Begin typing your search above and press return to search.

అవక అవక ఏయూ స్నాతకోత్సవం...అంతలోనే రచ్చ రచ్చ

విశాఖలోని ఏయూ స్నాతకోత్సవాన్ని అవక అవక అనేక అవాంతరాల మధ్యన ఆగి ఎట్టకేలకు మంచి ముహూర్తం చూసుకుని నిర్వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:21 PM GMT
అవక అవక ఏయూ స్నాతకోత్సవం...అంతలోనే రచ్చ రచ్చ
X

విశాఖలోని ఏయూ స్నాతకోత్సవాన్ని అవక అవక అనేక అవాంతరాల మధ్యన ఆగి ఎట్టకేలకు మంచి ముహూర్తం చూసుకుని నిర్వహిస్తున్నారు. ఈ స్నాతకోత్సవం 2017 నుంచి అలా ఆగిపోయింది. ఈ మధ్యలో కరోనా వంటివి వచ్చి అసలు కాకుండా చేశాయి. ఫలితంగా వేలాది పట్టాలు అలాగే ప్రదానం కాకుండా పెండింగులో ఉండిపోయాయి. డాక్టరేట్లు చేసిన వారికి కూడా గవర్నర్ చేతుల మీదుగా పట్టా పుచ్చుకోవాలన్న కోరిక కలగా మారింది.

వాటికి ముగింపు ఇస్తూ ఈ నెల 9న ఏయూ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కులపతి హోదాలో ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. ఒకేసారి నాలుగేళ్ళ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ స్నాతకోత్సవాన్ని ఆపాలంటూ మరో వైపు విద్యార్ధి సంఘాలు ఉద్యమిస్తున్నాయి.

ఏయూలో స్నాతకోత్సవాన్ని రద్దు చేయాలని ఆంధ్ర యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పూర్వ విద్యార్థుల సమాఖ్య డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు ఏయూ వీసీని తక్షణమే రీ కాల్ చేయాలని వారు కోరుతున్నారు. విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మరీ విద్యార్ధి నేతలు ఏయూలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు.

ఎంతో ప్రతిష్ట కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చెల్లని రిజిస్టార్ సంతకంతో జరుగుతున్న ఏయూ స్నాతకోత్సవాన్ని తక్షణమే వాయిదా వేయాలని కోరుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలపై పలువురు మేధావులు, బాధితులతో కలిసి ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారు.

ఎలాంటి పద్ధతులు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా స్నాతకోత్సవం నిర్వహిస్తున్న ఏయు వీసీ ప్రసాద్ రెడ్డిని వెంటనే రీ కాల్ చేసి ఆంధ్ర యూనివర్సిటీని పరిరక్షించాలని వారు కోరారు. ఉన్నత న్యాయస్థానం అడ్మిషన్ నిలుపుదల చేసిన పరిశోధక విద్యార్థులకు పీ హెచ్ డీ డిగ్రీల ప్రధానం చేస్తున్న ఏయూ యాజమాన్యంపై, అధికారుల మీద తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇక ఏయూలో ఏకంగా 1400 పీ హెచ్ డీల అమ్మకాల మీద సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, ఉద్యోగ విరమణ వయస్సు 65ఏళ్ళు దాటినా రిజిస్ట్రార్ గా కొనసాగుతున్న ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చట్ట వ్యతిరేకంగా చెట్లు నరికేసి, లక్షలాది రూపాయల కలపను అక్రమంగా తరలించిన వ్యవహారంలో అటవీ శాఖ కేసులు పెట్టిన ఏయూ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అలగే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పేరిట వ్యక్తిగత ప్రతిష్ట, పలుకుబడిని పెంచుకోవడానికి ఏయూ భూములు, భవనాలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసిన వీసీ ప్రసాద్ రెడ్డి మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తో పాటు జనసేన, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొనడం విశేషం.

ఏయూ ని కాపాడాలని అంతా తీర్మానించారు. ఏయు వద్ద అన్ని పార్టీలతో కలుపుకొని మహా ధర్నాకు పిలుపునిచ్చారు.ఈ రౌండ్ టేబిల్ సమావేశంలో బీజేపీ పాల్గొనకపోవడం గమనార్హం. ఏయూ మీద మొత్తం విపక్షం గురి పెట్టి మరీ ఉద్యమానికి సిద్ధం కావడంతో ఈ నెల 9న ఏమి జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.