Begin typing your search above and press return to search.

అట్టుడుకుతున్న అవ‌నిగ‌డ్డ... టీడీపీ, జ‌న‌సేన నేత‌ల ముంద‌స్తు అరెస్టు

అయితే, బంద్ కి అనుమతి లేదంటూ వ్యాపారస్తులు తమ వ్యాపారాలను కొనసాగించుకోవచ్చు అంటూ పోలీసులు రంగంలోకి దిగారు.

By:  Tupaki Desk   |   21 Oct 2023 8:00 AM GMT
అట్టుడుకుతున్న అవ‌నిగ‌డ్డ... టీడీపీ, జ‌న‌సేన నేత‌ల ముంద‌స్తు అరెస్టు
X

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం అవ‌నిగ‌డ్డ‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు తీవ్ర స్థాయిలో అట్టుడుకుతోంది. అవ‌నిగ‌డ్డ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బంద్‌కు అనుమ‌తి లేదంటూ.. టీడీపీ స‌హా జ‌న‌సేన నాయ‌కుల‌ను ముంద‌స్తు అరెస్టు చేశారు. మాజీ డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌ను గృహ నిర్బంధం చేశారు. అంతేకాదు.. 5 కంపెనీల పారామిలిట‌రీ ఫోర్స్‌ను రంగంలోకి దింపి.. అడుగ‌డుగునా.. భ‌ద్ర‌త‌ను పెంచారు.

ఏం జ‌రిగింది?

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇటీవ‌ల అవనిగడ్డకు వచ్చారు. ఈ సందర్భంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీడీపీ, జనసేన శ్రేణులు ప‌ట్టుబ‌ట్టారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మహాధర్నాకు దిగారు. శుక్ర‌వారం జనసేన పార్టీ అవనిగడ్డ మండల కార్యాలయం నుంచి కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయం వైపు వెళుతుండగా టీడీపీ కార్యకర్తలు కూడా జత కలిశారు. ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు.

ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, జనసేన‌, టీడీపీ నేతల నిరసనతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు రోడ్డుపై ధర్నా చేస్తున్నవారి మీదకు దూసుకొచ్చారు. వారితోపాటు వచ్చిన ఎమ్మెల్యే సింహాద్రి ర‌మేశ్ బాబు కూడా ధర్నా చేస్తున్న వారిపైకెళ్లి నెట్టి వేశారు. ఎవర్రా మీరు.. ఎక్కడికి వచ్చి ఏం వాగుతున్నారు? అంటూ దుర్భాషలాడుతూ కొందరిపై చెయ్యి చేసుకున్నారు. టీడీపీ కార్య‌క‌ర్త చేతిలో ఉన్న జెండాను లాక్కుని, ఆ జెండాకు ఉన్న క‌ర్ర‌తో టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు.

ఎమ్మెల్యే రౌడీగా మారారంటూ.. టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో శ‌నివారం అవ‌నిగ‌డ్డ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పిలుపు మేరకు అవనిగడ్డలో వ్యాపారులు స్వచ్చందంగా బంద్ నిర్వహిస్తున్నారు. అయితే, బంద్ కి అనుమతి లేదంటూ వ్యాపారస్తులు తమ వ్యాపారాలను కొనసాగించుకోవచ్చు అంటూ పోలీసులు రంగంలోకి దిగారు. అంతేకాదు.. జ‌న‌సేన‌, టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు రోడ్ల‌పైకి రాకుండా.. వారిని నిర్బంధించారు. దీంతో అవ‌నిగ‌డ్డ‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అనే ఉద్ర‌క్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.