Begin typing your search above and press return to search.

అయోధ్య మందిరానికి 400 కేజీల భారీ తాళం

అయోధ్య భవ్య రామమందిరం కోసం సత్యప్రకాశ్ కొన్ని నెలల పాటు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్దదైన తాళాన్ని.. అది కూడా చేతితో తయారు చేసిన తాళాన్ని తయారు చేయటం విశేషం

By:  Tupaki Desk   |   7 Aug 2023 4:16 AM GMT
అయోధ్య మందిరానికి 400 కేజీల భారీ తాళం
X

దశాబ్దాల తరబడి ఉన్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. కోట్లాది మంది ఆశలు.. ఆకాంక్షలకు నిలువెత్తు రూపంగా చెప్పే అయోధ్య రామ మందిరం నిర్మాణం మొదలు కావటమే కాదు.. పూర్తి అయ్యే పరిస్థితి రోజుల్లోకి వచ్చేసింది. మరికొద్ది నెలల్లో భవ్య రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఆలయానికి మరో విశేషం ఇప్పుడు అదనంగా చేరనుంది.

ఈ ఆలయానికి ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక తాళాల నిపుణుడు.. 400 కేజీల భారీ తాళాన్ని తయారు చేశారు. తాళాల సిటీగా చెప్పే అలీగఢ్ కు చెందిన సత్యప్రకాశ్ శర్మ రాములోరి భక్తుడు. తాళాల తయారీలో నిపుణుడు.

ఆయన ఫ్యామిలీకి వందేళ్లకు పైగా తాళాల్ని తయారు చేసే అనుభవం ఉంది. ఆయన కుటుంబం మొత్తం తాళాల తయారీ మీదే ఉన్నారు. ఇదిలా ఉండగా.. రాములోరి ఆలయానికి ప్రత్యేకంగా ఆయనో తాళాన్ని తయారు చేశారు.

అయోధ్య భవ్య రామమందిరం కోసం సత్యప్రకాశ్ కొన్ని నెలల పాటు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్దదైన తాళాన్ని.. అది కూడా చేతితో తయారు చేసిన తాళాన్ని తయారు చేయటం విశేషం. ఈ భారీ తాళం బరువు ఏకంగా 400కేజీలు. ఈ తాళాన్ని త్వరలోనే అయోధ్యలోని రామాలయ అధికారులకు అందజేయనున్నారు. అయోధ్య ఆలయాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని సిద్ధం చేశారు.

పది అడుగుల ఎత్తు.. 4.5 అడుగుల వెడల్పు.. 9.5 అడుగుల మందంతో తయారు చేసిన ఈ తాళానికి.. తాళం చెవి సైజు వింటేనే వావ్ అనకుండా ఉండలేరు. 400కేజీల భారీ తాళాన్ని తెరిచేందుకు నాలుగు అడుగుల తాళం చెవిని తయారు చేయటం గమనార్హం.

తాళం తయారీ పూర్తి అయినా.. చిన్న చిన్న మార్పులతో పాటు.. మరికొన్ని మెరుగుల్ని తీర్చిదిద్దుతున్నారు. తాను తయారు చేసిన తాళానికి తన భార్య రుక్మిణి ఎంతో సాయం చేసిందని.. దీన్ని తయారు చేసేందుకు రూ.2 లక్షలు ఖర్చు చేసినట్లుగా చెప్పారు.