మంత్రివర్గంలో ఆ ఫైర్ బ్రాండ్ ఉండాల్సిందేనా ?
ఏపీలో కూటమి ప్రభుత్వం పదిహేను నెలల పాలన పూర్తి అయింది. ప్రభుత్వం గురించి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అనేక వేదికల మీద చెబుతూనే ఉన్నారు.
By: Satya P | 17 Sept 2025 12:00 PM ISTఏపీలో కూటమి ప్రభుత్వం పదిహేను నెలల పాలన పూర్తి అయింది. ప్రభుత్వం గురించి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అనేక వేదికల మీద చెబుతూనే ఉన్నారు. అయితే ఆయనతో పాటుగా గట్టిగా ప్రచారం చేయాల్సిన తీరులో మంత్రులు చేయడం లేదని అసంతృప్తి అయితే ఉంది. దానికి తోడు వైసీపీ చేస్తున్న ప్రచారం కానీ విమర్శలు కానీ తిప్పికొట్టే విధంగా లేదని ఒక భావన అయితే ప్రభుత్వ పెద్దలలో ఉందట. మాటకు మాట కాదు, ఒక ఫైర్ లా అవతల వారి మీద కౌంటర్లు వేస్తే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుగా ఉండాల్సి ఉంది కానీ అదే కూటమిలో తగ్గింది అని అంటున్నారు.
ఫైర్ బ్రాండ్ల కోసం :
కూటమి ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్లు అంటూ ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. ఇష్యూల మీద మాట్లాడే వారు ఉన్నారు. అలాగే విపక్షాలు విమర్శలు చేస్తే కొంతవరకూ ధీటుగా బదులిచ్చే వారూ ఉన్నారు. కానీ జనాల్లోకి బలంగా తాము చెప్పేది నాటుకునేలా చేసే నిప్పు రవ్వలు కావాలని అంటున్నారు. ఇక కూటమి 2024 ఎన్నికల్లో కొత్త ముఖాలకు ఎక్కువగా చాన్స్ ఇవ్వాలని భావించి వారినే తీసుకుంది. దానితో సీనియర్లకు చోటు దక్కలేదు. అయితే ఇపుడు ఆ లోటు ఏమిటో తెలుస్తోంది అని అంటున్నారు.
అయ్యన్న కావాల్సిందే :
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు సీనియర్ నేత, ఎన్టీఆర్ చంద్రబాబుల వద్ద ఆయన అనెక దఫాలుగా మంత్రిగా పనిచేశారు. దాదాపుగా కీలకమైన శాఖలు అన్నీ చూసేశారు. 2024లో తాను చివరి సారిగా పోటీ చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ టెర్మ్ లో మంత్రిగా ఉంటూ తన వారసుడిని తయారు చేయాలని కూడా అనుకున్నారు. కానీ ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. దాంతో ఆయన తన నోరు కట్టేసారు అని మొదట్లో బాధపడేవారు. అయితే ఇటీవల ఆయనలో మార్పు వచ్చింది. ఇపుడు వివిధ వేదికల మీద గట్టిగానే మాట్లాడుతున్నారు. స్పీకర్ గా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూనే జగన్ ని వైసీపీని గట్టిగా విమర్శిస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలు జనాల్లో కూడా చర్చగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి.
ఆయనకు మంత్రి సీటు :
ఈ నేపధ్యంలో ఆయన ఒక్కసారిగా గొంతు పెంచడానికి కారణం ఏమిటి అన్న చర్చ అయితే వస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన అయ్యన్నకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. మంత్రివర్గంలో మార్పు చేర్పులు కచ్చితంగా ఉంటాయని అవి ఎపుడు అన్నది తెలియకపోయినా జరిగితే మాత్రం అయ్యన్నకు మంత్రి పదవి ఖాయమని చర్చ అయితే బలంగా ఉంది. అయ్యన్న లాంటి వారు కొందరు ఉంటే బాగా కాసుకుంటారు అన్నది కూడా ప్రభుత్వ పెద్దలలో ఉంది అని అంటున్నారు. జనాలలో చర్చ రావడానికి అయినా ప్రభుత్వం చేసేది ఏమిటో తెలియాలి అనుకున్నా సీనియర్లను ఫైర్ బ్రాండ్లను తీసుకోవడమే బెటర్ అని అంటున్నారు.
దూకుడుగానే ఉంటూ :
అయ్యన్న లాంటి వారు చేసే కామెంట్స్ చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని సార్లు ప్రత్యర్ధులు సైతం నొచ్చుకునేలా కటువుగా ఉంటాయి. అయితే అలాంటివి ఈ నేపధ్యంలో అవసరం అన్న భావన ఉందట. ఎందుకంటే ప్రభుత్వం చేసేది చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే దుష్ప్రాచారాన్ని తిప్పికొట్టాలని అంటున్నారు. అలా చేయకపోతే జనాలు వాటినే నమ్మే ప్రమాదం ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే అయ్యన్న లాంటి వారు ఉండాలి అని పార్టీలో కార్యకర్తల స్థాయి నుంచే ఒక రకమైన భావనగా ముందుకు వస్తోందట. అధినాయకత్వం కూడా దీని మీద సీరియస్ గా ఆలోచిస్తోంది అని అంటున్నారు. దాంతో అయ్యన్న రాజకీయ పదవీ విరమణ అన్నది మంత్రి పదవితోనే తప్ప స్పీకర్ గా కానే కాదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
