Begin typing your search above and press return to search.

'సాఫ్ట్ స్కిల్స్‌'.. ఏఐ యుగంలో విజయానికి ఇదే కీలకం

ఈ కీలక సమయంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ సీఈఓ మాట్ గార్మన్ యువతకు ఒక విలువైన సలహా ఇచ్చారు.

By:  A.N.Kumar   |   11 Nov 2025 10:43 AM IST
సాఫ్ట్ స్కిల్స్‌.. ఏఐ యుగంలో విజయానికి ఇదే కీలకం
X

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) శరవేగంగా అన్ని రంగాల్లో తన ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగులు, విద్యార్థులు కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ కీలక సమయంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ సీఈఓ మాట్ గార్మన్ యువతకు ఒక విలువైన సలహా ఇచ్చారు. భవిష్యత్తులో విజయానికి కేవలం సాంకేతిక (టెక్నికల్) జ్ఞానం మాత్రమే కాక సాఫ్ట్ స్కిల్స్ అత్యంత అవసరం అని నొక్కి చెప్పారు.

* AI చేయలేని పనులే మన భవిష్యత్తు

గార్మన్ అభిప్రాయం ప్రకారం.. ఏఐ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా.. మానవులకు మాత్రమే సొంతమైన కొన్ని సామర్థ్యాలను యంత్రాలు అనుకరించలేవు. అవేంటంటే.. క్రిటికల్‌ థింకింగ్‌.. క్లిష్టమైన సమస్యలను విశ్లేషించడం, లోతైన ఆలోచనతో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఏఐతో సాధ్యం కాదు. అడాప్టబిలిటీ అవసరం. మారుతున్న పరిస్థితులకు, కొత్త టెక్నాలజీలకు త్వరగా అలవాటు పడగల సామర్థ్యం అవసరం.. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరిగా ఉండాలి. తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం, ఇతరులతో సమర్థవంతంగా సంభాషించడం ముఖ్యం..

గార్మన్ ఇదే విషయాన్ని చెబుతూ "మానవుల ఆలోచనా సామర్థ్యం, క్రియేటివ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, వివేకంతో కూడిన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం మాత్రం యంత్రాలు చేయలేవు." అందుకే యువత ఏ విభాగంలో చదువుతున్నా, స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

* మానవీయ నైపుణ్యాల ప్రాధాన్యత

అనేక సంస్థలు తమ కస్టమర్లతో మానవీయంగా మాట్లాడగలిగే.. వారి భావనను పంచుకోగలిగే వ్యక్తులను కోరుకుంటాయి. ఏఐ యుగంలోనూ ఈ మానవీయ నైపుణ్యాలు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటాయని అమెజాన్ వెబ్ సర్వీసెస్ సీఈఓ స్పష్టం చేశారు.

* జోహో కార్ప్‌ కూడా అదే సూచన

ఈ అభిప్రాయాన్ని జోహో కార్పొరేషన్‌ ఏఐ రీసెర్చ్‌ చీఫ్‌ రాంప్రకాశ్‌ రామమూర్తి కూడా బలపరిచారు. ఇంటర్నెట్‌ వచ్చినప్పుడు ఉద్యోగాల రూపురేఖలు మారినట్లే, ఇప్పుడు ఏఐ కారణంగానూ ఉద్యోగాల స్వరూపం మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ రీసనింగ్‌, క్రిటికల్‌ థింకింగ్‌ వంటి నైపుణ్యాలలో మానవులకే ఎప్పటికీ ఆధిక్యం ఉంటుందని తెలిపారు. మానవ మేధస్సు ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఏఐ సాంకేతికత అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. ఉద్యోగాలను భద్రపరుచుకోవాలంటే టెక్నాలజీ నైపుణ్యాలకు తోడు మానవీయ నైపుణ్యాలు, లోతైన ఆలోచనా శక్తి, సమస్య పరిష్కార దృక్పథం అత్యంత అవసరం. భవిష్యత్తులో విజయవంతం కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ 'సాఫ్ట్ స్కిల్స్‌'పై దృష్టి సారించడం తప్పనిసరి.