Begin typing your search above and press return to search.

రాజాసింగ్‌ స్థానంలో అభ్యర్థి ఇతడేనా?

ఎన్నికలు దగ్గరపడ్డప్పటికీ ఇప్పటివరకు రాజాసింగ్‌ పై సస్పెన్షన్‌ ను ఎత్తేయకపోవడంతో ఇక ఆయనకు సీటు ఇచ్చే పరిస్థితి కూడా లేనట్టేనని అంటున్నారు

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:05 AM GMT
రాజాసింగ్‌ స్థానంలో అభ్యర్థి ఇతడేనా?
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 30న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ బీజేపీ ఇంకా తన అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు.

మరోవైపు బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌ కు ఈసారి సీటు లేనట్టేనని టాక్‌ నడుస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో రాజాసింగ్‌ గోషామహల్‌ నుంచి రెండుసార్లు బీజేపీ తరఫున విజయం సాధించారు.

మామాలుగా అయితే ఈసారి ఎన్నికల్లోనూ రాజాసింగే పోటీ చేయాల్సి ఉండేది. అయితే ఆయన గతేడాది ఒక మతంపై చేసిన విమర్శలు తీవ్ర కలకలానికి దారి తీశాయి. దీంతో బీజేపీ అధిష్టానం గతేడాది ఆగస్టులో రాజాసింగ్‌ ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఇప్పటివరకు ఆయనపై సస్పెన్షన్‌ ను ఎత్తేయలేదు.

ఎన్నికలు దగ్గరపడ్డప్పటికీ ఇప్పటివరకు రాజాసింగ్‌ పై సస్పెన్షన్‌ ను ఎత్తేయకపోవడంతో ఇక ఆయనకు సీటు ఇచ్చే పరిస్థితి కూడా లేనట్టేనని అంటున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. రాజాసింగ్‌ పై సస్పెన్షన్‌ ఎత్తేయాలని తమ పార్టీ అధిష్టానానికి చేసిన సిఫారసును అధిష్టానం తిరస్కరించిందని అంటున్నారు.

రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలులాంటివే ఇంతకుముందు బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ తదితరులు చేశారు. వారిపైన బీజేపీ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇప్పుడు రాజాసింగ్‌ పై సస్పెన్షన్‌ ఎత్తేస్తే వారు సైతం తమపై సస్పెన్షన్‌ ఎత్తేయాలని కోరవచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెన్షన్‌ కు గురయినవారినంతా ఒత్తిళ్లకు, సిఫార్సులకు తలొగ్గి తీసుకుంటే ప్రజల్లో పార్టీపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ ను తిరిగి పార్టీలోకి తీసుకోవడానికి ఇష్టపడటం లేదని సమాచారం. రాజాసింగ్‌ కు బదులుగా బీజేపీ తరఫున ఈసారి మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ పోటీ చేయొచ్చని చెబుతున్నారు.

ముఖేష్‌ గౌడ్‌ 2009లో కాంగ్రెస్‌ తరఫున గోషా మహల్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫునే బరిలోకి దిగి ఆయన ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. మరి రాజాసింగ్‌ ను కాదని ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ కు ఇస్తే ఆయన గెలవగలరా అనేది వేచిచూడాల్సిందే.

మరోవైపు రాజాసింగ్‌ ఏం చేస్తారనేది కీలకమవుతోంది. ఆయనపై బీజేపీ సస్పెన్షన్‌ ఎత్తేయకపోతే ఇండిపెండెంట్‌ గా బరిలోకి దిగే అవకాశముంది. అందులోనూ వ్యక్తిగత చరిష్మా కూడా ఉండటం, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఉండటంతో రాజాసింగ్‌ ను తేలిగ్గా తీసేయడానికి లేదు. ఈ నేపథ్యంలో గోషా మహల్‌ లో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.