Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ ను అయోధ్యతో కొట్టేయటమే మోడీషా లక్ష్యమా?

ఒకసారి గెలవటం.. ప్రధాని కావటం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. రెండోసారి.. అలాంటిదే రిపీట్ చేయటం అంత తేలికైన విషయం కాదు

By:  Tupaki Desk   |   25 Dec 2023 5:01 AM GMT
హ్యాట్రిక్ ను అయోధ్యతో కొట్టేయటమే మోడీషా లక్ష్యమా?
X

ఒకసారి గెలవటం.. ప్రధాని కావటం కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. రెండోసారి.. అలాంటిదే రిపీట్ చేయటం అంత తేలికైన విషయం కాదు. అందునా భారతదేశంలాంటి విలక్షణ దేశంలో. అలాంటిది కూడా సాధించిన తర్వాత సదరు నేతను ఎట్టి పరిస్థితుల్లో తక్కువగా అంచనా వేయలేం. ఇలాంటి వేళలో.. మొదటి రెండుసార్లు ఎలా అయితే అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారో.. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించటం అంత ఈజీ కాదు. ఇప్పుడు అదే క్లిష్టమైన లక్ష్యాన్ని సాధించటమే లక్ష్యంగా చేసుకున్న మోడీషాలు.. ఆ దిశగా అడుగులు వడివడిగా వేస్తున్నారు. అయితే.. ఇక్కడ మర్చిపోకూడని విషయం ఏమంటే.. 2024 ఎన్నికల ఎజెండాగా అయోధ్యను పెట్టుకోవాలన్న నిర్ణయాన్ని 2019లోనే డిసైడ్ చేసుకోవటాన్ని మర్చిపోకూడదు.

మిగిలిన నేతలకు.. మోడీకి మధ్య ఉండే తేడా ఏమంటే.. వాస్తవాన్ని వాస్తవంగా చూడటం. ఆ మాటకు వస్తే.. వాస్తవంలో యాబై శాతం సానుకూలత ఉంటే.. 40 శాతమే సానుకూలత ఉండేలా లెక్కలు వేసుకొని బరిలోకి దిగే ధోరణి. ఇదే కమలనాథులకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. మరో మూడునాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళలో.. దశాబ్దాలుగా అత్యధిక హిందువులు ఎదురుచూస్తున్న అయోద్య అంశాన్ని చివరకు తీసుకురావటం.. దాని ప్రారంభోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించటం చూస్తే.. మోడీషాల ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.

అయోధ్య లో రామాలయాన్ని ఒక ఆలయంగా తీర్చిదిద్ది వదిలేయకుండా.. దానికి అదనంగా అయోధ్య మొత్తాన్ని మార్చేసేలా చేసిన ప్రక్రియను చూస్తే.. మోడీ తెలివి ఏమిటో అర్థమవుతుంది. తాను చేసిన పనుల్ని ప్రపంచం మొత్తానికి చాటేలా చేయటంలో ఆయనకున్న నైపుణ్యం ఇప్పుడున్న రాజకీయ అధినేతల్లో ఎవరికి రాదనే చెప్పాలి. అయోధ్యలో రామాలయంలో రాములోరి ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న చేపడుతుంటే.. దానికి మూడు వారాల ముందు నుంచే అయోధ్యంలో పలు కార్యక్రమాల్ని బ్యాక్ టు బ్యాక్ చేయటం కనిపిస్తుంది.

ఈ నెల 30న అయోధ్యలో ఎయిర్ పోర్టును ప్రారంభించటం.. ఆ తర్వాత 15 కిలోమీటర్ల మేర రోడ్ షోగా వెళ్లి.. అక్కడ రీమోడలింగ్ చేసిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తారు. అక్కడితో ఆగిపోతే ఆయన మోడీ ఎందుకు అవుతారు చెప్పండి? మార్చిన అయోధ్య స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ తో పాటు.. కొత్తగా తెర మీదకు తెస్తున్న అమృత్‌భారత్‌ రైళ్లకు జెండా ఊపి ప్రారంభిస్తారు.

మళ్లీ.. అయోధ్య ఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడటంతో మోడీ అనుకున్న అయోధ్య టీజర్ లాంఛింగ్ పూర్తి అవుతుంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య అంశం నేరుగా ప్రచార అస్త్రం కానప్పటికీ.. దాని ద్వారా వచ్చే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో ఎన్నికల్లో దూసుకెళ్లే వ్యూహాన్ని చాకచక్యంగా అమలుచేస్తున్నారు మోడీషాలు. దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్న రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేయటమే కాదు.. అయోధ్య రూపురేఖలు మార్చేసిన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ జనాల మనసుల్లో చెరిగిపోక ముందే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చేయటం.. మోడీ లాంటి నేత దేశ ప్రధానిగా ఉండాల్సిన అవసరాన్ని ప్రజలకు కలగేలా చేస్తున్నారని చెప్పాలి.

మొత్తంగా తమకు వచ్చే ఓట్ల శాతానికి అదనంగా పది శాతాన్ని తెచ్చుకోవటమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుంది. మూడోసారి ఎన్నికయ్యే విషయంలో కాసిన్ని ఓట్ల అవసరపడితే.. ఇప్పుడు అదనంగాటార్గెట్ చేసుకున్న పదిశాతం ఓట్లు మేలు చేయాలన్న ఆలోచనలో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లుగా చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మోడీకి ధీటుగా నిలిచే నేత ఎవరూ బరిలో లేని పరిస్థితి ఒకటైతే.. అధికారపక్షానికి అంతో ఇంతో ధీటుగా నిలిచే ప్రతిపక్షం లేకపోవటం మోడీకి మాత్రమే ఉన్న మరో అతి పెద్ద సానుకూలాంశంగా చెప్పాలి. సానుకూలతలు చుట్టూ ఉన్నా.. అవి సరిపోవని.. మరిన్ని సానుకూలతలు కావాలన్నట్లుగా మోడీ చూపే విజయ దాహమే ఆయన అసలు బలం. అది ఉన్నంత వరకు మోడీకి తిరుగేలేదు.