Begin typing your search above and press return to search.

హమాస్‌ "సూపర్‌ నోవా" ఇష్యూ... ఎన్నడూ చూడని నరమేధం!

అవును... మనిషి కనిపించడం ఆలస్యం గుండెల్లో బుల్లెట్లు దింపేస్తున్నారు.. దొరికితే పాయింట్ బ్లాంక్ లో కాలుస్తున్నారు.. పారిపోతుంటే వెంటపడుతున్నారు.. కాపుకాసి మరీ కాటేస్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా ఇజ్రాయేల్ లో జరిగిన ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ లో జరిగింది.

By:  Tupaki Desk   |   9 Oct 2023 9:00 AM GMT
హమాస్‌ సూపర్‌  నోవా ఇష్యూ... ఎన్నడూ చూడని నరమేధం!
X

ఇజ్రాయేల్ లో హమాస్ చేస్తున్న నరమేధం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు సరిగ్గా సరిపోయే ఒక ఉదాహరణ తెరపైకి వచ్చింది. సైనికులకు, ఉగ్రవాదులకూ ఉన్న తేడాను కళ్లకు కట్టినట్లు చూపించింది. దేశంపై యుద్ధం గెలవాలంటే సైన్యాన్ని మట్టుపెట్టాలని శత్రుదేశ సైనికులు చుస్తుంటారు. అయితే.. ప్రస్తుతం ఇజ్రాయేల్ పై దాడి చేస్తుంది... శత్రుదేశ సైనికులు కాదు... ఉగ్రవాదులు, నరరూప రాక్షసులు!

అవును... మనిషి కనిపించడం ఆలస్యం గుండెల్లో బుల్లెట్లు దింపేస్తున్నారు.. దొరికితే పాయింట్ బ్లాంక్ లో కాలుస్తున్నారు.. పారిపోతుంటే వెంటపడుతున్నారు.. కాపుకాసి మరీ కాటేస్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా ఇజ్రాయేల్ లో జరిగిన ఓ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ లో జరిగింది. ఈ ఫెస్టివల్ పై ముందుగానే సమాచారం అందుకున్న హమాస్ ముష్కరులు అత్యంత దారుణానికి పూనుకున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఇజ్రాయెల్‌ - గాజా సరిహద్దు సమీపంలోని నెగెవ్‌ ఎడారిలో కిబ్బట్జ్‌ రీం సమీపంలోని ఓ విశాల ప్రాంగణంలో "ట్రైబ్‌ ఆఫ్‌ నోవా" కంపెనీ "ది సూపర్‌ నోవా" పేరిట మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ను ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి సుమారు 3,000 మంది హాజరైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం పార్టీ జోరుగా సాగుతుంది. ఆ పార్టీలో పాల్గొన్న వారంతా ఉత్సాహంగా ఉన్నారు.

ఈ సమయంలో ఒక్కసారిగా ఎయిర్‌ డిఫెన్స్‌ సైరన్లు మోగడం మొదలవ్వడం, ఆ తర్వాత విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, కొన్ని నిమిషాల్లో పలు వ్యాన్లలో 50 మంది సాయుధ ముష్కరులు అక్కడికి చేరుకోవడం, ఆకాశం నుంచి రాకెట్లు దూసుకురావడం మొదలైపోయింది! ఈ సమయంలో లోపలికి ఎంటరైన ముష్కరులు ఫెస్టివల్ లో పాల్గొన్న జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరగపడం ప్రారంభించారు.

ఈ సమయంలో కార్లలో కొంతమంది తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ రద్దీఇలో అది వీలుకానప్పుడు పరుగులు పెడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరికొంతమంది... చనిపోయినట్లుగా నటిస్తూ అలా ఉండిపోయారు. కాల్పులు మొదలయ్యాక ప్రజలు ఎమర్జెన్సీ ఎగిట్స్ వైపు బయటకు వెళ్తారని గ్రహించిన ఉగ్రవాదులు అక్కడ వేచి ఉన్నారు.

దీంతో ఈ ద్వారాల నుంచి బయటకు వచ్చేవారిని కాల్చి చంపారు. ఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడినవారు... తమ జీవితంలో ఇలాంటి నరమేధం చూడలేదని చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు విదేశీయులు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది.

ఈ దాడి జరిగిన మూడు గంటల్లో ఇజ్రాయేల్ సైన్యం ఘటనాస్థలానికి చేరుకుందని అంటున్నారు. అప్పటికే ఈ ఒక్క మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ప్రాంగణంలోనే ఇప్పటి వరకు 260 మృతదేహాలను గుర్తించారు. దీంతో ఇజ్రాయెల్‌ పై హమాస్‌ ముష్కరులు జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 700కి చేరిందని తెలుస్తుంది.

ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ పై దాడి చేసిన హమాస్‌ ఉగ్రవాదులు దాదాపు 100 మందికిపైగా ఇజ్రాయెల్‌, విదేశీయులను కిడ్నాప్‌ చేశారని తెలుస్తుంది. ఈ మేరకు తాజాగా హమాస్‌ తమ వద్ద 100 మంది ఇజ్రాయెలీయులు ఉన్నారని ప్రకటించింది. అయితే తాము ఇంకా పూర్తిగా లెక్కపెట్టలేదని.. వీరి సంఖ్య 100కు పైగానే ఉంటుందని పేర్కొన్నారు. వీరిలో ఇజ్రాయెల్‌ సైన్యానికి చెందిన హై ర్యాంకింగ్‌ అధికారులు కూడా తమ వద్ద ఉన్నట్లు హమాస్ ఉగ్రవాదులు వెల్లడించారు!