Begin typing your search above and press return to search.

గుడ్డు, ఇల్లు, చైనా.. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇవే

కానీ ఆస్ట్రేలియా ఎన్నికలు మాత్రం భిన్నమైనవి. ఎందుకంటే ఇక్కడ సాధారణ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి.

By:  Tupaki Desk   |   2 May 2025 7:00 AM IST
గుడ్డు, ఇల్లు, చైనా.. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇవే
X

మనదేశానికి దాదాపు 10వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా ఖండం మొత్తం విస్తరించి ఉన్న ఒక ప్రత్యేకమైన దేశం. ఈ వారం అక్కడ జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రభావం మనవరకు వినిపిస్తుంది. ప్రపంచంలోని ప్రతి మూలలో ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల కెనడాలో మార్క్ కార్నీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆస్ట్రేలియా ఎన్నికలు మాత్రం భిన్నమైనవి. ఎందుకంటే ఇక్కడ సాధారణ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. ధరల పెరుగుదల, గృహాల కొరత, ఇంధనం, చైనా వంటి శక్తివంతమైన దేశంతో సంబంధాలు వంటి అంశాలు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి.

మే 3న ఆస్ట్రేలియాలోని ప్రజలు తమ పోలింగ్ బూత్‌లకు చేరుకుంటారు. దాదాపు 1.8 కోట్ల మంది ఓటర్లు 2022 నుంచి ప్రధానమంత్రిగా ఉన్న ఆంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తారా లేదా ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్ నేతృత్వంలోని లిబరల్ పార్టీకి అవకాశం ఇస్తారా అనేది నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలను ఆసక్తికరంగా, నిర్ణయాత్మకంగా మార్చే ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం.

1. గుడ్డు, బీర్, అద్దె

గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ధరల పెరుగుదల సామాన్య ప్రజలకు తలనొప్పిగా మారింది. 2023లో గుడ్ల ధరలు 11శాతం వరకు పెరిగాయి, బీర్ ధర కూడా 4శాతం పెరిగింది. అద్దెలు మరింత వేగంగా పెరిగాయి. 2023లో 8.1%, 2024లో మరో 4.8% పెరుగుదల నమోదైంది. వడ్డీ రేట్లు కూడా ప్రజల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయి. ఆల్బనీస్ ప్రభుత్వం 2022లో అధికారంలోకి వచ్చినప్పుడు రెపో రేటు 0.35శాతం ఉండగా, ఇప్పుడు అది 4.35శాతంకి చేరుకుంది. అయితే ఇటీవలి గణాంకాలు ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 4.1శాతానికి కొద్దిగా తగ్గిందని చూపుతున్నాయి. ఇది తదుపరి ద్రవ్య విధాన సమావేశంలో రేట్ల తగ్గింపుకు ఆశలు కలిగిస్తోంది. 2024లో టర్కీ సగటు ద్రవ్యోల్బణం దాదాపు 38శాతంగా ఉంది. ఇది ఆస్ట్రేలియా కంటే చాలా ఎక్కువ.

2. ఇంటి నిర్మాణం ఒక యుద్ధమే

ధరల పెరుగుదల ప్రభావం కేవలం ఆహారం, పానీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇల్లు కట్టడం, కొనడం కూడా కష్టతరంగా మారింది. అనేక నిర్మాణ సంస్థలు మూతపడటంతో ఇళ్ల సరఫరా మరింత తగ్గిపోయింది. లేబర్ పార్టీ 1.2 మిలియన్ కొత్త ఇళ్లు నిర్మిస్తామని వాగ్దానం చేసింది. కానీ ఇప్పటివరకు ఉన్న గణాంకాలు ఈ లక్ష్యం ఇంకా దూరంగా ఉందని సూచిస్తున్నాయి. ఎక్కువ మంది ప్రజలు ఇళ్లు కొనుగోలు చేయగలగడానికి ప్రభుత్వం మొదటిసారి కొనుగోలుదారుల కోసం డౌన్ పేమెంట్ 20శాతం నుంచి 5శాతానికి తగ్గించింది. లిబరల్ పార్టీ వలసలను తగ్గించడం ద్వారా ఇళ్లపై ఒత్తిడిని తగ్గించడంపై దృష్టి సారించింది. అలాగే ప్రజలు తమ సూపర్యాన్యుయేషన్ ఫండ్ (పదవీ విరమణ పొదుపు) నుంచి ఇళ్లు కొనుగోలు చేయగలగాలని.. హోమ్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటుంది.

3. ఇంధన విధానం

ఆస్ట్రేలియా 2050 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే లేబర్, లిబరల్ పార్టీల మార్గాలు భిన్నంగా ఉన్నాయి. ఆల్బనీస్ ప్రభుత్వం 2030 నాటికి దేశం 82శాతం ఇంధన అవసరాలను పునరుత్పాదక వనరుల నుండి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌర, పవన శక్తి వంటివి ఇందులో ముఖ్యమైనవి. అయితే ప్రతిపక్షం అణు శక్తిని పెంచుతామని చెబుతోంది. ఏడు అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తామని వాగ్దానం చేస్తోంది. వాటిలో మొదటిది 2035లో ప్రారంభమవుతుంది.

4. చైనాతో సంబంధాలు

లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాతో సంబంధాలలో కొంత మెరుగుదల కనిపించింది. వాణిజ్య ఆంక్షలు తొలగిపోయాయి. ప్రధానమంత్రి ఆల్బనీస్ బీజింగ్‌ను కూడా సందర్శించారు. అయితే ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్ చైనాతో ఎక్కువగా మెతకగా ఉండటం ఆస్ట్రేలియా వ్యూహాత్మక స్థానాన్ని బలహీనపరుస్తుందని భావిస్తున్నారు. అవసరమైన చోట ఏ దేశం విషయంలోనైనా విమర్శించడానికి వెనుకాడకూడదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.

5. సంక్షోభంలో ఆరోగ్య రంగం

ఆస్ట్రేలియా యూనివర్సల్ హెల్త్‌కేర్ వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సిబ్బంది కొరత, పెరుగుతున్న ఖర్చులు పరిస్థితిని మరింత దిగజార్చాయి. దీని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతోంది. వారు ఇప్పుడు చికిత్సను వాయిదా వేస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఓటర్ల ఈ ఆందోళనను సొమ్ము చేసుకోవడానికి రెండు ప్రధాన పార్టీలు ఆరోగ్య సంరక్షణలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని చెబుతున్నాయి.