Begin typing your search above and press return to search.

సోలో ఫైట్ పైనే దృష్టిపెట్టాయా ?

రాబోయే తెలంగాణా ఎన్నికలు చాలా రంజుగా ఉండబోతోంది. ఎందుకంటే చాలా ఎక్కువ పార్టీలో పోటీలో ఉండబోతున్నాయి

By:  Tupaki Desk   |   9 Oct 2023 2:30 PM GMT
సోలో ఫైట్ పైనే దృష్టిపెట్టాయా ?
X

రాబోయే తెలంగాణా ఎన్నికలు చాలా రంజుగా ఉండబోతోంది. ఎందుకంటే చాలా ఎక్కువ పార్టీలో పోటీలో ఉండబోతున్నాయి. ఇందులో కూడా సోలో ఫైట్ పైనే ఎక్కువపార్టీలు దృష్టిపెట్టాయి. బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఎంఐఎం ఉన్నప్పటికీ ఇది లిమిటెడ్ ఏరియాకు మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే ఓల్డ్ సిటిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకే ఎంఐఎం పరిమితమైంది. మిగిలిన చోట్లంతా బీఆర్ఎస్సే పోటీచేస్తుంది. కాబట్టి వీళ్ళపొత్తు లిమిటెడ్ ఏరియా పొత్తనే అనుకోవాలి.

ఇక కాంగ్రెస్, బీజేపీలు మాత్రం సోలో ఫైట్ అనే చెప్పాలి. వీళ్ళల్లో కూడా కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తుకు చర్చలు జరుగుతున్నాయి కానీ ఇప్పటివరకు ఏ సంగతి తేలలేదు. వామపక్షాలేమో రెండుపార్టీలకు కలిపి ఎనిమిది సీట్లు అడుగుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం చెరో రెండుసీట్లిస్తే ఎక్కువన్నట్లుగా మాట్లాడుతున్నదట. అందుకనే పొత్తు చర్చలు ఏమయ్యాయో తెలీలేదు. ఇక బీజేపీ అయితే ఒంటరిపోరాటమే అని తేలిపోయింది. ఇదే సమయంలో బీఎస్పీ, టీజేఎస్, టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీచేయటానికే మొగ్గుచూపుతున్నాయి.

ఇన్నిపార్టీలు ఒంటరిగా పోటీచేయటం వల్ల ఏమవుతుందంటే వాటి అభ్యర్ధులు గనుక గట్టి వాళ్ళయితే కనీసం 5 వేల ఓట్లవరకు చీల్చుకునే అవకాశముంది. టీడీపీకి ప్రతి నియోజకవర్గంలోను వెయ్యి నుండి నాలుగైదు వేల ఓట్లవరకు ఉంది. ఆ ఓట్లన్నీ టీడీపీకే పడితే గెలుస్తాడని అనుకుంటున్న అభ్యర్ధికి ఆ ఓట్లన్నీ మైనస్సనే చెప్పాలి. అలాగే బీఎస్పీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులు కూడా గట్టివాళ్ళయితే మిగిలిన పార్టీలకు నష్టమనే చెప్పాలి.

ఈ నేపధ్యంలోనే మూడు పెద్ద పార్టీల అభ్యర్ధులకు నాలుగు చిన్నపార్టీల అభ్యర్ధులనుండి గట్టిపోటీనే ఎదురవ్వబోతోందని అర్ధం. దీనివల్ల గెలుస్తామని అనుకుంటున్న అభ్యర్ధుల తలరాతలు మారిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. చిన్నపార్టీల అభ్యర్ధులు ఎక్కడా గెలిచే అవకాశాలు లేవు. కానీ పెద్ద పార్టీల అభ్యర్ధుల మీద తీవ్రమైన ప్రభావం చూపటం మాత్రం ఖాయం. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధినుండి ఏ పార్టీ మీద దెబ్బపడుతుందనేది సస్పెన్సుగా ఉండబోతోంది. అందుకనే రాబోయే ఎన్నికల్ల పోటీ మహారంజుగా ఉండబోతోంది.