Begin typing your search above and press return to search.

రాజ‌స్థాన్‌లో ఘోరం.. రాజ్‌పుత్ కర్ని సేన అధ్యక్షుడి కాల్చివేత‌

ఘటన జరిగిన వెంటనే భారీగా పోలీసులు బలగాలను శ్యామ్‌నగర్ ప్రాంతంలో మోహరించారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 4:30 PM GMT
రాజ‌స్థాన్‌లో ఘోరం.. రాజ్‌పుత్ కర్ని సేన అధ్యక్షుడి కాల్చివేత‌
X

రాజస్థాన్‌లో ఘోరం జ‌రిగింది. రాజ‌ధాని జైపూర్‌లో స్థానిక పార్టీ `రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన` అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామోడీను దుండగులు కాల్చిచంపారు. ఏకంగా ఆయన ఇంట్లోకి చొరబడిన దుండ‌గులు ఆయనపై కాల్పులు జర‌ప‌డంతో తీవ్రంగా గాయపడిన గోగాను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఘటన జరిగిన వెంటనే భారీగా పోలీసులు బలగాలను శ్యామ్‌నగర్ ప్రాంతంలో మోహరించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. గన్‌మెన్ నరేంద్రపై కూడా దుండగులు కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు.

ఎవ‌రీ క‌ర్ని?

రాజ‌కీయంగా ప్రాధాన్యం ఉన్న `రాష్ట్రీయ కర్ని సేన`తో సుఖ్‌దేవ్ సింగ్‌కు ఎంతో కాలంగా అనుబంధం ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు కొద్దికాలం క్రితం కర్నిసేనతో విభేదాలు రావడంతో ఆయన `రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన` పేరుతో మరో పార్టీని ఏర్పాటు చేశారు. బాలీవుడ్ చిత్రం పద్మావత్, గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ ఎన్‌కౌంటర్ కేసు తర్వాత రాజస్థాన్‌లో జరిగిన పలు ధర్నాలతో ఆయన పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ అంశాలకు సంబంధించిన పలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

మేమే చంపాం!

రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన రోహిత్ గోదారా అనే వ్యక్తి ఈ హత్యకు బాధ్యత వహించాడు. తమ శత్రువులతో సుఖ్‌దేవ్‌కు సంబంధాలు ఉండేవని, వారికి సహకరించేవాడని.. అందుకే తాము అతడ్ని టార్గెట్ చేసి చంపేశామని సోషల్ మీడియాలో ఒక పోస్టులో రాసుకొచ్చాడు. ఈ హత్యకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని పేర్కొన్నాడు.

``నా పేరు రోహిత్ గోదార కపురిసార్. మంగళవారం జరిగిన సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు మేము పూర్తి బాధ్యత వహిస్తాము. అతడు మన శత్రువులను కలుసుకుని వారికి సహకరించేవాడు. వారిని పూర్తిగా బలపరిచేవాడని మాకు సమాచారం అందింది. అందుకే.. అతడ్ని చంపేశాం. ఇక మన శత్రువుల విషయానికొస్తే, మీరు ఇంటి గుమ్మం ముందే మీ శవపేటికల్ని సిద్ధం చేసుకొని ఉంచుకోండి. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాం’’ అంటూ రోహిత్ తన పోస్టులో పేర్కొన్నాడు.