్న అంటే ఎంతగానో ఇష్టపడతారు, గౌరవిస్తారు. దాంతో ఆయన కుటుంబానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం ఖాయమని అంటున్నారు. రాజ్యసభ సీటు విజయ్ కి గ్యారంటీ అని టాక్ అయితే నడుస్తోంది. ఒక వేళ కాదూ కూడదు అని ఉన్నా చివరి నిముషంలో ఏమైనా సర్దుబాట్లు వల్ల కాకపోయినా 2029 నాటికి విజయ్ కి నర్శీపట్నం ఎమ్మెల్యే సీటు గ్యారంటీ అని అంటున్నారు. మొత్తానికి చూస్తే అయ్యన్న వారసుడికి బెర్త్ కంఫర్మ్ అని గట్టిగా వినిపిస్తున్న మాటగా ఉంది. దాంతో అయ్యన్న ఫ్యామిలీ అయితే హ్యాపీగానే ఉండొచ్చు అని అంటున్నారు.

ధీటైన నేతలుగా :

మరో వైపు చూస్తే అయ్యన్నతో సరిసమానంగా రాణించి ధీటైన నేతలుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మరి కొందరు నేతలు ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలలోనూ ఉన్నారు. వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది గంటా శ్రీనివాసరావు. ఆయన ప్రస్తుతం భీమిలీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన వారసుడికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. 2029 లో భీమిలీ నుంచి తన వారసుడిని ఎమ్మెల్యేగా చేయాలన్నది గంటా ఆలోచన అని అంటున్నారు మరి ఆయన అయ్యన్న మాదిరిగా ఓపెన్ అవలేదు కానీ లోపాయికారీగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అన్నది తెలియడం లేదు. అయితే భీమిలీలో మాత్రం గంటా వారసుడు చురుకుగానే పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

జూనియర్ల కోసమే :

మరో వైపు చూస్తే మాడుగుల ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తన కుమారుడు బండారు అప్పలనాయుడుకు ఇస్తే పెందుర్తి అయినా లేకపోతే మాడుగుల అయినా సీటు 2029 లో ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు. ఆయన కూడా పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సైతం వారసులను ముందుకు తెస్తున్నారు. విజయనగరం జిల్లాలో చూస్తే కనుక చీపురుపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తమ కుమారుడికి ఎచ్చెర్ల సీట్లు కోరుతున్నారు. శ్రీకాకుళం నుంచి చూస్తే మంత్రి అచ్చెన్నాయుడు వారసుడికి కూడా టికెట్ 2029 లో కోరుతారు అని అంటున్నారు. నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తన కుమార్తెకు టికెట్ కోరుతున్నారు. వీరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. వీరంతా దశాబ్దాలుగా టీడీపీ సేవలో ఉన్నారు. మరి అయ్యన్న విషయంలో టీడీపీ అధినాయకత్వం సానుకూలంగా డెసిషన్ తీసుకుంటే వీరి ఆశలు అన్నీ రెట్టింపు కావడం ఖాయమని అంటున్నారు.