Begin typing your search above and press return to search.

కొడాలి ఇంటి ముందు గుడ్లతో అటాక్!

ఈ సందర్భంగా... "దమ్ముంటే బయటకు రా" అంటూ వారు అవిరామంగా ఇంటిపైకి కోడిగుడ్లతో దాడి చేస్తూ.. కొడాలి నానీని రాజకీయ సన్యాసం చేయమని డిమాండ్ చేస్తున్నారు!

By:  Tupaki Desk   |   7 Jun 2024 10:36 AM GMT
కొడాలి ఇంటి ముందు గుడ్లతో అటాక్!
X

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ రోజు మొదలైన అవాంఛనీయ ఘటనల కొనసాగింపు.. ఫలితాలు వచ్చినప్పటికీ ఆగని పరిస్థితి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.. కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో.. కేంద్రంలో కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో.. ఏపీకి మంచిరోజులు వచ్చాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. డిమాండ్ చేసి తీసుకునే సమయం ఆసన్నమైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో ఓడిపోయిన వైసీపీ కార్యకర్తలపైనా, నేతల ఇల్లపైనా దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి! వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తీవ్ర భయాందోళన కలిగిస్తున్న పరిస్థితులు, ఏమాత్రం సమర్ధించడానికి నోచుకోని సన్నివేశాలు తెరపైకి వస్తున్నాయి. కూటమి నేతలు సెలబ్రేషన్స్ లో ఉంటే.. కార్యకర్తలు మాత్రం రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్న పరిస్థితి!

ఇందులో భాగంగా... ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై కొంతమంది పసుపు కండువాలు కప్పుకుని, తెలుగు యువత అని చెబుతూ కోడిగుడ్లతో దాడులకు పాల్పడటం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా... "దమ్ముంటే బయటకు రా" అంటూ వారు అవిరామంగా ఇంటిపైకి కోడిగుడ్లతో దాడి చేస్తూ.. కొడాలి నానీని రాజకీయ సన్యాసం చేయమని డిమాండ్ చేస్తున్నారు!

ఈ సమయంలో తెలుగు యువతను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా... లోకేష్ నాయకత్వంలో కొడాలి నానికి అంకుశం సినిమాలో రామిరెడ్డి పరిస్థితి కల్పిస్తామన్నట్లుగా తెలుగు యువత హెచ్చరికలు చేసింది. కొడాలి నాని జనాల్లో కనిపిస్తే అదే చివరి రోజు అని ప్రజలు భావిస్తున్నారంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేయడం గమనార్హం.

ఆ సంగతి అలా ఉంటే... గతంలో వైసీపీ శ్రేణులు చేసినట్లే, నేడు టీడీపీ శ్రేణులు చేస్తున్నారని.. ఇది ఏమాత్రం సహేతుకం కాదని.. అధికారం ఎవరికీ శాస్వతం కాదనే విషయం ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ప్రధానంగా అధికారంలోకి వచ్చేదే ప్రత్యర్థులపై ప్రతీకారాలు తీర్చుకోవడానికన్నట్లుగా అపరిపక్వతతోనో, అర్థజ్ఞానంతోనో ఆలోచించడం వల్ల ప్రజల్లో పార్టీ పలుచబడిపోతుందనే విషయం గుర్తించాలని చెబుతున్నారు.

పైగా సొంత కమ్యునిటీని బూతులు తిడితే వారు మరింత రెచ్చిపోతున్న పరిస్థితి అని అంటున్నారు. అయితే అది కొడాలి నానీ చేసినా, తెలుగు యువత అనే పేరుమీద కొంతమంది యువకులు చేసినా... ఇది ఏమాత్రం సమర్ధనీయం కాదు అనే విషయం అంతా గుర్తించుకోవాలి. ఈ విషయంలో ఆయా పార్టీల శ్రేణులకు సంయమనం పాటించాలని నేతలు హితవు పలకాలని కోరుతున్నారు.