Begin typing your search above and press return to search.

తీర్పుకి మూడు రాష్ట్రాలు సిద్ధం - పోలింగ్ కి కౌంట్ డౌన్

ఇదిలా ఉంటే 2016 నుంచి గడచిన పదేళ్ళుగా బీజేపీ అస్సాంలో అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్ అక్కడ బాగానే పుంజుకుంది.

By:  Satya P   |   8 April 2026 12:02 AM IST
తీర్పుకి  మూడు రాష్ట్రాలు సిద్ధం - పోలింగ్ కి కౌంట్ డౌన్
X

దేశంలో మూడు రాష్ట్రాలలో ప్రజా తీర్పునకు రంగం సిద్ధం అయింది. అస్సాం, కేరళ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది అస్సాంలోని 126 స్థానాలకు, కేరళలోని 140 స్థానాలకు పుదుచ్చేరిలోని 30 స్థానాలకు పోలింగ్ ఈ నెల 9న ఒకే దశలో జరగనుంది. దీంతో ప్రజలు ఏ పార్టీని లేదా కూటమిని అధికారంలోకి తెస్తారు అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ మూడు రాష్ట్రాలలో ఎన్డీయే కాంగ్రెస్ వామపక్ష కూటమి అగ్ర నేతలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా అయితే మూడు రాష్ట్రాలలో పర్యటించి మరీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి గట్టి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా అస్సాం కేరళ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. వామపక్షాలకు దేశంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. దానిని ఈసారి నిలబెట్టుకోవాలని ఎల్డీఎఫ్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. .

అస్సాంలో హోరా హోరీ :

ఇదిలా ఉంటే 2016 నుంచి గడచిన పదేళ్ళుగా బీజేపీ అస్సాంలో అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్ అక్కడ బాగానే పుంజుకుంది. అయితే మొగ్గు కొంత వరకూ బీజేపీకి కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో అస్సాంలో బీజేపీ వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రాంత అభివృద్ధి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు గత పదేళ్లు అస్సాంలో శాంతిని స్థాపించామని అయాన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అస్సాంలో ఈసారి అధికారం తమదే అని అంటోంది ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా మాట్లాడుతూ, తమ పార్టీకి జనాదరణ తధ్యమని ధీమాగా చెప్పారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో 663 మంది పురుషులు, 59 మంది మహిళలు సహా మొత్తం 722 మంది ఉన్నారు

కేరళలో నువ్వా నేనా :

ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికలలో అధికార ఎల్డీఎఫ్ విపక్ష యూడీఎఫ్ ల మధ్య నువ్వా నేనా అన్నంతగా ఎన్నికల యుద్ధం సాగింది. వరుసగా మూడవ సారి నెగ్గి హ్యాట్రిక్ సీఎం అనిపించుకోవడానికి పినరయి విజయన్ ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ఈసారి అధికారం తమదే అని ధీమాగా ఉంది బీజేపీ తన బలాన్ని ఈసారి పెంచుకోవాలని చూస్తోంది. నరేంద్ర మోడీ అయితే కేరళలో ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ అయితే ప్రచారంలో హోరెత్తించారు. ఇక్కడ 140 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా మొత్తం 2040 పోలింగ్ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించారు.

పుదుచ్చేరీ పోటా పోటీగా

ఈ నెల 9న పోలింగ్ జరగనున్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా భారీ ఎత్తున ప్రచారం సాగింది. మొత్తం 30 సీట్లు ఉన్న ఈ చిన్న యూటీలో పోటా పోటీగా అధికారం కోసం పోరు సాగడం విశేషం. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు కేంద్ర పాలిత ప్రాంతం అంతటా ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహించారు. బీజేపీ నేత అమిత్ షా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ డీఎంకే నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ ఎన్నికల ప్రచారాన్ని కీలక దశకు తీసుకెళ్ళారు. ఇక ఈ మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన జరుగుతుంది.