ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి! మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు.
By: Tupaki Desk | 22 July 2025 3:35 PM ISTఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నామని చెప్పిన ఆయన ఇంకా ఒక్క పథకం మాత్రమే మిగిలి ఉందని, అది చేయాలంటే ఏపీని అమ్మాల్సివస్తుందని వ్యాఖ్యానించారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం కింద విజయనగరం జిల్లా కొత్తవలస నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు సభలో మాట్లాడుతూ అలా వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. కొత్తవలస నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సాధించిన విజయాలను వివరించారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలు నెరవేరుస్తున్నామని చెప్పిన ఆయన ఇంకా ఒకే హామీ అమలు చేయాల్సివుందన్నారు. ఆ ఫ్లో లోనే ఆడబిడ్డ నిధి కోసం ప్రస్తావిస్తూ ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఆ హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
‘‘అన్నీ చేశాం.. ఒక్కటే మిగిలిపోయింది. ఆడవాళ్లకు రూ.1500 ఇవ్వాలి. ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి. అంత డబ్బు అవసరం ఉంది. అయినా ఆ పథకం ఎలా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు’’ అంటూ మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు చేశారు. ఆయన అలా మాట్లాడుతుండగా, కొందరు మహిళలు నవ్వడం వినిపించింది. గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో ఇప్పటికి నాలుగు హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వచ్చేనెల 15న ప్రారంభం కానుంది. ఇక అన్నదాతా సుఖీభవ పథకం కేంద్రంతోపాటే అమలు చేసేందుకు నిధులు సిద్ధం చేసింది. ఇలా నాలుగు హామీలను నెరవేర్చామని చెబుతున్న ప్రభుత్వం ఇంకా రెండింటిపై నోరు విప్పడం లేదు. అందులో ప్రధానమైనది ఆడబిడ్డ నిధి పథకం కాగా, మరొకటి నిరుద్యోగ భృతి. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు వయసు దాటిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున పంపిణీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.
అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున పథకాల అమలుకు కొంత సమయం కావాలని కోరుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏడాది తర్వాత నాలుగు పథకాలను పట్టాలెక్కించారు. ఇంకా మిగిలిన రెండు పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు సెగ రాజేసినట్లు భావిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు విపక్షానికి అస్త్రంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
