Begin typing your search above and press return to search.

ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి.. అమరులైన నలుగురు సైనికులు

మరో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనాల్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు చేసిన మారణకాండలో నలుగురు సైనికులు అమరులయ్యారు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 3:58 AM GMT
ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి.. అమరులైన నలుగురు సైనికులు
X

మరో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనాల్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు చేసిన మారణకాండలో నలుగురు సైనికులు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్ లోని భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రదాడి సాగింది. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఇది రెండో దాడి కావటం.. ఒకే ప్రాంతంలో ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడటం గమనార్హం. తాజాగా పూంచ్ జిల్లాలో బుధవారం రాత్రి ఉగ్రదాడి చోటు చేసుకుంది.స

పూంచ్ జిల్లాలోని బుప్లియాయ్ సమీపంలో ఉగ్రవాదుల జాడ కోసం వేట సాగుతోంది. ఈ క్రమంలో రెండు వాహనాల్లో జవాన్లు అనుమానిత ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు. రాజౌరీ - ఠాణామండీ - సురన్ కోటే రోడ్డుపై సావ్ని అనే ప్రాంతానికి చేరుకోగానే.. అనూహ్య రీతిలో ఆర్మీవాహనాలపై ఉగ్రవాదులు దాడులకుపాల్పడ్డారు. ఆ వెంటనే స్పందించిన సైనికులు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు.

అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నలుగురు జవాన్లు ఉగ్రదాడిలో అమరులయ్యారు. ఈ దాడి ఉదంతం గురించి తెలిసినంతనే అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నా.. ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. వారిని గుర్తించే ఆపరేషన్ జరుగుతున్నట్లుగా రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిజానికి ఇక్కడో ఆపరేషన్ చేసేందుకు వెళుతున్న సైనికుల మీద ఉగ్రవాదులు మెరుపుదాడి చేయటం గమనార్హం.

విచారించాల్సిన విషయం ఏమంటే.. కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారటంతో పాటు సైన్యం మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్.. మే లో రాజౌరీ - పూంచ్ ప్రాంతంలో జరిగిన జంట దాడుల్లో పది మంది సైనికులు మరణించారు. గత నెలలోనూ ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు మరణించారు. గత రెండేళ్లలో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో 35 మందికి పైగా సైనికులు అమరులు కావటం ఆవేదనకు గురి చేసే అంశంగా చెప్పాలి.

తాజా ఉదంతంలో నలుగురు జవాన్లు మరణించగా.. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రమూక భరతం పట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. గడిచిన కొంత కాలంగా ఈ ప్రాంతంలో సాగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో.. మరింత సీరియస్ గా ఎదురుదాడి చేసి.. వారి అంతు చూడాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.