Begin typing your search above and press return to search.

దువ్వాడ ఫ్యామిలీ వల్ల కాదా...అచ్చెన్న కోసం కొత్త సెర్చింగ్...?

అచ్చెన్నాయుడు అయితే వైసీపీ నుంచి వచ్చే వారిని అందరినీ తమ పార్టీలో చేర్చుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:35 AM GMT
దువ్వాడ ఫ్యామిలీ వల్ల కాదా...అచ్చెన్న కోసం కొత్త సెర్చింగ్...?
X

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం ప్రతిష్టాత్మకమైనది అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఇది ఉమ్మడి ఏపీని ని కూడా ఆకట్టుకున్న సీటు. 1994లో అన్న గారు ఇక్కడ నుంచే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అలా టీడీపీకి బలమైన పునాది వేశారు. అయితే కాంగ్రెస్ బలం కూడా గట్టిగానే ఉంది. అలా కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చిన బలంతో గత రెండు ఎన్నికల్లో పోరాడి ఓడింది.

ఇక వైసీపీ ఆశలు అన్నీ 2024 ఎన్నికల మీదనే ఉన్నాయి. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరాలని వైసీపీ పట్టుదలగా ఉంది. కానీ టెక్కలిలో చూస్తే పరిస్థితులు అలా కనిపించడంలేదు అని అంటున్నారు. టెక్కలికి నిన్నటిదాకా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంచార్జిగా ఉన్నారు. ఆయన్ని కాదని ఆయన సతీమణి టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణికి పార్టీ పగ్గాలు ఇచ్చింది.

అయితే ఆమె పనితీరు పట్ల కూడా వైసీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. వైసీపీకి ఇంటా బయటా విభేదాలతో టెక్కలి ఏ విధంగా చూసినా ఇబ్బంది పెడుతోంది అనే అంటున్నారు. ఇక్కడ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పేడాడ తిలక్ కి దువ్వాడకు అసలు పొసగడంలేదు. దాంతో పాటు పార్టీ కూడా వర్గాలుగా చీలిపోయింది.

ఇక తనను తప్పించిన తరువాత నుంచి దువ్వాడ శ్రీనివాస్ పెద్దగా పట్టించుకోవడంలేదు అని అంటున్నారు. దీంతో వాణి కూడా అనుకున్న మేరకు అంచనాల మేరకు పనిచేయడంలేదు అని అంటున్నారు. దాంతో కొత్త వారి కోసం సెర్చింగ్ చేస్తున్నారు అని తెలుస్తోంది. అయితే టెక్కలికే చెందిన కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణికి ఇంచార్జిగా బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్నది పరిశీలిస్తున్నారు అని అంటున్నారు.

ఆమెకు కనుక బాధ్యతలు అప్పగిస్తే పేడాడ వర్గం కూడా సహకరిస్తుందని అంటున్నారు. ఇక దువ్వాడ వర్గాన్ని కూడా దారికి తెస్తే అచ్చెన్నాయుడు మీద గట్టి పోటీకి ఆస్కారం ఉంటుంది అని అంటున్నారు. ఈ విషయంలో హై కమాండ్ ఒక క్లారిటీకి వచ్చినట్లే అని అంటున్నారు.

ఇదిలా ఉంటే టెక్కలి వైసీపీలో విభేదాలతో టీడీపీ ఫుల్ జోష్ లో ఉంది. అచ్చెన్నాయుడు అయితే వైసీపీ నుంచి వచ్చే వారిని అందరినీ తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో సాధ్యమైనంత త్వరగా వర్గ పోరుకు తెర దించి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయాలని క్యాడర్ కోరుతోంది. ఇక టీడీపీ తీరు చూస్తే అచ్చెన్న కంటే లక్కీ ఎవరూ ఉండరని అంటోంది. ఆయన 2024 ఎన్నికలకు ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదని ధీమ వ్యక్తం చేస్తున్నారుట.