మన ప్రాచీన చరిత్ర.. మోదీకి ఆస్ట్రేలియా రిటర్న్ గిఫ్ట్ అదుర్స్
భారత కాలగర్భంలో కలిసిపోయినట్లు భావించిన మన ప్రాచీన సంస్కృతి, శిల్పకళా వైభవం మళ్లీ స్వదేశానికి తరలిరానుంది.
By: A.N.Kumar | 9 July 2026 4:26 PM ISTభారత కాలగర్భంలో కలిసిపోయినట్లు భావించిన మన ప్రాచీన సంస్కృతి, శిల్పకళా వైభవం మళ్లీ స్వదేశానికి తరలిరానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక అద్భుతమైన.. చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తూ.. మన దేశానికి చెందిన అపురూపమైన పురాతన శిల్పాలు, పూజా సామగ్రిని తిరిగి అప్పగించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించింది. భారత సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది.
ద్వైపాక్షిక చర్చలు.. ఆత్మీయ సెల్ఫీలు
ఇండోనేషియా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసేలా భారత్-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరమ్, ఎకనామిక్ రోడ్‌మ్యాప్ బిజినెస్ రిసెప్షన్‌లో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, అల్బనీస్ దిగిన ఆత్మీయ సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ పర్యటనలో అన్నింటికంటే హైలైట్‌గా నిలిచింది ఆస్ట్రేలియా ప్రకటించిన "రిటర్న్ గిఫ్ట్".
స్వదేశానికి రానున్న ఆ అపురూప కళాఖండాలు ఇవే
గతంలో అక్రమ రవాణా ద్వారా విదేశాలకు తరలిపోయిన తమిళనాడులోని చారిత్రక దేవాలయాలకు చెందిన మూడు అత్యంత విలువైన పురాతన వస్తువులను ఆస్ట్రేలియా ఇప్పుడు అధికారికంగా భారత్‌కు అప్పగించనుంది. చోళులు, విజయనగర సామ్రాజ్యాల కాలం నాటి ఆ విశిష్ట కళాఖండాలు భారత్ కు రానున్నాయి.
భద్రకాళి అమ్మవారి లోహపు త్రిశూలం
తిరువారూర్ జిల్లా కొల్లుమాంగుడిలోని శ్రీ కాశీవిశ్వనాథస్వామి ఆలయానికి చెందిన ఈ త్రిశూలం అత్యంత అరుదైనది. నిపుణుల అంచనా ప్రకారం ఇది 13వ నుంచి 16వ శతాబ్దం మధ్యకాలానికి చెందినది. ఈ త్రిశూలం పైభాగంలో ఉగ్రరూపంలో ఉన్న భద్రకాళి అమ్మవారి శిల్పాన్ని అద్భుతంగా చెక్కారు. శైవ, శాక్తేయ సంప్రదాయాల్లో ఇది దుష్టశిక్షణకు, దైవిక శక్తికి ప్రతీక.
పవిత్ర రాతి నంది విగ్రహం
అదే కాశీవిశ్వనాథస్వామి ఆలయానికి చెందిన రాతి నంది విగ్రహం భారతీయ శిల్పకళా వైభవానికి నిదర్శనం. మెడలో గంటలు, పూలదండలతో ప్రశాంత ముద్రలో పడుకుని ఉన్న ఈ నంది రూపం చోళుల కాలపు శిల్పశైలిని ప్రతిబింబిస్తుంది.
ఆరు తలల షణ్ముఖ కార్తికేయుడి శిల్పం
తంజావూరు జిల్లా మానంబాడిలోని ప్రసిద్ధ నాగనాథస్వామి ఆలయానికి చెందిన విగ్రహం ఇది. 11వ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోళుడి కాలంలో నిర్మితమైన ఈ శిల్పంలో కార్తికేయుడు ఆరు తలలు, 12 చేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి, తన వాహనమైన నెమలితో కలిసి దర్శనమిస్తాడు.
సాంస్కృతిక బంధానికి సరికొత్త ప్రతీక
మన పూర్వీకులు అందించిన అపురూపమైన ఆధ్యాత్మిక, చారిత్రక సంపద మళ్లీ మన దేశానికి చేరుకోవడం దేశ ప్రజలందరికీ గర్వకారణం. దౌత్యపరమైన సంబంధాలతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి ఈ పరిణామం ఒక బలమైన నిదర్శనంగా నిలుస్తోంది.
