Begin typing your search above and press return to search.

ఆగ‌స్టు నుంచి పండ‌గే.. బాబు కానుక‌ల వెల్లువ‌.. !

ఇక‌, ఆగ‌స్టు నెల నుంచే వితంతు పింఛన్లను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం తెలిపింది. అంటే వైసిపి హయంలో కొందరికి వితంతు పింఛన్లు తీసేశారు.

By:  Tupaki Desk   |   27 July 2025 7:00 PM IST
ఆగ‌స్టు నుంచి పండ‌గే.. బాబు కానుక‌ల వెల్లువ‌.. !
X

ఆగస్టు నెల నుంచి రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాల అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక రకంగా ఇది ఏపీలో పండగ వాతావరణం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఆగస్టు 15 తారీకు నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు అన్ని సిద్ధం చేసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా సౌకర్యం కల్పిస్తామని మంత్రి అచ్చం నాయుడు కూడా ప్రకటించారు.

పల్లె వెలుగు, డీలక్స్, ఎక్స్ప్రెస్ తో పాటు మరో రెండు రకాల బస్సులను కూడా మహిళల ప్రయాణానికి అనుమతించనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల మహిళల సంతృప్తిని కూటమి వైపు పెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు రైతులు గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇది, ఆగస్టు తొలి వారంలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి 13 నెలలుగా అన్నదాతలు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఖరీఫ్ కూడా ప్రారంభం అయిపోయింది. అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురుచూస్తున్నారు అన్నది వాస్తవం. వాస్తవానికి గత ఏడాది దీన్ని అమలు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మారడం, అదేవిధంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాకపోవడం కారణంగా ఈ పథకాన్ని వాయిదా వేశారు. వచ్చే నెలలో దీన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం ఆశలు రేకెత్తిస్తోంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

ఇక‌, ఆగ‌స్టు నెల నుంచే వితంతు పింఛన్లను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం తెలిపింది. అంటే వైసిపి హయంలో కొందరికి వితంతు పింఛన్లు తీసేశారు. వాటిని తాము మళ్ళీ పునరుద్ధరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది కూడా మంచి కార్యక్రమం అని చెప్పాలి. అలాగే ఆగస్టు 15 తారీకు నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా అన్ని సేవలను ఆన్లైన్లో పొందే విధంగా వాట్సాప్ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది కూడా ప్రజల్లో మంచి మార్కులు వేయించుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వచ్చే నెల నుంచి ప్రజల మధ్యకు చంద్రబాబు రానున్నారు. తొలుత పట్టణాలు, తర్వాత గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ప్రజలను కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఆగస్టు నుంచి రాష్ట్రంలో ఒక భిన్నమైనటువంటి పరిస్థితి, భిన్నమైన వాతావరణం స్పష్టంగా కనిపించనున్నాయి. ఇది ప్రభుత్వానికి మేలు చేస్తుంద‌ని అధికార వర్గం అంచ‌నా వేస్తోంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.