Begin typing your search above and press return to search.

మన ఎమ్మెల్యేల ఆస్తుల లెక్కలు... షాకవ్వక తప్పదు!

నిత్యం ప్రజల క్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజల అవసరాల కోసం, దేశాభివృద్ధి కోసం పరితపించే మన ఎమ్మెల్యేల ఆస్తులు మొత్తం అర లక్ష కోట్ల పై మాటే అని తాజాగా వెల్లడైంది.

By:  Tupaki Desk   |   2 Aug 2023 10:26 AM GMT
మన ఎమ్మెల్యేల  ఆస్తుల లెక్కలు... షాకవ్వక తప్పదు!
X

భారతదేశం లో మెజారిటీ ప్రజానికం పేదవర్గాల ప్రజలే అని అంటుంటారు. వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలో అపర కుభేరులు ఉంటే... మొత్తం జనాభాలో 5శాతం వరకూ ఇన్ కం టాక్స్ కట్టగలిగే వాళ్లు ఉంటారని.. మిగతా ప్రజానికం అంతా పేద, దిగువ మధ్యతరగతి వారే ఉంటారని చెబుతుంటారు. కాసేపు ఈ జనాల సంగతి పక్కనపెట్టి ప్రజాసేవకుల విషయానికొస్తే... షాకవ్వకతప్పదేమో అనిపించినా అతిశయోక్తి కాదు!

నిత్యం ప్రజల క్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజల అవసరాల కోసం, దేశాభివృద్ధి కోసం పరితపించే మన ఎమ్మెల్యేల ఆస్తులు మొత్తం అర లక్ష కోట్ల పై మాటే అని తాజాగా వెల్లడైంది. సుమారు 150కోట్ల మంది భారతీయుల్లో 4001 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తుల మొత్తం మాత్రమే.

అవును... దేశం లోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది సిట్టింగ్ శాసనసభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.54,545 కోట్లని వెల్లడైంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్.ఈ.డబ్ల్యూ) తాజాగా విడుదల చేసిన నివేదిక లో దేశం లోని ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలు వెలుగుచూశాయి.

దేశం లో 4033 శాసనసభాస్థానాలకు గానూ... ప్రస్తుతం 4,001 స్థానాల కు సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. వీరిలో మెజారిటీ జనం దేశం లో ఉన్న 84 రాజకీయ పార్టీల కు చెందిన వారు కాగా.. అతి కొద్ది మంది స్వతంత్ర శాసనసభ్యుల. వీరందరి ఆస్తులను విశ్లేషిస్తే... బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కు చెందిన నేతలకే ఎక్కువ ఆస్తులున్నాయని తేలింది.

ఇలా దేశం లో రెండు పెద్ద జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల కు మొత్తం కలిపి రూ.32,032 కోట్ల ఆస్తులున్నాయని నివేధికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే... ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేల సగటు ఆస్తి విలువ రూ.13.63 కోట్లని వెల్లడైంది.

జాతీయ స్థాయి లో రెండు బలమైన పార్టీల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉంటే... ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైకాపాకు చెందిన శాసనసభ్యుల ఆస్తులు దేశం లోనే అత్యధికంగా ఉన్నాయి. ప్రస్తుతం 146 మంది వైకాపా ఎమ్మెల్యేల ఆస్తుల సగటు రూ.23.14 కోట్లని తేలింది. ఇదే సమయంలో తెలంగాణ లోని బీఆరెస్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తుల సగటు రూ.14కోట్లుగా ఉంది.

ఇదే సమయం లో దేశం లోనే అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు. కర్ణాటక లోని 223 మంది ఎమ్మెల్యేలకు మొత్తం రూ.14,359 కోట్ల ఆస్తులతో దేశం లోనే అగ్రభాగాన నిలిచారు. మహారాష్ట్రలోని 284 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తుల విలువ రూ.6,679 కోట్లు.

వీరి పరిస్థితి ఇలా ఉంటే... మరోపక్క ఈశాన్య రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తులు తక్కువగా ఉన్నాయి. మణిపూర్ రాష్ట్రం లోని 60 మంది శాసనసభ్యుల మొత్తం ఆస్తులు రూ.225 కోట్లుగా ఉన్నాయి. మిజోరం లోని 40మంది ఎమ్మెల్యేలకు రూ.190కోట్లు, త్రిపురలోని 59మంది శాసనసభ్యుల కు రూ.90 కోట్ల ఆస్తులున్నాయి.