Begin typing your search above and press return to search.

చీరాలలో కొత్త చర్చ... ఆమంచి చీల్చేది ఎంత?

ఈ విషయంలో కొన్ని నియోజకవర్గాలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నా.. కొన్ని స్థానాల్లో పరిస్థితి మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నలు మిగులుస్తున్నాయని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   17 May 2024 10:16 AM GMT
చీరాలలో కొత్త చర్చ...  ఆమంచి చీల్చేది ఎంత?
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4 న ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఏయే నియోజకవర్గంలో ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతోంది.. ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి.. ఎవరు ఓట్లను చీల్చబోతున్నారు మొదలైన చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయంలో కొన్ని నియోజకవర్గాలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నా.. కొన్ని స్థానాల్లో పరిస్థితి మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నలు మిగులుస్తున్నాయని చెబుతున్నారు. అందులో చీరాల ఒకటని అంటున్నారు.

అవును... సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఫలితాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలోని పరిస్థితిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇందులో భాగంగా... ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో అటు వైసీపీ - ఇటు టీడీపీ మధ్య బిగ్ ఫైట్ కన్ ఫాం అని భావిస్తున్న సమయంలో ఆమంచి కృష్ణమోహన్ రూపంలో ట్రయాంగిల్ ఫైట్ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి చీరాల నియోజకవర్గం నుండి వైసీపీ తరపున తనకు టిక్కెట్ దక్కుతుందని చివరి నిమిషం వరకు ఎదురుచూసిన ఆమంచికి షాక్ తగిలింది! రకరకాల సమీకరణల నేపథ్యంలో... ఆ టికెట్ టీడీపీ నుండి వైసీపీలో చేరిన కరణం వెంకటేష్ కు దక్కింది. దీంతో... కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమంచి. హస్తం గుర్తుపై బీ ఫాం తెచ్చుకుని ఆ పార్టీ నుండి చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.

ఇక్కడ ఇక్కడ టీడీపీ తరపున మాలకొండయ్య యాదవ్ పోటీ చేస్తున్నారు. దీంతో చీరాలలో బలమైన ట్రయాంగిల్ ఫైట్ తెరపైకి వచ్చింది. పార్టీల పరంగా ఫైట్ పూర్తిగా టీడీపీ - వైసీపీల మధ్యే అనుకున్నా.. అభ్యర్థిగా మాత్రం ఆమంచి బలమైన నాయకుడనే చెప్పుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి.. నవోదయం పార్టీ తరపున ఆటోరిక్షా గుర్తు మీద పోటీ చేసి 10 వేల పైచిలుకు ఓట్లతో టీడీపీ అభ్యర్థి మీద విజయం సాధించారు.

అనంతరం వైసీపీలో చేరి 2019 ఎన్నికలలో ఆ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో 17 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు. అలా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన ఆమంచి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగగా.. టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీ నుంచి బరిలోకి దిగింది. దీంతో... చీరాల ఫలితాలపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... ఆమంచికి సొంత సామాజిక వర్గం కాపులతో పాటు ఎస్సీ, మత్స్యకార, పద్మశాలి వర్గాలు అండగా ఉంటాయని భావిస్తున్నారు. పైగ ఎమ్మెల్యే స్థానం వరకు తమకు ఓటు వేయాలని, ఎంపీ ఓటు ఎవరికి నచ్చినట్లు వారు వేసుకోవచ్చనే టైపు ప్రచారం ఆమంచి చేశారని చెబుతున్నారు. దీంతో... ఈ తరహా ప్రచారం కారణంగా... వైసీపీ ఓట్లు చీలుతాయా..? కూటమి ఓట్లకు గండి పడుతుందా..? అనే ఆందోళన ఆయా పార్టీల్లో మొదలైందని అంటున్నారు.

అదీ కాకపోతే... టీడీపీ, కూటమి ఓట్లను చీలి మధ్యస్థంగా ఆమంచి కృష్ణమోహనే గెలుస్తారా అనే చర్చా తెరపైకి వచ్చింది. దీంతో... చీరాలల గెలుపు అంశంపై ఎవరూ ధీమాగా చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు! మరి చీరాలలో ఆమంచి ఎవరిని ముంచారనేది తెలియాలంటే జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే!