అవంతికి కూటమిలోకి...గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట !
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మాజీ వైసీపీ నేత అవంతి శ్రీనివాసరావు ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 23 July 2025 2:00 AM ISTవిశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మాజీ వైసీపీ నేత అవంతి శ్రీనివాసరావు ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్లుగా తెలుస్తోంది. ఆయన కూటమిలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని అంటున్నారు. గత ఏడాది డిసెంబర్ లో వైసీపీకి అవంతి రాజీనామా చేశారు. ఆనాడు ఆయన జగన్ మీద విమర్శలు చేస్తూ పార్టీ నుంచి వైదొలగారు.
ఆ సమయంలో ఆయన కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుందని కీలక కామెంట్స్ చేశారు. దాంతో ఆయన మనసు కూటమి వైపు ఉందని అంతా అనుకున్నారు. ఇదిలా ఉంటే గడచిన ఆరేడు నెలలుగా ఆయన తన వంతుగా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆయన టీడీపీలో చేరాలని చూస్తున్నారని టాక్.
అయితే ఆయనకు అక్కడ ఒకనాటి రాజకీయ గురువు అయిన భీమిలీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెడ్ సిగ్నల్ చూపించారు అని కూడా ప్రచారం సాగింది. నిజానికి అవంతిని రాజకీయలోకి తీసుకుని వచ్చిందే గంటా శ్రీనివాసరావు. ఆయనకు 2009లో ప్రజారాజ్యం టికెట్ ని ఇప్పించి భీమునిపట్నం నుంచి పోటీ చేయించారు. అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి గంటా వెంటనే ఉంటూ ఆ తర్వాత కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయనతో కలసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇక ఆయన 2014లో అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే 2019లో భీమిలీ నుంచి పోటీ చేయాలని అనుకున్నపుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనాడు మంత్రిగా ఉన్న గంటా అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి కారణం గంటా కూడా భీమిలీ నుంచే మళ్ళీ పోటీకి దిగాలని అనుకున్నారు. అలా ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో అవంతి వెళ్ళి వైసీపీలో చేరారు.
వైసీపీలో ఆయన భీమిలీ టికెట్ పొంది ఆ తరువాత వచ్చిన ప్రభ్తువంలో పర్యాటక శాఖ వంటి కీలక శాఖను మూడేళ్ళ పాటు మంత్రిగా వ్యవహరించారు. ఇక 2022లో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. 2024 లో వైసీపీ తరఫున భీమిలీ నుంచి పోటీ చేసి గంటా చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తరువాత సైలెంట్ గా ఉండి డిసెంబర్ లో ఆ పార్టీని వీడారు
మళ్ళీ తెలుగుదేశంలోనే రీ ఎంట్రీ ఇవ్వాలని అవంతి గట్టి ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. ఆయన కుమార్తె ఆరవ వార్డు కార్పోరేటర్ మార్చిలో జరిగిన జీవీఎంసీలో వైసీపీ మేయర్ పై కూటమి పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. తన కుమార్తె ఓటు ద్వారా కూటమికి మేయర్ పదవి దక్కేలా చూసారు. ఇలా అవంతి శ్రీనివాసరావు కూటమిని మరింత దగ్గర అయ్యారు.
దాంతో నాటి నుంచే ఆయన టీడీపీలో చేరుతారు అన్న చర్చ ఇంకా పెరిగింది. ఎట్టకేలకు టీడీపీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం అయితే సాగుతోంది. ఇక గంటా శ్రీనివాసరావు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారని అంటున్నా 2027లో జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో భీమిలీ నుంచి కొత్తగా ఏర్పడే సీటు అవంతికి ఇస్తారని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే అవంతికి కూటమిలోకి వెళ్ళబోతున్నారు అన్నది ప్రచారంగా ఉంది. ప్రజారాజ్యం కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇలా అనేక పార్టీలు మారిన అవంతి ఇపుడు రెండోసారి పసుపు కండువా కప్పుకోబోతున్నారు. ఆయనకు అంగబలం అర్ధబలం ఉండడంతో పాటు సామాజిక వర్గం పరంగా బలమైన నేత కావడంతో టీడీపీ ఆయనను చేర్చుకునేందుకు సుముఖంగా ఉందని అంటున్నారు. మరి అవంతి పసుపు కండువా కప్పుకునే ముహూర్తం ఎపుడో చూడాల్సి ఉంది.
