Begin typing your search above and press return to search.

ఆయేషా మీరా కేసు క్లోజ్.. అసలు నేరస్తులు ఎవరు? న్యాయం ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్‌లో 18 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  A.N.Kumar   |   21 Feb 2026 10:59 AM IST
ఆయేషా మీరా కేసు క్లోజ్.. అసలు నేరస్తులు ఎవరు? న్యాయం ఎక్కడ?
X

ఆంధ్రప్రదేశ్‌లో 18 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. దీర్ఘకాలంగా విచారణ సాగిన ఈ కేసును సీబీఐ కోర్టు తాజాగా క్లోజ్ చేసింది. సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంటూ కేసును ముగించడంతో అసలు నిందితులు ఎవరు అన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.

2007 డిసెంబర్‌లో విజయవాడలోని హాస్టల్‌లో ఆయేషా మీరాను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు రావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసులో 2009లో పోలీసులు సత్యంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి నిందితుడిగా పేర్కొన్నారు. కోర్టు అతనిని దోషిగా తేల్చి శిక్ష విధించడంతో సత్యంబాబు దాదాపు ఎనిమిదేళ్లు జైల్లో గడిపాడు. అయితే తాను నిర్దోషినని వాదించిన అతనికి 2017లో హైకోర్టు పెద్ద రిలీఫ్ ఇచ్చి నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఈ కేసు దర్యాప్తుపై అనుమానాలు మరింత పెరిగాయి.

తరువాత అసలు నిందితులను పట్టుకోవాలని కోరుతూ ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు 2018లో కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి పాత ఆధారాలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ నివేదికలను సమగ్రంగా పరిశీలించినప్పటికీ నిందితులను నిర్ధారించేందుకు సరైన ఆధారాలు లభించలేదని కోర్టుకు నివేదించింది.

ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు కేసును క్లోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 18 ఏళ్లుగా సాగిన ఈ కేసు చివరకు మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో ఒక నిర్దోషి ఎనిమిదేళ్లు జైల్లో గడపడం, అసలు నేరస్తులు పట్టుబడకపోవడం, బాధిత కుటుంబానికి న్యాయం అందకపోవడం వంటి అంశాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు లోపాలపై న్యాయవ్యవస్థ పనితీరుపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆయేషా మీరా కుటుంబం మాత్రం ఇప్పటికీ న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. అసలు నిందితులను గుర్తించి శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు ముగిసినా “న్యాయం ఎక్కడ?” అన్న ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తూనే ఉంది.