Begin typing your search above and press return to search.

బావ బావమరుదుల గెలుపు కాదు మెజార్టీ మీదనే చర్చంతా!

ఎన్నికల వేళ లెక్కలన్ని గెలుపు చుట్టూ తిరుగుతుంటాయి. కానీ.. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఆయా స్థానాల్లో గెలుపు మీద కించిత్ సందేహం ఉండదు

By:  Tupaki Desk   |   17 Nov 2023 5:17 AM GMT
బావ బావమరుదుల గెలుపు కాదు మెజార్టీ మీదనే చర్చంతా!
X

ఎన్నికల వేళ లెక్కలన్ని గెలుపు చుట్టూ తిరుగుతుంటాయి. కానీ.. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఆయా స్థానాల్లో గెలుపు మీద కించిత్ సందేహం ఉండదు. అలాంటి నియోజకవర్గాలు తెలంగాణ విషయానికి వస్తే మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల.. మంత్రి హరీశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ ఇద్దరు ముఖ్య నేతల విజయంపై ఎలాంటి సందేమం లేదు. ప్రత్యేక సందర్భం.. సంచలనం.. అనూహ్యంలాంటివి ఏమైనా చోటు చేసుకుంటే తప్పించి.. బావ బావమరిది గెలుపుపై ఎవరికి ఎలాంటి అనుమానాల్లేవు.

కేసీఆర్ సర్కారుకు రెండు చక్రాల్లాంటి ఈ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడో ఆసక్తికర పోటీ మొదలైంది. వీరిద్దరి గెలుపు గురించి ఎవరూ మాట్లాడటం లేదు. వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందన్న దానిపైనే చర్చ సాగుతోంది. బావ బావమరిది మధ్య నడుస్తున్న మెజార్టీ పోటీలో అధిక్యత ఎవరు చూపుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సిరిసిల్ల నియోజకవర్గంనుంచి పోటీ చేసి వరుస విజయాలుసాధిస్తున్న కేటీఆర్ తన మొదటి ఎన్నికను 2009లో ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోకావొచ్చు.. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఈ మూడు ఎన్నికల్లో 2009లో కేటీఆర్ మీద పోటీ చేసిన రెబల్ అభ్యర్థి మహేందర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. త్రుటిలో తప్పినట్లుగా ఓటమి ముప్పు 171 ఓట్ల తేడాతో కేటీఆర్ బయటపడిపోయారు. లేదంటే.. ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనే వారు.2010 ఉప పోరులోనూ కాంగ్రెస్ అభ్యర్థిగామహేందర్ రెడ్డి పోరాడుతున్నారు. కానీ.. ఆయనకు మాత్రం అవకాశం దక్కట్లేదు.

2010లో 68వేల మెజార్టీ.. 2014లో 53 వేల మెజార్టీ.. 2018లో 89 వేల మెజార్టీతో విజయం సాధించారు. మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహేందర్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తరచూ అభ్యర్థుల్ని మారుస్తున్న బీజేపీ.. తాజా ఎన్నికల్లో ఒకప్పటి టీవీ యాంకర్ రాణి రుద్రమను బరిలోకి దింపింది. మంత్రిగా.. కేసీఆర్ సర్కారులో కీలక స్థానంలో ఉన్న కేటీఆర్.. నియోజకవర్గంలోని ఎవరైనా సరే.. ఏదైనా అడిగినంతనే యుద్ద ప్రాతిపదికన సాయం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయటం కనిపిస్తుంది.

దీంతో.. నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ.. ఎవరికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారన్న పేరుంది. కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య..కిందిస్థాయి కార్యకర్తల మధ్య సయోధ్య లేకపోవటం మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ కేటీఆర్ కు సానుకూలత ఉంది. కేటీఆర్ మీద పోటీ చేస్తున్న కేకే మహేందర్ రెడ్డి విషయానికి వస్తే.. లాయర్ గా సుపరిచితుడు.. హైదరాబాద్ లో స్థిరపడిన ఆయన.. వరుసగా ఓడిపోతున్నా పట్టువదలకుండా గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కాస్తంత సానుభూతి ఉంది. కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందన్న మాట తరచూ వినిపిస్తున్న వేళ.. నిజంగానే కాంగ్రెస్ గాలి భారీగా వీస్తే తప్పించి.. ఆయన గెలిచే అవకాశాలు తక్కువనే చెప్పాలి.

ఇక.. సిద్దిపేట విషయానికి వస్తే 1985 నుంచి కేసీఆర్.. 2004 నుంచి హరీశ్ రావులు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 38 ఏళ్ల నుంచి కేసీఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఏడోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో పోలైన ప్రతి పది ఓట్లలో 8 ఓట్లు హరీశ్ రావుకు పడటం గమనార్హం. తాజా ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిగా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పేరున్న పూజల హరిక్రిష్ణ నిలిచారు. అయితే..హరీశ్ బలం ముందు ఆయన్ను ఎదుర్కొనే శక్తి పెద్దగా ఉండదనే చెప్పాలి.

తాను మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికి సిద్దిపేట నియోజకవర్గంతో అనునిత్యం టచ్ లో ఉండే హరీశ్ రావు.. నియోజకవర్గానికి చెందిన వారు ఎవరైనా సరే.. ఎలాంటి అవసరమైనా సరే.. అందుబాటులో ఉంటారన్న పేరుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం మీద ఆయనకు తీవ్రమైన పట్టుంది. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 1,18,699 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన హరీశ్.. ఈసారి ఎన్నికల్లో అంతకు మించి మెజార్టీ సాధించి కేటీఆర్ కంటే ముందుండాలన్నట్లుగా ఆయన వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. మరి.. ఈ ఇద్దరు బావ బావమరిదుల్లో ఎవరు తమ అధిక్యతను ప్రదర్శిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.