Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో *స్క్రీన్‌* రివర్స్.. పవర్ పాయింట్ తో కడిగేయనున్న రేవంత్?

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులు, వాటి ద్వారా కలిగిన నష్టాలను ప్రజలకు వివరిస్తామని సీఎం రేవంత్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   19 Dec 2023 7:48 AM GMT
అసెంబ్లీలో *స్క్రీన్‌* రివర్స్.. పవర్ పాయింట్ తో కడిగేయనున్న రేవంత్?
X

మీకు గుర్తుందా.. అది 2016.. తెలంగాణ సీఎంగా కేసీఆర్.. తెలంగాణ ఏర్పడినప్పటికి ఉన్న పరిస్థితులు.. సాగు నీటి రంగం ఎలా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటి? అనే వివరాలతో శాసన సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. చర్చలు, వాదోపవాదాలకు కేంద్రంగా ఉండే అసెంబ్లీలో ఈ తరహా ప్రజంటేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ప్రభుత్వాల పాలనను ఇలా కూడా ఎండగట్టొచ్చా? అనే ఆలోచనను రేకెత్తించింది. అప్పుడు తెలంగాణ కొత్తగా ఏర్పడింది.. ముందున్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా ఆ ప్రాంతానికి అన్యాయం చేశాయో చెప్పేందుకు కేసీఆర్ పవర్ ప్రజంటేషన్ ఉపయోగపడింది.

మరిప్పుడు.. 2023.. కేసీఆర్ మాజీ సీఎం అయ్యారు. ఆయన స్థానంలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో వైఫల్యాలు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దానిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనపై కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్ స్థాయిలో పదేళ్ల బీఆర్ఎస్ హయాంపై రేవంత్ ఇవ్వనున్న ప్రజంటేషన్ కూడా ఆసక్తికరంగా మారనుంది.

స్క్రీన్ రివర్స్ అంటే ఇదేనేమో?

తెలంగాణ అసెంబ్లీలోకి త్వరలో స్ర్కీన్లు రానున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పాలనపై శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ వివరాలను అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వెల్లడించనుంది. అంటే.. గణాంకాలు సహా తెరపై చూపనుంది. దీనికోసం శాసనసభలోనే భారీ స్క్రీన్‌ ఏర్పాటు చేయనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులు, వాటి ద్వారా కలిగిన నష్టాలను ప్రజలకు వివరిస్తామని సీఎం రేవంత్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. అంటే.. సీన్ రివర్స్ తరహాలో స్ర్కీన్ రివర్స్ అన్నమాట.

రేపటి నుంచే.. తెరపైకి.. ఆ మూడింటిపైనే..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగియాల్సి ఉండగా.. బుధ, గురువారాలు కూడా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బుధవారం తిరిగి మొదలయ్యే సమావేశాల్లో శాఖల వారీగా వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా శ్వేతపత్రాలతో వెల్లడించనున్నారు. మరీ ముఖ్యంగా నీటి పారుదల, విద్యుత్తు, ఆర్థిక శాఖల గురించి వివరాలను వెల్లడించనున్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనున్నదో వివరిస్తారు. మరోవైపు శ్వేతపత్రాల రూపకల్పన కోసం ఆర్థిక నిపుణులు, ఇతర శాఖలపై పట్టున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు కలిపి 15–20 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని సమాచారం. రేవంత్ బాధ్యతలు చేపట్టాక అన్ని శాఖలపై వరుస సమీక్షలు చేపడుతున్నారు. ఏ శాఖకు ఎన్ని నిధులు వచ్చాయి? ఎంతమేర వినియోగించారు? ఎన్ని నిధు లు దుబారా అయ్యాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత పదేళ్లలో ప్రభుత్వ శాఖలకు వచ్చిన లాభ నష్టాలు, ఎన్ని అప్పులు తెచ్చారనే అంశంపైనా సమగ్ర వివరాలను సేకరించారు. అప్పుల్లో ఎంతమేర చెల్లింపులు చేశారు? ఇంకాఎంత చెల్లించాల్సి ఉందనే విషయాలనూ ఆరా తీశారు. శ్వేత పత్రాల విడుదల సందర్భంగా వీటిని ప్రస్తావించనున్నారు.

కాళేశ్వరం ప్రస్తావన కచ్చితం

అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ లో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగడం సహా నీటి పారుదల శాఖపై సవివరంగా ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. పియర్ల పునర్‌ నిర్మాణంపైనా స్పష్టతనివ్వనున్నట్టు సమాచారం. ఇక మిగిలినది విద్యుత్తు, ఆర్థిక శాఖల రివ్యూ. పొరుగు రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు, చెల్లింపులు, యూనిట్‌ ను ఎంతకు కొన్నారు? అందుకు చెల్లించిన నిధులెన్ని అనే వివరాలను ప్రజంటేషన్ లో వెల్లడించనున్నట్లు సమాచారం. తెలంగాణ అప్పుడు రూ.5 లక్షల కోట్లు అంటున్న నేపథ్యంలో..

ఆర్థిక శాఖపైనా సీఎం ఏం చెబుతారనే ఆసక్తి నెలకొంది. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితి మొదలుకుని ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడే నాటివరకు జరిగిన ఆర్థిక లావాదేవీలు, గత ప్రభుత్వం చేసిన అప్పులన్నింటిపై సవివరంగా శ్వేతపత్రాన్ని విడదల చేయనున్నట్టు తెలుస్తోంది.