ఆత్మకూరులో పాలిటిక్స్ ఎవరికి ప్లస్.. విజిటింగ్ లీడర్ ఎవరు..?
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ఆత్మకూరు. ఇక్కడ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పట్టు ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతాయి.
By: Garuda Media | 2 March 2026 7:00 PM ISTఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ఆత్మకూరు. ఇక్కడ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పట్టు ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతాయి. తాను పుట్టిన ప్రాంతమో.. లేక తనకు నచ్చిన ప్రాంతమో.. మొత్తానికి ఆనం వారికి ఈ నియోజకవర్గంపై ప్రేమ ఎక్కువగానే ఉంది. అయితే.. ఆయన ఇక్కడ గెలిచింది.. రెండుసార్లు మాత్రమే. 2009, 2024 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. దీనికి ముందు వైసీపీ విజయం దక్కించుకుంది.
అయితే.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ? ఆత్మకూరు రాజకీయాలు ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్ అవుతున్నాయి? అనేది ఆసక్తిగా మారింది. మంత్రిగా ఉన్నప్పటికీ ఆనం నియోజకవర్గాన్ని వదిలి పెట్టడం లేదు. తరచుగా కాదు.. వాస్తవానికి ఆయన నివాసం కూడా ఇక్కడే ఉంటున్నారు. అవసరం అయితే.. రాజధానిలో ఉంటున్నారు. సభలు, సమావేశాలు.. ఇతరత్రా పనుల నిమిత్తం మాత్రమే అమరావతికి వస్తున్నారు. మిగిలిన సమయం అంతా ఆయన సొంత నియోజకవర్గంలోనే పాగా వేస్తున్నారు.
దీంతో పార్టీ కార్యక్రమాలు సహా.. నియోజకవర్గంలో నాయకులకు అందుబాటులో ఉంటున్నారన్నది వాస్తవం. సమస్యలు పరిష్కరించడంలో కొంత వెనుకబడినా.. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఆనం వారికి కలిసి వస్తున్న అంశం. ఇక, గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి.. తరచుగా నియోజకవర్గానికి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన తన వ్యాపారాలు మాత్రమే చూసుకుంటున్నారు.
దీంతో విక్రమ్ రెడ్డి `విజిటింగ్ లీడర్` అనే టాక్ ప్రబలుతోంది. పైగా.. వైసీపీ కార్యకర్తలను ప్రోత్సహించే విషయంలోనూ ఆయన వెనుకబడ్డారు. కొంత ఖర్చు చేయాలని ఎవరైనా చెబితే.. ఆయన వెనుకాడుతు న్నారట. అంతేకాదు.. మీరు చూసుకోండి.. తర్వాత ఇస్తానంటూ స్థానిక నాయకులకు చెబుతుండడంతో నియోజకవర్గంలో ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక, ఆనం ఖర్చు విషయాన్నిపక్కన పెడితే.. అందరికీ అందుబాటులో ఉండడం ఆయనకు ప్లస్ అవుతోంది. ఇదేసమయంలో విక్రమ్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడం పెద్ద ఇబ్బందిగా మారుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పుంజుకుంటారో లేదో చూడాలి.
