Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు దరఖాస్తు కానీ బీఆర్ఎస్ లోనే ఉంటా.. మాట మార్చిన రేఖా నాయక్

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఒకేసారి 115 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Sep 2023 6:58 AM GMT
కాంగ్రెస్ కు దరఖాస్తు కానీ బీఆర్ఎస్ లోనే ఉంటా.. మాట మార్చిన రేఖా నాయక్
X

ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మాట మార్చారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తు కూడా చేసుకున్న ఆమె.. ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉంటానని చెబుతున్నారు. అంతే కాదు టికెట్ దక్కకపోతే రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని రేఖా నాయక్ ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి టికెట్ రాదనే సూచనల నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యే ఇలా మాట మార్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదా ముందుగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కేసీఆర్ మార్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి రేఖ నాయక్ ఇంకా ఆశలు వదులుకోలేరా? అనేది కూడా ప్రశ్నగా మారింది.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఒకేసారి 115 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల సిట్టింగ్లకు కేసీఆర్ మరో అవకాశం ఇవ్వలేదు. ఇందులో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా ఉన్నారు. ఖానాపూర్ లో ఆమెకు బదులు జాన్సన్ నాయక్ కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేసిన రేఖా నాయక్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఆమె భర్త శ్యాం నాయక్ వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతే కాకుండా వెంటనే ఆయన ఆసిఫాబాద్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేఖా నాయక్ పేరు మీద ఖానాపూర్ టికెట్ కోసం కూడా దరఖాస్తు సమర్పించారు. కానీ కాంగ్రెస్లో చేరకుండా రేఖా నాయక్ ఇంతవరకూ వేచి చూస్తున్నారు.

రేఖా నాయక్ కచ్చితంగా కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఖానాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని కచ్చితంగా ఓడిస్తానని ఆమె సవాలు చేయడమే అందుకు కారణం. కానీ ఇప్పుడు ఆమె మాట మార్చినట్లు చెబుతున్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని ఆమె చెప్పారు. పార్టీ నుంచి టికెట్ రాకపోతే రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. 12 ఏళ్లుగా బీఆర్ఎస్ కోసం పని చేశానని, ఇప్పుడు తనను మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని రేఖా నాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భర్త కాంగ్రెస్లో చేరడం ఆయన వ్యక్తిగత విషయం అన్నట్లు ఆమె మాట్లాడారు. అయితే కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోయే సూచనలు ఉండడంతో రేఖా నాయక్ మాట మార్చినట్లు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ విధానం. దీంతో భర్తను కాంగ్రెస్ నుంచి ఆసిఫాబాద్లో నిలబెట్టి.. ఆమె రెబల్ అభ్యర్థిగా ఖానాపూర్ లో పోటీ చేయాలన్నది రేఖా నాయక్ ప్లాన్ గా కనిపిస్తోంది.