Begin typing your search above and press return to search.

మహబూబ్ నగర్ సెంటర్ లో ఏటీఎంను వాహనంలో ఎత్తుకెళ్లారు

ఎలాంటి ఆధారాలు మిగల్చకుండా ఉండేందుకు తొలుత ఏటీఎంలోని సీసీ కెమేరాలను ధ్వంసం చేశారు.

By:  Garuda Media   |   28 May 2026 1:07 PM IST
మహబూబ్ నగర్ సెంటర్ లో ఏటీఎంను వాహనంలో ఎత్తుకెళ్లారు
X

ఏటీఎం మీద కన్నేస్తే.. అందులోని డబ్బుల్ని లక్ష్యంగా చేసుకోవటం చూశాం ఇంతకాలం. అందుకు భిన్నంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం.. నిత్యం రద్దీతో ఉండే ప్రాంతంలోని ఏటీఎంను టార్గెట్ చేసి.. అర్థరాత్రి వేళలో.. పక్కాగా ప్లాన్ చేసి.. ఎత్తుకెళ్లిపోయిన దారుణం తాజాగా సంచలనంగా మారింది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో ఎస్ బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఏటీఎం ఉంది. దీన్ని టార్గెట్ చేసుకున్న ముఠా ఒకటి.. అర్థరాత్రి దాటిన తర్వాత వాహనంలో వచ్చిన కొందరు ఏటీఎం సెంటర్ లో చొరబడ్డారు. ఎలాంటి ఆధారాలు మిగల్చకుండా ఉండేందుకు తొలుత ఏటీఎంలోని సీసీ కెమేరాలను ధ్వంసం చేశారు.

అనంతరం గ్యాస్ కట్టర్లు.. భారీ పరికరాలతో ఏటీఎంను పూర్తిగా పెకిలించి.. దాన్ని తమతో తెచ్చుకున్న వాహనంలో పెట్టేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. అర్థరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవటంతో.. అక్కడి పరిసరాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. దీంతో దోపిడీ ముఠాకు తమ పని పూర్తి చేసేందుకు సులువైంది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. పోలీసు యంత్రాంగం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది.

అర్థరాత్రి వేళలో.. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం నిర్వహించే పెట్రోలింగ్ సిబ్బంది ఏమయ్యారు? ఇంత జరుగుతున్నా.. ఎవరికి పట్టలేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ షాకింగ్ ఉదంతం గురించి సమాచారం అందుకున్నంతనే మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం.. డాగ్ స్వ్కాడ్ ను రంగంలోకి దించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దారుణానికి పాల్పడింది అంతరాష్ట్ర ముఠాగా భావిస్తున్నారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి.. వీరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరహా దోపిడీలను మొగ్గలోనే తుంచకపోతే.. రానున్న రోజుల్లో మరిన్ని ఘటనలకు అస్కారం ఉంటుందన్నది మరవకూడదు.